CM MK Stalin: ఒక మహిళ చమత్కారం.. స్టాలిన్‌ నవ్వులు

22 Sep, 2021 09:11 IST|Sakshi
ప్రజలతో మాట్లాడుతున్న సీఎం స్టాలిన్‌  

ఆయన ఓ పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి. చుట్టూ భారీ కాన్వాయ్, మందీమార్బలం లేకుండా సహజంగా ఏ సీఎం కూడా కాలు బయటపెట్టరు. అయితే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అందుకు భిన్నంగా వ్యవహరించారు. సాధారణ పౌరుడిలా ‘ఎన్నమ్మా..సౌఖ్యమా’  (ఏమ్మా క్షేమంగా ఉన్నారా) అంటూ ప్రజలను నేరుగా పలుకరించి ‘వావ్‌ గ్రేట్‌’ అనిపించుకున్నారు. స్టాలిన్‌తో స్థానికులు అపూర్వమైన అనుభూతిని పంచుకున్నారు. వివరాల్లోకి వెళ్లితే.. 

సాక్షి, చెన్నై(తమిళనాడు):  ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తన ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ చూపుతుంటారు. ప్రతి రోజూ ఉదయం నగరంలో సైక్లింగ్, జాగింగ్‌ చేయడం ఆయనకు అలవాటు. సీఎం అయిన తరువాత ఈ ఏడాది ఆగస్టులో చెన్నై నుంచి 50 కిలోమీటర్ల దూరంలోని మహాబలిపురం వరకు సైకిల్‌లో వెళ్లిన విషయం తెలిసిందే. మంగళవారం చెన్నై అడయారు ఆలమరం ప్రాంతానికి జాగింగ్‌ కోసం వెళ్లారు.

అదే సమయంలో స్థానికులు జాగింగ్‌ చేస్తూ స్టాలిన్‌కు తారసపడ్డారు. వారిని చూడగానే స్టాలిన్‌ రోడ్డుపై నిలబడి మాట కలిపారు. క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. వారిలో ఒక మహిళ.. ‘మిమ్మల్ని రెండేళ్ల క్రితం విమానాశ్రయంలో కలుసుకున్నాను, సీఎం కావాలని శుభాకాంక్షలు తెలిపాను, అయితే సెల్ఫీ తీసుకోవడం మిస్‌ అయ్యాను’ అంటూ పాత జ్ఞాపకాలను గుర్తు చేశారు. ‘మీరు సీఎం అయ్యాక ప్రతి ఒక్క విషయంలోనూ ఆచితూచి అడుగువేస్తున్నారు..చాలా గర్వకారణంగా ఉంది’ అంటూ మరో మహిళ ప్రశంశించారు.

‘మేమంతా ఎంతో సంతోషంగా ఉన్నాం.. ఈ మంచి రోజులు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాము’ అని ఇంకో మహిళ స్టాలిన్‌తో అన్నారు. ‘అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ పోటీలకు వెళ్లిన మీ మనుమడు విజయం సాధించాలని కోరుకుంటున్నాము’ అని ఓ స్థానికుడు చెప్పడంతో సీఎం వెంటనే ధన్యవాదాలు తెలిపారు. ‘ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని చూస్తున్నాం..మార్కెండేయుల్లా ఉన్నారే’ అంటూ ఆయన గ్లామర్‌పై ఒక మహిళ చమత్కరించడంతో స్టాలిన్‌ పెద్ద పెట్టున నవ్వగా పరిసరాల్లో ఉన్నవారంతా ఆయనతో కలిసి నవ్వులు చిందించారు.

ప్రతి రోజూ వ్యాయామం చేస్తా, ఆహారంలో జాగ్రత్తలు పాటిస్తా అని తన యవ్వన, ఆరోగ్య రహస్యాన్ని స్టాలిన్‌ ప్రజలతో పంచుకున్నారు. స్టాలిన్‌తో పాటు జాగింగ్‌లో పాల్గొన్న ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్, బందోబస్తుగా వెళ్లిన పరిమిత సిబ్బంది సైతం స్థానికులతో సీఎం సంభాషణను ఎంతో ఎంజాయ్‌ చేశారు. సుమారు అర గంటకు పైగా సాగిన ఈ పిచ్చాపాటీతో ఆ పరిసరాలన్నీ సందడిగా మారాయి. 

చదవండి: ‘రేవంత్‌ దమ్ముంటే హుజూరాబాద్‌లో డిపాజిట్‌ తెచ్చుకో’

మరిన్ని వార్తలు