ఎందుకీ తోడేళ్లంతా ఏకమవుతున్నాయి?: సీఎం జగన్‌

19 Mar, 2023 20:46 IST|Sakshi

సాక్షి, ఎన్టీఆర్‌ జిల్లా: విలువలు లేని దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అర్హతలేని వారు ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నారని మండిపడ్డారు. ఎందుకీ తోడేళ్లంతా ఏకమవుతున్నారు.. పొత్తుల కోసం వీళ్లంతా వెంపర్లాడుతున్నారని నిప్పులు చెరిగారు.

జగనన్న విద్యా దీవెన కింద సీఎం జగన్‌.. ఆదివారం ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి నేరుగా 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ, మనది డీబీటీ అయితే వాళ్లది డీపీటీ అని విమర్శించారు. మన ప్రభుత్వంలో డీబీటీ.. డైరెక్ట్‌ బెన్‌ఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌.. గత ప్రభుత్వంలో డీబీటీ.. దోచుకో, పంచుకో, తినుకో’’ అంటూ సీఎం దుయ్యబట్టారు. 

‘‘సినిమాల్లో హీరోలే నచ్చుతారు.. విలన్‌లు కాదని.. చివరికి మంచి చేసిన వాడే గెలుస్తాడు. గతంలోనూ ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్.. గతంతో పోలిస్తే ఈ బిడ్డ ప్రభుత్వంలో అప్పులు తక్కువ’’ అని సీఎం చెప్పారు.

9.86 లక్షల మందికి మంచి చేసే కార్యక్రమం
దేవుడి దయతో ఈ రోజు మరోమంచి కార్యక్రమాన్ని తిరువూరు నుంచి ప్రారంభిస్తున్నాం. దాదాపుగా 9.86 లక్షల మంది పిలల్లకు మంచి చేస్తూ... నేరుగా బటన్‌ నొక్కి 8,91,180 మంది తల్లుల ఖాతాల్లోకి నేరుగా దాదాపు రూ.700 కోట్లు జమ చేస్తున్నాం. 

విద్యాదీవెన కార్యక్రమం గురించి నాలుగు మాటలు చెబుతాను..
భవిష్యత్తు బాగుండాలనే....

ఈ కార్యక్రమం వలన ప్రతి పేద కుటుంబం, ప్రతి పేద కులం నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్తులో బాగుండాలనే సంకల్పంతో నవరత్నాల్లోంచి మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ రోజు నేను గట్టిగా నమ్మే అంశం.. మన పిల్లలకు మనం చెరగని ఆస్తి ఏదైనా ఇస్తున్నామంటే అది చదువు మాత్రమే. 

చీకటి నుంచి వెలుగులోకి చదువుతోనే సాధ్యం...
అజ్ఞానాన్ని చీకటితోనూ, విజ్ఞానాన్ని వెలుగుతోనూ పోల్చుతుంటాం. అలాంటి చీకటి నుంచి వెలుగులోనికి, ఒక మనిషి పేదరికం నుంచి బయటపడాలంటే.. అది సాధ్యమయ్యేది ఒక్క చదువుతోనే.మనిషి తలరాతను కానీ, కుటుంబం తలరాతను కానీ, వెనుకబడిన కులాల తలరాతలు కానీ, దేశాల తలరాతలనైనా మార్చగలిగిన శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉంది.

ఈ రోజు 17 నుంచి 20 సంవత్సరాల వయస్సు మధ్యలో ఉన్న నేటి తరం మరో 80 సంవత్సరాలు పాటు వాళ్ల జీవితాలు సాఫీగా జరగాలంటే మెరుగైన జీతాలతో, మెరుగైన ఆదాయాలతో వాళ్ల బ్రతుకులు సాగాలంటే వాళ్ల ప్రయాణాన్ని, జీవిత ప్రమాణాన్ని రెండింటినీ  నిర్ధిశించేది ఒక్క చదువు మాత్రమే. 

