పేదల ఇళ్ల స్థలాలకు బాబే అడ్డంకి

26 Aug, 2020 04:42 IST|Sakshi

చంద్రబాబు, టీడీపీ నేతలు పలు రకాలుగా కేసులు వేసి అడ్డుకుంటున్నారు

స్పందన కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌  

వివిధ వేదికలపై వారితో పోరాటం చేయాల్సి వస్తోంది

కొంత సమయం పట్టినా చివరకు న్యాయం, మంచే గెలుస్తుంది 

అతి త్వరలోనే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతాం 

సాక్షి, అమరావతి: పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ వంటి మంచి కార్యక్రమానికి శత్రువులు ఎక్కువగా ఉన్నారని, దీనిపై వివిధ వేదికలపై పోరాటం చేయాల్సి వస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా చంద్రబాబునాయుడు, ఆయన పార్టీకి చెందిన వారు నానా రకాలుగా కేసులు వేసి అడ్డుకుంటున్నారన్నారు. అయినప్పటికీ చివరకు న్యాయం, మంచే గెలుస్తుందని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. అప్పటి వరకు మనో స్థైర్యం కోల్పోకూడదని అన్నారు. మంగళవారం ఆయన స్పందన కార్యక్రమంపై తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఆయన అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

అతి త్వరలో మంచి రోజు వస్తుంది
► ఆగస్టు 15న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలనుకున్నాం. కానీ వాయిదా పడింది. అతి త్వరలోనే ఆ కార్యక్రమాన్ని చేపట్టే మంచి రోజు వస్తుంది. 
► ఆలోగా ప్లాట్ల అభివృద్ధి, మార్కింగ్, లాటరీ తదితర ప్రక్రియలన్నీ పూర్తి కావాలి.  

బ్యాంకర్లు ఇబ్బంది పెట్టకుండా చూడాలి
► వైఎస్సార్‌ చేయూత సొమ్ముపై బ్యాంకులకు హక్కు లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన మహిళలకు ఆ సొమ్ము నేరుగా అందేలా కలెక్టర్లు బ్యాంకర్లతో మాట్లాడాలి.  
► మహిళలకు స్థిరమైన జీవనోపాధి మార్గాలను చూపడానికి హిందుస్థాన్‌ యూనిలీవర్, ఐటీసీ, ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబల్, రిలయన్స్, అమూల్, అల్లానా గ్రూపులతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాం.
► 19 లక్షల మంది మహిళలు వివిధ జీవనోపాధి మార్గాల కింద ఆప్షన్లు ఎంపిక చేసుకున్నారు. ఈ కార్యక్రమం అమలుపై రాష్ట్ర స్థాయిలో ప్రతి 15 రోజులకోసారి 8 మంది మంత్రులతో కూడిన బృందం సమీక్ష  చేస్తుంది. ప్రతి వారం కంపెనీ ప్రతినిధులు, కలెక్టర్, సెర్ప్‌ ప్రతినిధులు, బ్యాంకర్లు సమీక్ష చేయాలి.  
► సెప్టెంబర్‌ నెలలో ఆసరాకు సంబంధించిన లబ్ధిదారులు కూడా ఈ కార్యక్రమంతో అనుసంధానం అవుతారు. ఆ సమయంలోగా ‘చేయూత’ మహిళలు తమ జీవనోపాధి కార్యక్రమాలను గ్రౌండ్‌ చేసుకునేలా చూడాలి.  

ఇ– క్రాప్‌ బుకింగ్‌పై దృష్టి పెట్టండి
► ఇ– క్రాపింగ్‌ పూర్తి కాకపోతే తర్వాత కార్యక్రమాలు దెబ్బ తింటాయి. సంబంధిత జేసీలు దీనిపై దృష్టి పెట్టాలి. మండలాన్ని, ఆర్బీకేను ఒక్కో యూనిట్‌గా తీసుకుని ఎరువుల పంపిణీలో ఇబ్బంది లేకుండా చూసుకోవాలి.
► వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి కస్టమర్‌ హైరింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలి. మండల స్థాయిలో కూడా రైతుల గ్రూపుల ఏర్పాటుతో పాటు, యంత్రాలను డెలివరీ చేయాలి. హై వ్యాల్యూ యంత్ర పరికరాలతో హబ్స్‌ ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలి.  
► ప్రతి ఆర్బీకే పరిధిలో ఒక ఎకరా భూమిని గుర్తించాలి. ఇక్కడ గోడౌన్లు, పంటను ఆరబెట్టుకోవడానికి ప్లాట్‌ ఫాం, ప్రైమరీ ప్రాసెసింగ్‌ యూనిట్స్, పశువుల శాల, కలెక్షన్‌ సెంటర్‌ తదితర కార్యకలాపాల కోసం ఇక్కడ వసతులు కల్పిస్తాం.   

‘నాడు–నేడు’ పనుల్లో వేగం పెరగాలి
► ఉపాధి హామీ పనుల కింద రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్, వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్‌ పనులు వేగంగా జరగాలి. గ్రామ సచివాలయాల భవనాల నిర్మాణం 2021 మార్చి నాటికి పూర్తి కావాలి. 
► అంగన్‌ వాడీలను 10 రకాల సదుపాయాలతో వైఎస్సార్‌ ప్రీప్రైమరీ స్కూల్స్‌గా మారుస్తున్నాం. 55 వేల అంగన్‌వాడీల్లో నాడు–నేడు కింద పనులు చేపడతాం. వచ్చే వారానికి ప్రణాళిక సిద్ధం అవుతుంది.
► స్కూళ్లలో నాడు–నేడుపై కలెక్టర్లు, జేసీలు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రస్తుతానికైతే సెప్టెంబర్‌ 5న స్కూళ్లు తెరవాలని ఆలోచిస్తున్నాం. ఈలోగా పనులన్నీ నాణ్యతతో పూర్తి చేయాలి. స్కూళ్లకు ఫర్నిచర్‌ చేరడం మొదలవుతోంది. 
► సెప్టెంబర్‌ 1న సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ్‌ ప్లస్, సెప్టెంబర్‌ 5న జగనన్న విద్యాకానుక, సెస్టెంబర్‌ 11న వైఎస్సార్‌ ఆసరా ప్రారంభిస్తున్నాం. 

రూ.22 వేల కోట్ల విలువైన ఆస్తులను దాదాపు 30 లక్షల మంది అక్కచెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయబోతున్నాం. దేశంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం జరగలేదు. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు అదేపనిగా కేసులు వేయిస్తున్నారు. కలెక్టర్లు సమీక్షలు నిర్వహించి, కౌంటర్లు ఫైల్‌ చేసి కేసులు త్వరగా ముగిసేలా చూడాలి. కొంత సమయం పట్టినా, చివరకు మంచే గెలుస్తుంది. 

మరిన్ని వార్తలు