అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ రాజధాని కాదు

16 Sep, 2022 03:34 IST|Sakshi

అసెంబ్లీలో గణాంకాలతో సహా వివరించిన సీఎం వైఎస్‌ జగన్‌

చంద్రబాబు, దుష్టచతుష్టయం మోసం చేస్తున్నారు

బాబు దృష్టిలో 35 వేల ఎకరాలిచ్చిన వారు మాత్రమే రైతులు

నా దృష్టిలో రైతు భరోసా అందుకుంటున్న 50 లక్షల మందీ రైతులే 

చంద్రబాబు లెక్కల ప్రకారమే ఇక్కడ మౌలిక వసతులకే రూ.1.10 లక్షల కోట్లు పెట్టాలి. కానీ ఇప్పటి వరకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన రూ.1.05 లక్షల కోట్లు కేటాయించాలంటే కనీసం వంద సంవత్సరాలు పడుతుంది. కేవలం రోడ్లు, డ్రైనేజీకి, కరెంట్‌ కోసం పెట్టే రూ.లక్ష కోట్లు వందేళ్లలో ద్రవ్యోల్బణం వల్ల కనీసం రూ.20 లక్షల కోట్ల నుంచి రూ.30 లక్షల కోట్లు అవుతుంది. మనం దీన్ని ఏ రకంగా పూర్తి చేయగలుగుతాం? ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.   
 – సీఎం వైఎస్‌ జగన్‌ 

సాక్షి, అమరావతి:  ‘చంద్రబాబుతో పాటు దుష్టచతుష్టయం సభ్యులందరూ వాళ్ల పేపర్లలో, టీవీల్లో కామన్‌గా చెబుతున్నట్లు అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ రాజధాని కానే కాదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. వికేంద్రీకరణ అంశంపై గురువారం ఆయన శాసనసభలో జరిగిన చర్చలో స్పష్టమైన సమాధానాలిచ్చారు. ‘ఇక్కడ మొత్తం 5,817 ఎకరాల భూమి అందుబాటులో ఉంది.

గ్రీన్‌ ట్రిబ్యునల్, రివర్‌ కన్జర్వేషన్‌ పరిధిలో ఉన్న ప్రాంతాలు అంటే కృష్టా నదీ పరీవాహక ప్రాంతాలు దాదాపు 820 ఎకరాలు ఉన్నాయి. లంక భూములు,  ఎన్జీటీ, నదీ గర్భంలో ఉన్నవి, కరకట్ట భూములు కూడా ఉన్నాయి. ఆ 820 ఎకరాల భూమి అమ్మాలనుకున్నా ఎన్జీటీ కోర్టు అంగీకరించదు. ఈ భూములు తీసేస్తే 4,997 ఎకరాల భూమి ఉంది. 2019 ఫిబ్రవరి 5న చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారమే 5,020 ఎకరాలు మాత్రమే కమర్షియల్‌ ఎక్స్‌ప్లాయిటేషన్‌కు ఉంది అని చెప్పారు.

(జీవో కాపీ ప్రదర్శిస్తూ) కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 దొంగల ముఠా సభ్యులందరూ కూడా 10 వేల ఎకరాలు, 20 వేల ఎకరాలు ఉన్నాయని చెబుతున్నారు. అందరూ కలిసి ప్రజలను మోసం చేస్తున్నారు’ అని సీఎం మండిపడ్డారు. ఈ చర్చలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

నిజంగా అంత ధర ఉందా?
► చంద్రబాబు లెక్క ప్రకారం 5,020 ఎకరాలు మాత్రమే ఉంది. ఆ భూమిని ఎకరాకు రూ.20 కోట్ల చొప్పున అమ్మితేనే రూ.లక్ష కోట్లతో రోడ్లు, డ్రైనేజీ, కరెంటు ఇవ్వగలం. నిజంగా ఈ రోజు ఇంత ధర ఉందా ? ఇంత ధరకు చంద్రబాబు కొంటారా? పోనీ రామోజీరావు కొంటారా? రాధాకృష్ణ కొంటారా? పోనీ టీవీ–5 నాయుడు కొంటారా? 
► ఇంత ధర లేనప్పుడు ఎకరా రూ.10 కోట్లకు కొంటారా? అని వీళ్లు మనల్ని తిరిగి అడుగుతున్నారు. ఈ మధ్య ఈనాడు రాసింది (ఆ పత్రిక క్లిప్పింగ్‌ను స్క్రీన్‌పై ప్రదర్శిస్తూ). మీరే ఎకరా రూ.10 కోట్లకు ఎవరైనా కొంటారా అని నేను అడుగుతున్నారు.  మరి ఈ ప్రాజెక్టు ఎలా చేయగలుగుతాం? ఈ ప్రాజెక్టు అడుగులు ముందుకు పడకపోతే ఈ ప్రాంతంలో ఉన్న రైతులేం కావాలి?