కాబట్టి మన రాష్ట్రంలో ఇవాళ ఎల్‌కేజీ లేదా పీపీ1 నుంచి చదువులు ప్రారంభిస్తున్న బిడ్డ దగ్గర నుంచి, అక్కడ మొదలైన ఆ బిడ్డ జీవితం ఎదిగి మంచి డాక్టరో, ఇంజనీరో కావాలి. మన కళ్లెదుటే కనిపిస్తున్న కలెక్టర్‌ ఢిల్లీరావు అత్యంత సాధారణమైన కుటుంబం, శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చి ఇవాళ  కలెక్టర్‌గా మీ కళ్లముందు కనిపిస్తున్నారు. ఇలా బ్రతుకులు మారాలి.

చదువుకు పేదరికం అడ్డం రాకూడదని...
మన జీవితాలు మారాలని అడుగులు ముందుకు వేస్తున్నాం. అలాంటి చదువులకు పేదరికం అడ్డు రాకూడదు. పిల్లలు పెరగాలి, ఎదగాలి. పేదరికం వల్ల చదువులు మానేస్తున్న పరిస్థితి ఎప్పటికీ రాకూడదు. ప్రతి చెల్లెమ్మకూ, ప్రతి తమ్ముడుకూ అన్నగా... ఆ చదువులుకు భరోసా ఇస్తూ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో జగనన్న విద్యాదీవెన పథకాన్ని గొప్పగా అమలు చేస్తున్నాం.

ఈ రోజు ఇలాంటి పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చే కార్యక్రమం ద్వారా  చదువులు అందిస్తూ... పిల్లలను చేయిపట్టుకుని నడిపిస్తూ.. వసతి దీవెన అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి రెండింటి ద్వారా మంచి చేస్తున్న ప్రభుత్వం దేశంలో మీ జగనన్న ప్రభుత్వం మాత్రమే. కాలేజీలు ఫీజులు ఎంతున్నా సరే, పిల్లలు ఎంతమంది చదివినా ఆ పూర్తి ఫీజులు బాధ్యత మీ జగన్‌ తీసుకుంటాడు. 

అందులో భాగంగానే ఈరోజు జగనన్న విద్యాదీవెన కార్యక్రమాన్ని పెద్ద చదువులు చదివిస్తున్న తల్లుల ఖాతాల్లోకి వారి పిల్లల పూర్తి ఫీజు రీయింబర్స్‌ చేసే కార్యక్రమాన్ని తిరువూరు నుంచి ప్రారంభిస్తున్నాం. 

గత ప్రభుత్వం –అరా కొరా ఫీజులు...
గత ప్రభుత్వంలో మనందరికి గుర్తు ఉంటుంది. కాలేజీల ఫీజులు విషయంలో ఎలా ఉండేదో చూశాం. ఫీజులు చూస్తే రూ.70, రూ.80వేలు, రూ.1 లక్ష నుంచి కొన్ని కాలేజీల్లో రూ.1.20 లక్షలు కూడా ఉంటే...  ఇచ్చేదేమో అరకొరా ఇచ్చేవారు. ఆ రూ.35 వేలు కూడా ఎప్పుడిస్తారో తెలియదు. సంవత్సరాల తరబడి బకాయిలు పెట్టిన పరిస్థితులు చూశాం. ఆ కాలేజీల ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో తల్లిదండ్రుల పడుతున్న అవస్ధలు చూశాం. ఆ ఫీజులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు కూడా చూశాం.

తల్లిదండ్రుల అవస్ధ మార్చాలనే...
ఈ రెండింటిని మార్చాలని అధికారంలోకి వచ్చిన వెంటనే అడుగులు వేగంగా ముందుకు వేశాం. ఫీజులు ఎంత ఉన్నా రూ.60వేలు, రూ.70, నుంచి రూ.1.20 లక్షల వరకు ఎంతైనా కానీ, ఎంతమంది పిల్లలు కుటుంబం నుంచి చదివినా, ఆ ఫీజులు కొరకు ఏ తల్లితండ్రీ అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదని 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేస్తున్నాం. ఫీజులు కట్టలేక పిల్లలు చదువు మానేసే పరిస్థితి రాకూడదని, అలా జరగకూడదని మీకు తోడుగా నిలబడేందుకు మీ జగన్‌ ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ కోసం ఉన్నాడు.

