అసెంబ్లీలో అఖిలేష్‌ నోట అసభ్యకరమైన పదాలు.. సీఎం యోగి రియాక్షన్‌ ఇది

26 May, 2022 11:22 IST|Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీలో బుధవారం ఆసక్తికర పరిణామాలు.. అదీ వాడీవేడిగా కొనసాగాయి. ప్రతిపక్ష నేత, ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ నోటి నుంచి అసభ్య పదజాలం వెలువడగా.. జోక్యం చేసుకున్న సీఎం యోగి ఆయన్ని తీవ్రంగా మందలించారు. 

ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా అధికార-ప్రతిపక్ష నేతల మాటల యుద్ధంతో బుధవారం అట్టుడికిపోయింది. తన హయాంలో జరిగిన అభివృద్ధినే బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు తమ ఘనతగా చూపించుకుంటోందని అఖిలేష్‌ పదే పదే ప్రకటించుకున్నారు. దీనికి కౌంటర్‌గా  డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య చేసిన వ్యాఖ్యలతో చిర్రెత్తుకొచ్చిన అఖిలేష్‌ యాదవ్‌.. ఒకానొక టైంలో సభలోనే అనుచిత వ్యాఖ్యలు చేశారు.

అఖిలేష్‌ అధికారంలో ఉన్నప్పుడు.. తన పాలన గురించి గొప్పగా చెప్పుకునేవారు. అదే నిజమైతే ఆయన పార్టీని జనాలు.. ఎన్నికల్లో ఊడ్చిపడేసేవాళ్లు కాదు కదా! అని మౌర్య వ్యాఖ్యానించారు. అలాగే తన హయాంలో సంక్షేమ పథకాల గురించి అఖిలేష్‌ పదే పదే చెప్పుకుంటున్నారని, దీనికి ఆయనకు చికిత్స అవసరమంటూ వ్యాఖ్యానించారు. రోడ్లు, మెట్రో, ఎక్స్‌ప్రెస్‌వే.. ఇవన్నీ సైఫాయ్‌లోని మీ భూములు అమ్మి కట్టించారా? అంటూ మండిపడ్డారు మౌర్య. 

ఈ కామెంట్లతో చిర్రెత్తుకొచ్చిన అఖిలేష్‌ యాదవ్‌.. ఒక్కసారిగా అసభ్య పదజాలంతో మౌర్యపై విరుచుకుపడ్డాడు. దీంతో జోక్యం చేసుకున్న సీఎం యోగి ఆదిత్యానాథ్‌.. అఖిలేష్‌ను మందలించారు.

‘‘సభలో అదీ గౌరవ సభ్యుడ్ని ఉద్దేశించి అలా మాట్లాడడం ఎంతమాత్రం సరికాదు. ఇక్కడ విషయం సైఫాయ్‌ గురించి కాదు. అభివృద్ధి పనులు చేయడం.. పర్యవేక్షించడం ప్రభుత్వంగా మా విధి. సంక్షేమ పనులను, అభివృద్ధిని ప్రకటించుకునే హక్కు మాకు కూడా ఉంది. డిప్యూటీ సీఎం ఇదే విషయాన్ని చెప్పదల్చుకున్నారు. ఆయన ఏం చెప్తున్నారో మీరు ముందుగా వినాల్సింది. ప్రతిపక్ష సభ్యులు చాలామంది చేసే తప్పు ఇదే. ఇది అంగీకరించాల్సి విషయం. అంతేగానీ.. అంతగా ఉద్రేకపడాల్సిన అవసరం లేదు. సభలో సభ్యతతో వ్యవహరిస్తే మంచిది అని మందలించారు. అంతేకాదు సభ రికార్డుల నుంచి అఖిలేష్‌ వ్యాఖ్యలను తొలగించాల్సిందిగా స్పీకర్‌ సతీష్‌ మహానాకు సీఎం యోగి రిక్వెస్ట్‌ చేశారు.

అంతకు ముందు రోజు(మంగళవారం) అసెంబ్లీలో ఎస్సీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ చేసిన బాయ్స్‌ విల్‌ బాయ్స్‌ కామెంట్లు తీవ్ర దుమారం రేపాయి. అత్యాచారాలకు మరణశిక్ష విధించాలన్న వాదనను వ్యతిరేకిస్తూ.. అబ్బాయిలు అబ్బాయిలే.. కొన్నిసార్లు తప్పులు జరుగుతుంటాయి అంటూ ములాయం వ్యాఖ్యలు చేశారు. అయితే యూపీలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ అసెంబ్లీ సమావేశాల్లో అఖిలేష్‌ వ్యాఖ్యలకు.. సీఎం యోగి ‘ములాయం వ్యాఖ్యలను’ వ్యాఖ్యలను కౌంటర్‌గా తెరపైకి తెచ్చారు.

మరిన్ని వార్తలు