నాడు ధిక్కరించిన మమత నేడు మోదీతో భేటీకి సిద్ధం

22 Jul, 2021 20:24 IST|Sakshi
ఫైల్‌ ఫొటో

కలకత్తా: అసెంబ్లీ ఎన్నికల తర్వాత మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మమతా బెనర్జీ తొలిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. మే నెలలో యాస్‌ తుఫాను సమయంలో పశ్చిమ బెంగాల్‌ పర్యటనకు ప్రధాని మోదీ రాగా సీఎం మమత వ్యవహారించిన తీరు సంచలనమైన విషయం తెలిసిందే. ఐదు నిమిషాలు కూడా ఉండకుండా వెళ్లిపోయింది. అనంతరం ఎన్నికలు జరిగాయి. మూడోసారి అధికారం చేపట్టిన అనంతరం ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిని కలవడం ఆనవాయితీ.

ఆమె బాధ్యతలు చేపట్టి రెండు నెలలకు పైగా అయినా ఇప్పటివరకు ప్రధానిని కలవలేదు. తాజాగా గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీఎం మమత ఢిల్లీ పర్యటన వివరాలు వెల్లడించారు. రెండు, మూడు రోజుల్లో తాను ఢిల్లీ వెళ్తానని ప్రకటించారు. ‘రెండు, మూడు రోజుల్లో ఢిల్లీ వెళ్తా. ప్రధానిని కలుస్తా. దాంతోపాటు రాష్ట్రపతిని కూడా కలుస్తా’ అని తెలిపారు. దాదాపు మూడు నెలల తర్వాత మమతా ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. అయితే ఇది అధికారిక పర్యటన అని, రాజకీయ పర్యటన కాదని తృణమూల్‌ కాంగ్రెస్‌ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రధానితో చర్చించేందుకు వెళ్తున్నారని స్పష్టం చేస్తున్నారు. అనంతరం రాష్ట్రపతిని కలిసి పెగాసెస్‌ ఫోన్‌ ట్యాపింగ్‌పై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఇటీవల మమత మామిడిపండ్ల దౌత్యం కూడా నెరిపిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీకి మామిడిపండ్లు పంపించడం హాట్‌ టాపిక్‌గా మారింది.

ఢిల్లీ పర్యటనలో మరికొందరిని కలిసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. వీటితో పాటు ఢిల్లీలో రైతులు చేపడుతున్న ఆందోళనలకు మద్దతు పలకనున్నారని సమాచారం. ఇక పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ఎంపీలు వ్యవహరించాల్సిన తీరుపై చర్చించే అవకాశం ఉంది. కేంద్రంపై పోరాటం తీవ్రం చేస్తానని మమత ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రతిపక్ష నాయకులను కూడా మమత కలిసి చర్చించనున్నారని టీఎంసీ నేతలు చెబుతున్నారు.

>
మరిన్ని వార్తలు