ప్రతి విద్యాసంవత్సరంలో కూడా ఫీజులు చెల్లించడమే కాదు, సమయానికి చెల్లించాలి. అలా చెల్లిస్తేనే పిల్లలు ఇబ్బంది పడకుండా చదువులు ముందుకు సాగిస్తారు. ఈ ఉద్దేశ్యంతోనే ప్రతి మూడు నెలలకొకసారి అంటే ఏ క్వార్టర్‌కు ఆ క్వార్టర్‌ అయినవెంటనే దానికి సంబంధించిన ఫీజులు పూర్తిగా వాళ్ల తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్నాం. అందులో భాగంగానే ఇవాల 9.86 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ.. బటన్‌ నొక్కి లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నేరుగా 8,91,180 మంది తల్లుల ఖాతాల్లోకి రూ.698 కోట్లు జమ చేస్తున్నాం.

27 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ...
రాష్ట్రంలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి క్రమం తప్పకుండా ఎలాంటి బకాయిలు లేకుండా నూటికి నూరుశాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తూ... జగనన్న విద్యాదీవెన అనే ఒకే ఒక్క పథకం ద్వారా 27 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ రూ. 9,947 కోట్లు ఇచ్చాం. గత ప్రభుత్వంలో చంద్రబాబు హయాంలో చివరి రెండు సంవత్సరాలు 2017–18, 2018–19కు సంబంధించి తాను ఎగ్గొట్టి పోయిన రూ.1777 కోట్లు కూడా చిరునవ్వుతో మీ అన్న ప్రభుత్వమే చెల్లించింది. ఆ పెద్దమనిషి బకాయిలు పెట్టి పోతే మీ అన్న ప్రభుత్వమే చెల్లించింది. 

ప్రశ్నించే హక్కు కోసం తల్లుల ఖాతాల్లో జమ...
మరో విషయం కూడా చెప్పాలి. ఈ ఫీజులు మొత్తం కూడా నేరుగా కాలేజీలకు ఇవ్వకుండా పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. ఇదొక గొప్ప మార్పు. కారణం ఆ తల్లులకు కాలేజీలను ప్రశ్నించే హక్కు వారికి ఇవ్వడం కోసం ఇలా చేస్తున్నాం. ఆ తల్లులు ప్రతి మూడు నెలలకొకసారి కాలేజీలకు వెళ్లి, తమ పిల్లల బాగోగులు తెలుసుకుని స్వయంగా వాళ్లే ఫీజులు కట్టే కార్యక్రమం జరగాలని, కాలేజీలో వసతులు లేకపోతే వాటిని కల్పించమని కాలేజీలను ప్రశ్నించే హక్కు ఆ తల్లులకు రావాలని ఈ మంచి కార్యక్రమానికి మార్పులు చేశాం.

కాలేజీ యాజమాన్యాలు ఎవరైనా వినకపోతే ఆ తల్లులు 1902కు ఫోన్‌ చేస్తే... నేరుగా మీ బిడ్డ ప్రభుత్వంలోని సీఎంఓ నేరుగా కాలేజీలతో మాట్లాడుతుంది. పిల్లలకు ఫీజులు పూర్తిగా ఇవ్వడమే కాకుండా, వారికి వసతి కోసం, భోజనం కోసం ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలని, ఆ ఖర్చులు కూడా భారం కాకూడదని, తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదని జగనన్న వసతి దీవెన అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.

