సీఎం యోగి Vs అఖిలేష్‌.. మాఫియాకు గాడ్‌ఫాదర్‌ అంటూ.. 

25 Feb, 2023 16:17 IST|Sakshi

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌, సమాజ్‌వాదీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఓ హత్య కేసులో సాక్షిగా ఉన్న వ్యక్తిని బహిరంగంగా చంపడంపై సభలో వీరిద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ సందర్భంగా సీఎం యోగి.. మాఫియాను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ సంచలన కామెంట్స్‌ చేశారు. 

అయితే, రాజు పాల్ హత్య కేసులో ప్రధాన సాక్షి అయిన ఉమేశ్ పాల్ శుక్రవారం దారుణ హత్యకు గురయ్యాడు. ఉమేశ్‌.. తన నివాసంలో ఉండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్‌ బాంబులతో దాడిచేసి, కాల్పులు జరపడంతో ఆయన మృతిచెందారు. అయితే, యూపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ దారుణ ఘటనపై యోగి సర్కార్‌పై మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో యూపీ ప్రభుత్వం, పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని సభలో ఫైర్‌ అయ్యారు. ఉమేశ్‌ హత్యలో గ్యాంగ్‌ వార్‌ వంటి పరిస్థితి కనిపించదన్నారు. 

ఈ క్రమంలో అఖిలేష్ యాదవ్‌కు సీఎం యోగి కౌంటర్‌ ఇచ్చారు. సభలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మాట్లాడుతూ.. బాధితుల కుటుంబం ఆరోపించిన అతిక్‌ అహ్మద్‌ సమాజ్‌వాదీ పార్టీకి చెందిన వ్యక్తి, మాజీ ఎంపీ అని అన్నారు. మీరు (సమాజ్‌వాదీ పార్టీ) నేరస్తులకు మద్దతిస్తున్నారు. వారికి పూలమాలలు వేసి స్వాగతిస్తున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి నాటకాలు ఆడుతున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాఫియాలో అతిక్‌ అహ్మాద్‌ కూడా భాగమే. ఇలాంటి చర్యలను మేము అసలు సహించమని అన్నారు. మాఫియాను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఈ సమయంలోనే సీఎం యోగి సంచలన ఆరోపణలు చేశారు. అఖిలేష్‌ యాదవ్‌ మాఫియాకు గాడ్‌పాధర్‌ అంటూ ఆయన వైపు వేలు చూపిస్తూ యోగి కామెంట్స్‌ చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి చోటుచేసుకుంది. 

 దీంతో అఖిలేష్‌ యాదవ్ సభలో మాట్లాడారు. ‘నేరస్థులు మీ వాళ్లే’ అంటూ ఎదురుదాడికి దిగారు. ‘రామరాజ్యం’లో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ‘పట్ట పగలే కాల్పులు జరుగుతున్నాయి. బాంబులు విసురుతున్నారు. సాక్షిని చంపారు. పోలీసులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తోంది? డబుల్ ఇంజన్‌లు ఎక్కడ ఉన్నాయి? ఇది సినిమా షూటింగా?’ అంటూ మండిపడ్డారు.

ఇదిలా ఉండగా.. 2015లో రాజు పాల్‌ హత్య జరిగింది. అయితే, రాజు పాల్‌.. అలహబాద్ (పశ్చిమ) నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. కాగా, విజయం సాధించిన కొద్ది నెలల్లోనే ఈ దారుణం జరిగింది. ఇక, ఎన్నికల్లో మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ సోదరుడు ఖలీద్ అజీంను రాజు పాల్‌ ఓడించారు. మరోవైపు.. ఈ కేసులో అతిక్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే అష్రఫ్ నిందితులుగా ఉండటం గమనార్హం. 

మరిన్ని వార్తలు