Tamil Nadu: మాట తప్పం..!  గుబులు వద్దు.. 

17 Aug, 2021 06:52 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

హామీలన్నీ అమలు చేస్తాం 

అసెంబ్లీలో సీఎం స్టాలిన్‌ స్పష్టీకరణ 

వాడీవేడిగా అసెంబ్లీ సమావేశాలు 

అధికార, విపక్షనేతల మధ్య మాటలయుద్ధం 

‘‘అపోహలు వద్దు.. ఆందోళన చెందొద్దు.. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో ఇచ్చిన మాట తప్పం.. హామీలన్నీ నెరవేర్చి సంక్షేమ  రాజ్యం స్థాపిస్తాం.. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా క్షేమమే ధ్యేయంగా జనరంజక పాలన  అందించి చరిత్ర సృష్టిస్తాం’’అని ముఖ్యమంత్రి స్టాలిన్‌ శాసనసభలో స్పష్టం చేశారు.   

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను తప్పకుండా తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని, ఎవ్వరూ గుబులు చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అన్నారు. ప్రధాన ప్రతిపక్షనేత ఎడపాడి పళనిస్వామి అసెంబ్లీలో సంధించిన ప్రశ్నలకు ఈ మేరకు స్టాలిన్‌ బదులిచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం 2021–22 సంవత్సర సవరణలతో కూడిన ప్రణాళిక ప్రకటన, 2021–22 సంవత్సర వ్యవసాయ ఆర్థిక ప్రణాళికపై చర్చసాగింది.

అన్నాడీఎంకే సభ్యుడు ఆర్‌పీ ఉదయకుమార్‌ మాట్లాడుతూ, 2011లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత ఆర్థికమాంద్యాన్ని ఎదుర్కొంటూనే 1.83 కోట్ల రేషన్‌కార్డుదారులకు ఉచితబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారని, అయితే ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులు చక్కబట్టేందుకు రెండు లేదా మూడేళ్ల పడుతుందని చెప్పడాన్ని తప్పుపట్టారు. కాగా ఆర్థిక గణాంకాల పరిస్థితి ఏటికేడు మారిపోతుంటాయని, గతంతో పోల్చిచూడరాదని ఆర్థికమంత్రి పీటీఆర్‌ పళనివేల్‌ త్యాగరాజన్‌ విమర్శలను తిప్పికొట్టారు.  

పరస్పర విమర్శలు.. 
వృద్ధాప్య పింఛన్‌ను రూ.500 నుంచి రూ.1000కి పెంచామని మళ్లీ ఉదయకుమార్‌ చెప్పగా, ఈ పెంపు నిజమే, అయితే లబ్ధిదారుల్లో 25 శాతం వరకు తగ్గించి.. వారికి పింఛన్‌ చెల్లించలేదని ఆర్థికమంత్రి ప్రతిదాడి చేశారు. ఈ సమయంలో ప్రతిపక్ష నేత ఎడపాడి పళనిస్వామి కలుగజేసుకుంటూ..జయలలిత అర్హులందరికీ వృద్ధాప్య పింఛన్‌ అందజేశారు, అదనంగా 60 శాతం మంది లబ్ధిదారులను పింఛన్‌ పథకం కిందకు తెచ్చారని తెలిపారు. వృద్ధాప్య పింఛన్లు, విద్యార్థులకు ఉచిత ల్యాబ్‌ట్యాబ్, మధ్యాహ్న భోజన పథకం తదితర సంక్షేమ పథకాల అంశాలపై అ«ధికారపక్ష, విపక్ష నేతల మధ్య వాగ్వాదం చోసుకుంది.  

రుణాల రద్దులో జాప్యానికి కారణం అదే.. 
సీఎం స్టాలిన్‌ మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తమ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసినందున ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వెనకడుగు వేయబోమని చెప్పారు. గతంలో కొన్ని కోట్ల రూపాయల అవకతవకలు చోటుచేసుకున్నందునే రైతుల పంట రుణాలు, బంగారు నగలపై పొందిన రుణాల రద్దులో జాప్యం ఏర్పడుతోందన్నారు. వాటన్నింటినీ సరిచేసి రుణాలను రద్దు చేస్తామన్నారు. ప్రజలకు ఉచితంగా సెల్‌ఫోన్‌ పంపిణీ, ఆవిన్‌ పాలు లీటరు రూ.25కు అందజేస్తామని ప్రకటించారు.   

గతంలో మీరిచ్చినవి..
ఇంటింటికీ అమ్మతాగునీరు ఉచిత సరఫరా, తక్కువ ధరకు ఫలసరుకులు, అమ్మబ్యాంకు కార్డు, కో ఆప్‌టెక్స్‌లో వస్త్రాల కొనుగోలుపై రూ.500 ఉచితం అంటూ 2011లో ఇచ్చిన హామీని అన్నాడీఎంకే ప్రభుత్వం నెరవేర్చిందా...? చెన్నైలో మోనోరైల్‌ పథకానికి శంకుస్థాపన చేశారు, నిర్మాణం చేపట్టారా..? కరుణానిధి తీసుకొచ్చిన మెట్రోరైల్‌ సేవలే నేడూ అందుతున్నాయి అంటూ.. స్టాలిన్‌ ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు. ఎడపాడి పళనిస్వామి కలుగజేసుకుంటూ అన్నదాతలకు రెండు ఎకరాల భూమి అని ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చారు, ఇప్పటి వరకు ఎంతమంది రైతులకు పంపిణీ చేశారో చెప్పాలని ప్రశ్నించారు.

కాగా భూమి లేని పేద రైతులకు రెండు ఎకరాల చొప్పున తప్పకుండా పంపిణీ చేస్తామన్నారు. అలాగే ఎన్నికల ప్రచారంలో డీఎంకే ఇచ్చిన అన్ని హామీలను కచ్చితంగా నెరవేరుస్తామని స్టాలిన్‌ అన్నారు. ఈ విషయంలో ఎవ్వరూ అనుమాన పడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. మదురై ఆధీనం సహా ఇటీవల మరణించిన రాజకీయ ప్రముఖులకు సమావేశం ఆరంభంలోనే సంతాపం  ప్రకటిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. 

మరిన్ని వార్తలు