ఐటీఐ చదువుతున్న విద్యార్ధులకు రూ.10వేలు, పాలిటెక్నిక్‌ చదువుతున్న విద్యార్ధులకు రూ.15వేలు, మెడిసిన్, ఇంజనీరింగ్‌ డిగ్రీ చదువుతున్న పిల్లలకు సంవత్సరానికి రూ.20వేలు రెండు దఫాలుగా జగనన్న వసతి దీవెన కింద తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నాం. ఈ సంవత్సరానికి సంబంధించి వసతి దీవెన రెండో దఫా కింద ఇచ్చే సొమ్ము కూడా ఏఫ్రిల్‌ 11న ఇవ్వాలని నిర్ణయించాం.

పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలని....
నా పిల్లలు బాగా చదవాలని, నా పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలని ఇవన్నీ చేస్తున్నాం.మన పిల్లలు ప్రతి ఒక్కరూ సత్య నాదేళ్ల మాదిరిగా కావాలని మీ అన్న తపన పడుతున్నాడు. ఈ విద్యాదీవెన, వసతి దీవెన కేవలం ఈ రెండు పథకాలకు 45 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వం రూ.13,311 కోట్లు ఖర్చు చేసింది.

చిన్న ఉదాహరణ కూడా చెబుతాను. జగనన్న వసతి దీవెన, విద్యాదీవెన ఈ రోజు ఈ రెండు పథకాల వల్ల ఇంజనీరింగ్‌ వంటి వృత్తి విద్యా కోర్సులలో చేరుతున్న విద్యార్ధుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2018–19లో 87,439 మంది పిల్లలు ఇంజనీరింగ్‌ వంటి వృత్తివిద్యాకోర్సులను చదవడానికి ఎంచుకుంటే... 2022–23 సంవత్సరానికి ఆ సంఖ్య 1.20 లక్షల మందికి చేరింది. కారణం నా చదువులకు మా జగనన్న తోడుగా ఉన్నాడన్న భరోసా ఆ తల్లులకు, పిల్లలకు ఉంది కాబట్టే.

ఇంటర్‌ పాసై చదువుకు దూరమైన విద్యార్ధుల సంఖ్య 2018–19లో 81,813 మంది అయితే మన ప్రభుత్వం అమలు చేస్తున్న మంచి కార్యక్రమాల ద్వారా 2022–23కు వచ్చే సరికి ఈ సంఖ్య 22,387 కు తగ్గిపోయింది. ఈ సంఖ్య కూడా ఉండకూడదు. ఇది కూడా సున్నా కావాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం పనిచేస్తుంది. 2018–19లో 37వేలుగా ఉన్న క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు 2021–22 నాటికి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు ఏకంగా 85వేలకు చేరింది.

ఇంటర్‌ తర్వాత చదువు ఆపేసిన విద్యార్ధుల సంఖ్య దేశంలో సగుటున 27శాతం అయితే మన రాష్ట్రంలో అది 6.62 శాతం మాత్రమే.
ఈ రోజు గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్ రేషియా( జీఈఆర్‌) అంటే 17 నుంచి 23 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు బడిబాట పట్టి కాలేజీలలో చదవాలని మాట్లాడుతారు.

జీఈఆర్‌ రేషియో 2018–19లో దేశం సగటు 32.4శాతం ఉంటే మన రాష్ట్రంలో 70 శాతానికి తీసుకుని పోవాలని తపన, తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తున్నాం.

