మారీచులతో యుద్ధం చేస్తున్నాం

16 Mar, 2022 05:47 IST|Sakshi

ఏం మాట్లాడినా వక్రీకరిస్తారు: సీఎం జగన్‌

దుష్ప్రచారాలను గ్రామస్థాయి నుంచే తిప్పికొట్టాలి

ఊరికి పదిమంది క్రియాశీల కార్యకర్తలకు డైనమిక్‌ శిక్షణ

సాక్షి, అమరావతి: ‘‘మనం మారీచులతో యుద్ధం చేస్తున్నాం. మాములుగా మాట్లాడినా వక్రీకరిస్తారు. ఆ దుష్ఫ్రచారాన్ని గ్రామ స్థాయిలో సమర్థంగా తిప్పికొట్టాలి. ప్రతి గ్రామంలో పది మంది క్రియాశీల కార్యకర్తలను ఎంపిక చేసి డైనమిక్‌గా శిక్షణ ఇవ్వాలి...’’ అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు సీఎం వైఎస్‌ జగన్‌ సూచించారు. ఈ మేరకు మంగళవారం పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏం చెప్పారంటే..

ఉన్మాదులతో యుద్ధం చేస్తున్నాం..
మనం చేస్తున్న యుద్ధం కేవలం చంద్రబాబుతో కాదు... ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 లాంటి ఉన్మాదులతో యుద్ధం చేస్తున్నాం. ఒక అబద్ధాన్ని నిజం చేసేందుకు ఇష్టమొచ్చినట్లుగా వక్రీకరిస్తారు. నానా ప్రయత్నాలూ చేస్తారు. ఇన్ని మీడియా చానళ్లు వారి దగ్గరే ఉన్నాయి కాబట్టి గోబెల్స్‌ ప్రచారంతో బుల్డోజ్‌ చేస్తారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తారు. 

నిప్పు లేకుండానే పొగ బెడతారు..
ఈ వ్యవస్థలు ఏ స్థాయికి దిగజారిపోయాయంటే.. ఇప్పుడు నిప్పు లేకుండానే పొగ బెడుతున్నారు. ఏమీ లేకపోయినా.. ఏదో జరిగిపోతోందనే భ్రమలు కల్పిస్తారు. అసత్యాలు, గోబెల్స్‌ ప్రచారాలతో మనం యుద్ధం చేయాల్సి వస్తోంది. కాబట్టి మన కార్యకర్తలకు మన వెర్షన్‌ బలంగా తెలిసుండాలి. అదే మన బలం. వారిని ఆ దిశగా చైతన్యం చేయాలి. అది జరగాలంటే మీరు వారితో పూర్తిగా మమేకం కావాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. ప్రతి గ్రామంలో పది మంది కార్యకర్తలను ఇందులో భాగస్వాములను చేయాలి. 

టీడీపీ దుష్ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టాలి 
మీరు (పార్టీ ఎమ్మెల్యేలు) గ్రామాలకు వెళ్లినప్పుడు రెండు మూడు ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించాలి. ప్రతి గ్రామంలో మన ప్రజా ప్రతినిధులున్నారు. సర్పంచులు, వార్డు మెంబర్లు, బూత్‌ కమిటీలు, ఎంపీటీసీలు ఉన్నారు. టీడీపీ అసత్య ప్రచారాలను గ్రామ స్థాయిలో సమర్ధంగా తిప్పికొట్టాలి. అలా జరగాలంటే వారందరికీ డైనమిక్‌గా ట్రైనింగ్‌ ఇవ్వాలి. ప్రతి గ్రామంలో 10 మంది కార్యకర్తలను క్రియాశీలం చేయటాన్ని మీ కార్యక్రమంలో భాగం చేసుకోవాలి. తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ సాక్ష్యాధారాలతో ఎదుర్కోవాలి.  

మరిన్ని వార్తలు