బాబుపై 420 కేసు పెట్టాలి
► చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో కేవలం రూ.5,674కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మరో రూ.2,297 కోట్లు బకాయిలు పెట్టి మనల్ని కట్టమని వదిలేశారు. అంతగా భ్రమలు కల్పించి, డిజైన్లు, గ్రాఫిక్స్‌ చూపించి మోసం చేసినందుకు నిజానికి 420 కేసు పెట్టాలి. 
► ఆయన బినామీలందరికీ కూడా ఇక్కడ భూములుండి.. ఇక్కడ అభివృద్ధి చెందితే ఆ భూములకి రేట్లు పెరుగుతుందని తెలిసి కూడా ఎందుకు రూ.2,297 కోట్లు బకాయిలు పెట్టారు? 
► వాస్తవం ఏమిటంటే ఏ ప్రభుత్వం కూడా ఇంతకన్నా ఎక్కువ పెట్టలేని పరిస్థితి. ఏడాదికి రూ.2 వేల కోట్లు కూడా పెట్టలేని పరిస్థితిలో మన రాష్ట్రం ఉంది. రాష్ట్రంలో 80 శాతం పైచిలుకు ప్రజలు తెల్లకేషన్‌ కార్డు మీదే బతుకుతున్న పరిస్థితి.  

రాష్ట్రం అంటే 8 కి.మీ పరిధి కాదు
► రాష్ట్రం అంటే 8 కిలోమీటర్ల పరిధి మాత్రమే కాదు. రాష్ట్రం అంటే 1,62,967 చదరపు కిలోమీటర్ల భూభాగం. మన రాష్ట్రం అంటే 3.96 కోట్ల ఎకరాల భూభాగం. కేవలం కొందరి లబ్ధి కోసం ఉన్న 50 వేల ఎకరాల భూమి మాత్రమే కాదు. చంద్రబాబు దృష్టిలో రైతులు అంటే కేవలం 35 వేల ఎకరాలు ఇచ్చిన రైతులు మాత్రమే. మన దృష్టిలో రైతులంటే ఈ 35 వేల ఎకరాలిచ్చిన రైతులతోపాటు రైతుభరోసాను అందుకుంటున్న మరో 50 లక్షల మందీ రైతులే.  

రూ.5 లక్షల కోట్లు కావాలని చంద్రబాబే చెప్పారు
అమరావతి ఇటు విజయవాడకు దగ్గరగా లేదు, అటు గుంటూరుకు దగ్గరగాలేదు. దేనికీ దగ్గరగా లేని ఈ ప్రాంతంలో కేవలం రోడ్లు, నీరు, కరెంటు, డ్రైనేజీ వంటి కనీస మౌలిక వసతులు కోసమే ఎకరాకు రూ.2 కోట్లు చొప్పున ఖర్చు చేయాలని ఆనాడు చంద్రబాబే లెక్కకట్టారు. అంటే ఈ 53 వేల ఎకరాల అమరావతికి అక్షరాలా రూ.1.10 లక్షల కోట్లు అవుతుందని ఆయనే లెక్క తేల్చారు.

కేవలం 53 వేల ఎకరాలు అంటే 8 కిలోమీటర్ల పరిధిలో మౌలిక వసతుల కోసమే రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలని వాళ్లే ఇచ్చిన నివేదిక ఇది ( కాపీని స్క్రీన్‌పై చూపించారు). ఇక రాజధాని భవనాలు మిగిలిన వాటిని కూడా కలుపుకుంటే కనీసం రూ.4 లక్షల కోట్ల నుంచి రూ.5 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబు చాలా సార్లు చెప్పారు.  

మరిన్ని వార్తలు