మీ పిల్లల చదువుల బాధ్యత నాది.... 
ప్రతి అక్కకూ మంచి తమ్ముడుగా, ప్రతి చెల్లికి మంచి అన్నగా ఒక మాట చెబుతున్నాను. మీ పిల్లల చదువులకు బాధ్యత నాది అని మాట ఇస్తున్నాను. అమ్మఒడితో మొదలుపెడితే గోరుముద్ద, విద్యాకానుక, నాడు నేడు వంటి మంచి కార్యక్రమాలతో అడుగులు ముందుకు వేస్తున్నాం. ఒక పేజీ తెలుగు, మరో పేజీ ఇంగ్లిషుతో బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్స్, మారుతున్న స్కూళ్లు రూపురేఖలు, ఆరోతరగతి నుంచి ప్రతి తరగతి గది కూడా ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ప్యానెల్స్‌తో డిజిటల్‌ క్లాసురూములు కాబోతున్నాయి. అందులో భాగంగా నాడు నేడు పూర్తి చేసుకున్న 15,270 స్కూళ్లల్లో 6వతరగతి పై ఉన్న స్కూళ్లు దాదాపు 5,800 స్కూళ్లు ఉన్నాయి. వీటిలో 30,230 క్లాస్‌ రూమ్‌లలో ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ప్యానెల్స్‌ పెట్టి తరగతి గదులను డిజిటలైజ్‌ చేయబోతున్నాం. 8వతరగతిలో అడుగుపెట్టిన ప్రతి పిల్లాడికి కూడా నా పుట్టిన రోజునాడు ఆ పిల్లలను ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలన్న తపనతో వారికి ట్యాబ్స్‌ ఇచ్చి పదోతరగతివరకు తీసుకునిపోయే కార్యక్రమం చేస్తున్నాం. 

రెండేళ్ల టైం ఇవ్వండి....
రెండు సంవత్సరాలు టైం ఇవ్వండి, ప్రభుత్వ బడులు కార్పొరేట్‌ బడులతో పోటీపడలేవు అన్న మాటను తుడిచేస్తాను. రెండు సంవత్సరాలు టైం ఇస్తే.. కార్పొరేట్‌ బడులే ప్రభుత్వ బడులతో పోటీ పడేలా చేస్తాను. 

ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్‌రూం డిజిటలైజ్‌ అవ్వబోతుంది.  ఒక్కసారి ప్రభుత్వ బడులు డిజిటలైజ్‌ అయిపోతే ప్రైవేటు వాళ్లు కూడా పోటీపడక తప్పదు. 8వతరగతి పిల్లలకు ప్రభుత్వ బడులలో ట్యాబులు ఇస్తున్నాం. రెండో సంవత్సరం కూడా ట్యాబులు ఇస్తే... ప్రయివేటు బడులు కూడా 8వతరగతి పిల్లాలకు ట్యాబులు ఇవ్వకతప్పని పరిస్థితుల్లోకి పోతారు.

ఉన్నత విద్యలోనూ మార్పులు.... 
హయ్యర్‌ ఎడ్యుకేషన్‌లో కూడా మార్పులు తీసుకొచ్చాం. ఇవాల అక్కడ కూడా చదువులు మారుస్తున్నాం. మూడేళ్ల కోర్సులను నాలుగు సంవత్సరాలు చేసాం. ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేస్తూ అమలు చేస్తున్నాం. డిగ్రీ చదువులు ఇంగ్లిషు మీడియంలోకి మార్చాం.  కరిక్యులమ్‌తో అనుసంధానం చేస్తూ ఆన్‌లైన్‌ వర్టికల్స్‌ను తీసుకొచ్చాం. జాబ్‌ ఓరియెంటెడ్‌గా కరిక్యులమ్‌ను మార్చుకుంటూ పోతున్నాం. ఆన్‌లైన్‌ సర్టిఫికేషన్‌  తీసుకొచ్చాం. మైక్రోసాప్ట్, ఏడబ్ల్యూఎస్, నాస్కామ్, సేల్స్‌ఫోర్స్, ఆల్టో వంటి పెద్ద పెద్ద సంస్ధలన్నీ సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ ఇచ్చేటట్టుగా ఉచితంగా పిల్లలకు అందుబాటులోకి తీసుకువచ్చాం.

