ప్రధాని మోదీతో ముగిసిన యూపీ సీఎం యోగీ భేటీ

11 Jun, 2021 13:59 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ శుక్రవారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న ఉత్తర్‌ప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ నుంచి జితిన్‌ ప్రసాద బీజేపీలో చేరారు. కాగా రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని బీజేపీ అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. బీజేపీ పెద్దలు ముఖ్యమంత్రి యోగిపై అసంతృప్తిగా ఉన్నట్టు పలువురు పేర్కొంటున్నారు. ఇటీవల సీఎం యోగి పుట్టినరోజుకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు చెప్పకపోవడానికి కారణం ఇదేనంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. 

యోగిపై యూపీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల్లో నెలకొన్న అసంతృప్తి, బ్రాహ్మణులు బీజేపీపై గుర్రుగా ఉన్నారని, పార్టీకి దూరమయ్యే ప్రమాదముందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ చేయాలని యోగికి ఆదేశించినట్టు తెలిసింది. కాగా కాంగ్రెస్‌ నుంచి వచ్చిన జితిన్‌ ప్రసాదకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక ఢిల్లీ పర్యటనపై సీఎం యోగీ ట్విట్టలో స్పందించారు. "ఈ రోజు, ప్రధాని మోదీతో సమావేశమయ్యాను. ఆయన మార్గదర్శకత్వం పొందే భాగ్యం నాకు లభించింది. ఆయన బిజీ షెడ్యూల్ నుంచి సమయం కేటాయించినందుకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను." అంటూ ట్వీట్ చేశారు.

చదవండి: మందు బాబులకు శుభవార్త: ఇక ఇంటికే మందు చుక్క!

మరిన్ని వార్తలు