ఎన్నికలకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలి: సీఎం జగన్‌

13 Oct, 2022 16:55 IST|Sakshi

ఆలూరు నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం భేటీ

సాక్షి, తాడేపల్లి: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కార్యకర్తలతో తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఆలూరు నుంచి వచ్చిన కార్యకర్తలను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గంలోని కార్యకర్తలను కలుసుకోవాలన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశం. ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
చదవండి: ఇలాంటి వక్రీకరణల వెనుక ఉద్దేశం ఏంటి?: సీఎం జగన్‌  

‘‘గడపగడపకూ కార్యక్రమాన్ని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో చేపడుతున్నాం. ఎమ్మెల్యేలు సంబంధిత నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. గ్రామంలో ప్రతి ఇంటికీ వెళ్తున్నారు. ఈ మూడేళ్ల కాలంలో మనం చేసిన మంచి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్తున్నాం, ఆ కుటుంబానికి జరిగిన మేలును వివరిస్తున్నాం. ఆ మేలు జరిగిందా? లేదా? అనే విచారణ చేస్తున్నాం. వారి ఆశీస్సులు తీసుకుంటున్నాం. ప్రభుత్వంలో ఉన్న మనం అంతా.. గ్రామస్థాయిల్లో కూడా వివిధ బాధ్యతలను నిర్వహిస్తున్నామని’’ సీఎం అన్నారు.

‘‘మనం అంతా కలిసికట్టుగా ఒక్కటి కావాలి. అప్పుడే మంచి విజయాలు నమోదు చేస్తాం. అలాగే ప్రతి సచివాలయానికీ రూ.20లక్షల రూపాయలు ప్రాధాన్యతా పనులకోసం కేటాయిస్తున్నాం. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా గ్రామంలో 2 రోజులపాటు కచ్చితంగా ఎమ్మెల్యే గడపుతున్నారు. రోజూ 6 గంటలపాటు సమయం గడుపుతున్నారు. సీఎంగా నేను ప్రతి కార్యకర్తకూ అందుబాటులో ఉండలేకపోవచ్చు. సాధ్యం కాదుకూడా. కాకపోతే ప్రతి ఎమ్మెల్యే కార్యకర్తకూ అందుబాటులో ఉండాలి. ఎమ్మెల్యేలు మాత్రం ప్రతి గ్రామంలో తిరగాలి.. రెండురోజులపాటు తిరగాలి. రోజుకు 6 గంటలు గడపాలి. సాధకబాధకాలు తెలుసుకుని.. వాటిని పరిష్కరించే ప్రయత్నం గడపగడపకూ కార్యక్రమం ద్వారా కొనసాగుతుంది’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

దేవుడి దయవల్ల గడపగడపకూ కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. ఈ మధ్యలో వీలైనప్పుడు నేను ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసంగా 100 మంది కార్యకర్తలను కలుస్తున్నాను. ఒక్క ఆలూరు నియోజకవర్గానికే వివిధ పథకాల ద్వారా ఈ మూడు ఏళ్ల కాలంలో రూ.1050 కోట్లు నేరుగా లబ్ధిదారుల ప్రత్యక్ష నగదు బదిలీద్వారా నేరుగా వారి ఖాతాల్లో వేయడం జరిగింది’’ అని సీఎం జగన్‌ అన్నారు.

మరిన్ని వార్తలు