మారనున్న విద్యార్ధుల భవిష్యత్తు..
ఈ పథకాలతో మన విద్యార్ధుల భవిష్యత్తు, మన విద్యాసంస్థల  రూపురేఖలు మారనున్నాయి. మనబడి నాడు నేడుతో 46,447 స్కూళ్లు, కాలేజీలలో 12 రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తూ మార్పు చేస్తున్నాం. ఇవన్నీ రాబోయే రోజుల్లో పిల్లల జీవితాలను మార్చే కార్యక్రమాలు. మన ప్రభుత్వం వచ్చాక కొత్తగా 14 డిగ్రీ కళాశాలను తీసుకొచ్చాం. ఉన్నతవిద్యకు మరింత ఊతమిచ్చే అనేక చర్యలు తీసుకున్నాం. జేఎన్‌టీయూ గురజాడ యూనివర్సిటీని విజయనగరంలోనూ, ఆంధ్రకేసరి యూనివర్సిటీని ఒంగోలులోనూ, వైయస్సార్‌అగ్రికల్చర్, ఆర్కిటెక్చర్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీని కడపలో ఏర్పాటు చేశాం. కర్నూలులో క్లస్టర్‌ యూనివర్సిటీని పెట్టాం. ఈ యేడాది పులివెందులలో అగ్రికల్చర్‌ కాలేజీను తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం.

వైద్య రంగంలో సమూల మార్పుల దిశగా...
అంతే కాకుండా వైద్య, విద్యా రంగం చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 17 కొత్త మెడికల్‌ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11 గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీలను కూడా పూర్తిగా నాడు నేడుతో రూపురేఖలు మారుస్తున్నాం. ఇవన్నీ పిల్లల జీవితాలను బాగుపరిచే కార్యక్రమం కోసం అడుగులు వేస్తున్నాం. 

నిండు మనసుతో
ఈరోజు నిండు మనస్సుతో ఈ బాధ్యతను నెరవేరుస్తున్నాం. ఒకే ఇంట్లో ఉన్న అవ్వతాతల పట్ల కానీ, అక్కచెల్లెమ్మల పట్లకానీ, పిల్లలు, రైతుల పట్ల కానీ, సమాజంలో అణిచివేతను ఎదుర్కొన్న నా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల పట్ల కానీ నిరుపేదల పట్ల కానీ నిండు మనస్సుతో స్పందించే హృదయం నాది.

ఈ రోజు సామాజిక న్యాయం, మహిళా న్యాయం, రైతన్నలకు న్యాయం వీటన్నింటినీ ఒక కర్తవ్యంగా, దైవకార్యాలుగా భావించి అడుగులు ముందుకు వేస్తున్నాం.

గడప గడపలో సంతోషం చూడాలని, ఇంటింటా ఆనందం ఉండాలని తపించే మనస్సు మన ప్రభుత్వానిది. ఈ రోజు మన రాష్ట్రంలో ఏ పేద ఇంటికి వెళ్లినా, గతంలో ఏ ప్రభుత్వం చేయనంత విధంగా మీ అన్న ప్రభుత్వం గత 45 నెలలుగా పాలన అందిస్తోంది. ఈ 45 నెలల పరిపాలనపై మీ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయండి. గతాన్ని గుర్తుచేసుకొండి.

గతంలో మాదిరిగా కాకుండా ఈ 45 నెలల్లో మీ అన్న, మీ తమ్ముడు ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో ఆలోచన చేయండి.  ఈ 45 నెలల్లో ఎలాంటి వివక్షకు చోటు లేకుండా, లంచాలకు చోటు లేకుండా కేవలం బటన్‌ నొక్కి నేరుగా రూ.1.98 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు జమ చేశాను. ఎక్కడా ఏ అక్కచెల్లెమ్మను అడిగినా ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పనిలేదు అన్న మాట వినిపిస్తుంది. ఏ ఒక్క సిఫార్సుకు తావులేకుండా మా అన్న ఇచ్చాడు అన్న మాట వాళ్లో నోటిలో నుంచి వస్తోంది. ఈ 45 నెలలుగా ఇదీ మీ బిడ్డ పరిపాలన అని చెప్పడానికి గర్వపడుతున్నాను. 

