దుష్ట చతుష్టయం.. రాక్షస మూక 

24 Nov, 2022 03:28 IST|Sakshi

చంద్రబాబుకు మద్దతిస్తున్న రామోజీ, రాధాకృష్ణ, టీవీ 5, దత్తపుత్రుడ్ని ఇలా అనక ఇంకేమనాలి? 

నరసన్నపేట సభలో నిప్పులు చెరిగిన సీఎం వైఎస్‌ జగన్‌  

సొంతంగా పార్టీ పెట్టి అధికారంలోకి వస్తే ఎంజీఆర్, ఎన్టీఆర్, జగన్‌ అంటారు 

కూతురునిచ్చిన మామ పార్టీని కబ్జా చేసే వాళ్లను చంద్రబాబు అంటారు 

ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేయడం ఈయన నైజం 

రావణుడిని సమర్థించే వాళ్లను రాక్షసులనే అంటాం 

దుర్యోధనుడికి కొమ్ముకాసిన వారిని దుష్టచతుష్టయం అంటాం

రాజకీయం అంటే ఒక జవాబుదారీతనం. ప్రజలకు.. ఇంటింటికీ మనం మంచి చేస్తే, ఆ మంచిని చూసి వారు ఓటు వేస్తేనే పాలకులు అధికారంలో ఉంటారనే ఆలోచన కలగాలి. లేదంటే అధికారం నుంచి పోవాలనే మెసేజ్‌ వెళ్లాలి. అదీ రాజకీయం.  
– సీఎం జగన్‌ 

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘తనకు తాను పార్టీ పెట్టుకుని అధికారంలోకి వస్తే.. వాళ్లను ఒక ఎంజీఆర్, ఒక ఎన్టీఆర్, ఒక జగన్‌ అని అంటారు. కానీ సొంత కూతురును ఇచ్చిన మామకు, మామ పెట్టిన పార్టీకి, మామ పెట్టిన ట్రస్టుకు, చివరకు మామకు ప్రజలు ఇచ్చిన సీఎం కుర్చీకి.. వెన్నుపోటు పొడిచి కబ్జా చేసే వాళ్లను చంద్రబాబు అంటారు. రావణుడిని సమర్థించిన వాళ్లను మనమంతా రాక్షసులంటాం.

దుర్యోధనుడికి కొమ్ము కాసిన వాళ్లను దుష్ట చతుష్టయం అని అంటున్నాం. మరి మామ కుర్చీని కబ్జా చేసి, మామ పార్టీని దందా చేసి, ఎన్నికలప్పుడు ప్రజలకు మాయమాటలు చెప్పి, ఆ తర్వాత ప్రజలను గాలికొదిలేసి మోసం చేసే చంద్రబాబును సమర్థిస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడిని ఏమనాలి? దుష్ట చతుష్టయమని అనాలా? వద్దా? రాక్షస మూకలనాలా? వద్దా?.. అనేది ప్రజలు ఆలోచించాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో బుధవారం ఆయన జగనన్న శాశ్వత భూహక్కు – భూ రక్ష కార్యక్రమం తొలి విడత లబ్ధిదారులకు భూ హక్కుల పత్రాల పంపిణీ, రెండో విడత సర్వే ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు అండ్‌ కోపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. 
లబ్ధిదారు వెలమల శ్రీదేవికి జగనన్న భూహక్కు పత్రాన్ని అందజేస్తున్న సీఎం జగన్‌  

చంద్రబాబు రాముడా.. రావణుడా?  
► తన ఆస్తిని తాను అనుభవించే వాళ్లను హక్కుదారుడు అంటారు. అదే పరాయి వాడి ఆస్తిని ఆక్రమించే వారిని కబ్జాదారుడు అంటారు. తన భార్యతో సంసారం చేస్తే, ఆమె కోసం యుద్ధం చేస్తే.. ఆ మనిషిని శ్రీరాముడు అంటారు. అదే పరాయి స్త్రీ మీద కన్ను వేసి ఎత్తుకుపోతే.. అలాంటి వాళ్లను రావణుడు అంటారు. చంద్రబాబు రాముడా.. రావణుడా? రావణుడికి, దుర్యోధనుడికి, మోసం చేసిన వారికి, వెన్నుపోటు పొడిచే వారికి మరో చాన్స్‌ ఎవరైనా ఇస్తారా? 

► తమను గెలిపించిన ప్రజలకు ఇచ్చిన మాటను నాయకులు నిలబెట్టుకోవాలి. అప్పుడే దాన్ని నిజమైన ప్రజాస్వామ్యం అంటారు. కానీ గెలిపించిన ప్రజలను ఒక్కసారి కాదు.. రెండు సార్లు కాదు.. అనేక సార్లు మోసం చేసి, మాట తప్పి, వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడిని మరోసారి అసెంబ్లీకి పంపాలా? మీ సేవలు మాకొద్దని బైబై చెప్పి ఇంటికి పంపాలా? అనేది ప్రజలు ఆలోచించాలి. 

► ఇవాళ రాష్ట్రంలో రాజకీయాలు ఎలా తయారయ్యాయంటే.. కేవలం నలుగురు తోడుగా ఉంటే చాలు ప్రజల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదనే దుస్థితికి వచ్చాయి. ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు.. నాకు వీళ్లుంటే చాలు.. ఇక ప్రజలతో అవసరం లేదు, ప్రజలను మోసం చేసినా, వాళ్లకు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎవ్వరూ రాయరు. ఎవ్వరూ చూపరు. ఎవ్వరూ ప్రశ్నించరనుకునే రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి.  

► నేను నమ్ముకున్నది దేవుడి దయను, ప్రజలను మాత్రమే. చంద్రబాబులా దుష్ట చతుష్టయాన్ని నమ్ముకోలేదు. మీ అందరితో నేను ఇదే చెబుతున్నాను. వీళ్లు చెప్పే అబద్ధాలను నమ్మొద్దండి. టీవీల్లో వీళ్లు చూపించే అబద్ధాలను చూడొద్దండి. మీ ఇంటిలో మంచి జరిగిందా.. లేదా.. అన్నదే కొలమానంగా పెట్టుకోండి.  మంచి జరిగి ఉంటే.. మీ అన్న, మీ తమ్ముడు, మీ బిడ్డ జగన్‌కు తోడుగా నిలబడండి.     

మరిన్ని వార్తలు