దుష్టచతుష్టయంతో యుద్ధం...
ఇలాంటి మనందరి ప్రభుత్వం నిత్యం మీకు మంచి చేయడం కోసం తపిస్తున్న ఈ ప్రభుత్వం ఎవరితో యుద్ధం చేస్తోందో తెలుసా ? మీకు మంచి చేయడం కోసం తపిస్తున్న మీ ప్రభుత్వం ఎవరితో యుద్ధం చేస్తుందో తెలుసా ? 
కుటుంబ విలువలు, మానవతా విలువలు, రాజకీయ విలువలు లేని ఒక దుష్ట చతుష్టయం అన్న వ్యవస్ధతో యుద్ధం చేస్తున్నాం. ఆలోచన చేయండి.

గతానికి ఇప్పటికీ తేడా చూడండి.
గతంలోనూ ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్‌. అప్పులు పెరుగుదల శాతం చూస్తే అప్పటికన్నా ఇప్పుడే తక్కువ. మరి మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతున్నాడు. గతంలో వాళ్లు ఎందుకు చేయలేకపోయారో ఆలోచన చేయండి. 
దోచుకో, పంచుకో, తినుకో( డీపీటీ)ని నడిపిన ప్రతిపక్షంతో.. డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌( డిబీటీ) నడుపుతున్న మీ బిడ్డ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది. దోచుకో, పంచుకో, తినుకో బ్యాచ్‌ ఎవరో తెలుసా ? ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఒక చంద్రబాబు. వీళ్లందరికీ తోడు వీరి దత్తపుత్రుడు.

తోడేళ్లు ఏకమవుతున్నాయి...
ఇలాంటి దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నాం. ఇవాళ ఆ దుష్టచతుష్టయాన్ని ఒక్కటే అడుగుతున్నాను. నేను వారికి సవాల్‌ విసురుతున్నాను. మనందరి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయలేదని వారు నమ్మితే.. వారు ఎందుకు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు ? ఎందుకు ఈ తోడేళ్లు ఏకమవుతున్నాయి ? 
గ్రామ గ్రామానికి, ఇంటింటికీ అందిన అభివృద్ధి ఫలాల మీద కానీ, సామాజిక వర్గాలు, రైతన్నలకు, అక్కచెల్లెమ్మలకు, బడి పిల్లలకు, అవ్వాతాతలకు అందించిన సంక్షేమ ఫలాలు మీద కానీ మన ప్రభుత్వంతో పోల్చుకునేందుకు అర్హత లేని వీరంతా కూడా మన ప్రభుత్వం మీద రాళ్లు వేస్తున్నారు. 

వీరిని మరోసారి అడుగుతున్నాను. ఎన్నికల బరిలో మంచి చేసిన మనందరి ప్రభుత్వాన్ని 175 కు 175 సీట్లలో ముఖాముఖి, ఒంటరిగా ఎదుర్కునే సత్తా వీరికుందా అని అడుగుతున్నాను. దుష్ట చతుష్టయం ఎన్ని కుతంత్రాలు పన్నుతన్నా, ఎల్లో మీడియా ఎన్ని తప్పుడు రాతలు రాస్తున్నా, ప్యాకేజీ పార్టీలు ఎంతగా చేతులు కలిపినా, నీచ రాజకీయం నిత్యం ఎంత జరుగుతున్నా కూడా మీ బిడ్డకు ధైర్యం మీరే.
నా నమ్మకం మీరే. నన్ను నడిపించేది మీరే. నా ప్రయాణంలో నేను నిరంతరం ఆధారపడే పరిస్థితి ఉంటే అది ఆ దేవుడు మీద, మీ మీద మాత్రమే. 

వీళ్ల మాదిరిగా నేను పొత్తులు పెట్టుకోవడానికి వెంపర్లాడను. వీళ్ల మాదిరిగా నేను ఆరాటపడను. కారణం నేను నమ్ముకున్నది ఈ పొత్తులు మీద కాదు. నేను నమ్ముకున్నది ఆ దేవుడుని, మిమ్నల్నే. వీళ్లందరికీ ఛాలెంజ్‌ విసురుతున్నాను. 

ఎన్ని కుతంత్రాలు పన్నినా కూడా చివరకు మంచే గెలుస్తుంది. రామాయణం చూసినా అదే కనిపిస్తుంది. భారతం చూసుకున్నా అదే కనిపిస్తుంది. బైబిల్‌ చదివినా, ఖురాన్‌ చదివినా అదే ఏ సినిమాకు వెళ్లినా కూడా ఆ సినిమాలో హీరోనే నచ్చుతాడు కానీ, విలన్లు నచ్చరు. దేవుడు ఆశీర్వదించాలని మీ అందరి చల్లని దీవెనలు బిడ్డపై ఎల్లప్పుడూ ఉండాలని, కొండంత అండగా నిలబడిన నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, నా నిరుపేద అవ్వతాతలు, అక్కచెల్లెమ్మలు, రైతన్నలు వీరందరూ నిండు మనసుతో నాకు తోడుగా నిలబడాలని, మంచి జరిగిన ప్రతి ఇళ్లూ కూడా మీ బిడ్డకు అండగా నిలవాలని నిండు మనస్సుతో కోరుకుంటూ చేతులు జోడించి పేరు పేరుగా ప్రార్ధిస్తున్నాను.

చివరిగా... 
తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే కొక్కిలగడ్డ రక్షణనిధిగారు కొన్ని అభివృద్ది కార్యక్రమాలు అడిగారు. కట్టలూరు వాగు మీదుగా హైలెవల్‌ బ్రిడ్జి గురించి అఢిగారు. దానికోసం రూ.26 కోట్లు అవసరం కాగా.. దాన్ని మంజూరు చేస్తున్నాను. ఏ.కొండూరులో కిడ్నీ బాధితులు ఎక్కువగా ఉన్నారు. వీరికి మంచి చేయడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తుంది. అయినా శాశ్వతంగా ఈ సమస్య పరిష్కారం కోసం కృష్ణా జలాలు మంచినీటి సరఫరా కోసం రూ.50 కోట్లు ఖర్చవుతుందన్నారు. అవి కూడా కేటాయిస్తున్నాను.

దాదాపుగా 8వేలపై చిలుకు ఇంటి స్ధలాలు ఇచ్చాం. 4 వేల ఇళ్లు మంజూరై ఇళ్లు వేగంగా కడుతున్నారు. మరో 6వేల ఇళ్లుకావాలన్నారు. అవి కూడా మంజూరు చేస్తున్నాను. పదివేల ఇళ్లు అంచనాగా తీసుకుంటే ఈ ఇళ్ల ఖరీదే దాదాపు రూ.250 కోట్లు. అదే విధంగా రోడ్ల రిపేరు కోసం రూ.10 కోట్లు అడిగారు. అదీ మంజూరు చేస్తున్నాం. రూ.4 కోట్లతో డ్రైనేజీ కోసం మంజూరు చేస్తున్నాం. పాలిటెక్నిక్‌ కాలేజీ అడిగారు. ప్రభుత్వం 175 నియోజకవర్గాల్లో  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌(ఐటీఐ, పాలిటెక్నిక్‌ కాలేజీ, డ్రాపౌట్స్‌ కోసం ప్లంబర్లు, ఏసీ మెకానిక్స్‌ వంటి స్కిల్‌ ఎన్‌హేన్స్‌మెంట్‌ కోర్సులు)  ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తుంది. రాబోయే రోజుల్లో స్కిల్‌ సెంటర్‌ ఇక్కడ వస్తుంది. వీటన్నింటి ద్వారా మంచి జరగాలని ఆశిస్తున్నాను అని సీఎం జగన్‌ ప్రసంగం ముగించారు.

చదవండి: రైతులను గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుది: కన్నబాబు

మరిన్ని వార్తలు