సీఎం జ‌గ‌న్, చంద్రబాబు మ‌ధ్య‌ తేడా ఇదే

26 Jan, 2024 13:25 IST|Sakshi

ఏపీ ముఖ్యమంంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇండియా టుడే ఎడ్యుకేషనల్ సమ్మిట్‌లో ప్రముఖ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూను గమనించారా? ఎంత అందంగా సాగింది! అందం అన్న పదం ఎందుకు వాడవలసి వచ్చిందంటే రాజ్ దీప్ ఆంగ్లంలో అడిగిన అన్ని ప్రశ్నలకు అందమైన ఆంగ్ల భాషలో చిరునవ్వుతో జగన్‌మోహన్‌రెడ్డి సమాధానం చెప్పడం విని సంతోషం అనిపిస్తుంది.

ముఖ్యమంత్రిగా ఉన్న ఒక నాయకుడు దేశ, విదేశాలలో తనకు ఉన్న ఆంగ్ల పరిజ్ఞానంతో ఎదుటివారిని మెప్పించడం అంటే తేలికైన విషయం కాదు. అందులోను ప్రముఖ పాత్రికేయులతో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడా తప్పులు దొర్లకుండా ఉండాలి. వినడానికి కూడా హాయిగా ఉంటుంది. అలా అని తెలుగును విస్మరించాలని ఎవరూ చెప్పడం లేదు.

తెలుగు నేర్చుకుంటూనే ఆంగ్లం, హిందీ వంటి భాషలు అభ్యసిస్తే దేశంలోకాని, విదేశాలలోకాని ఎక్కడైనా సులువుగా ఉపాది అవకాశాలు పొందవచ్చు. జీవితం సాఫీగా సాగిపోతుంది. జగన్‌మోహన్‌రెడ్డి ఆంగ్ల మీడియంలో చదువుకోబట్టి దాని విలువను గుర్తుంచుకుని ఏపీలోని స్కూళ్లలో విప్లవాత్మక మార్పులు తేవడానికి యత్నిస్తున్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చీరాని ఆంగ్లంలో మాట్లాడుతుంటే వినడానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. ఇంగ్లీష్ రాకపోవడం తప్పుకాదు. కాని భాష రాకపోయినా తాను పండితుడినే అనుకుని మాట్లాడితే ఎదుటి వారికి ఇబ్బందిగా ఉంటుంది. పైకి ఏమీ అనకపోయినా, ఎదురుగా మాట్లాడకపోయినా, ఆ తర్వాత నవ్వుకుంటారు. దానివల్ల ఆయన నాయకత్వం వహించే రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు చిన్నతనంగా ఉంటుంది.

ఈ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్, లండన్ పర్యటనల సందర్భంగా ఆంగ్ల భాష పూర్తి స్థాయిలో రాకపోవడం వల్ల ఇబ్బంది పడ్డారన్నది అర్ధం అవుతుంది. ఒక విలేకరికి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆ విషయం మరింత స్పష్టంగా తెలిసిపోయింది. దాంతో సంబంధిత వీడియో వైరల్‌గా మారింది. బయటనుంచి వచ్చే ప్రముఖులకు తెలుగు రాదు. అందువల్ల వారు ఆంగ్లంలోనే మాట్లాడుతుంటారు. దానిని మనం అర్ధం చేసుకుని సమాధానం ఇవ్వకపోతే సంభాషణ గందరగోళంగా మారుతుంది. అలాగే ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. లేదంటే తమకు వచ్చిన భాషలోనే మాట్లాడి అనువదించుకోవాలని చెప్పాలి. జగన్‌మోహన్‌రెడ్డికి ఆ ఇబ్బంది లేదు. ఆంగ్లంపై మంచి పట్టు ఉండడంతో రాజ్ దీప్ సర్దేశాయి ఆంగ్లంలో అడిగిన ప్రశ్నలకు ఎక్కడా తడుముకోకుండా స్పష్టమైన జవాబులు ఇచ్చారు.

గతంలో చంద్రబాబు ఇదే రాజ్ దీప్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ గుర్తుకు తెచ్చుకోండి. అప్పట్లో ప్రధాని మోదీని ఆయన తీవ్రంగా విమర్శించేవారు. ఆ సందర్భంలో చంద్రబాబు ఏమి చెబుతున్నది అర్ధం చేసుకోవడానికి రాజ్ దీప్ కష్టపడవలసి వచ్చింది. మోడీని ఫలానా విధంగా విమర్శిస్తున్నారా? అని రాజ్ దీప్ మళ్లీ అడిగి తెలుసుకోవలసి వచ్చింది. తిరుపతిలో జగన్‌మోహన్‌రెడ్డి చక్కగా మాట్లాడారు. అందుకే ఎడ్యుకేషన్ సమ్మిట్ అంత నీట్‌గా జరిగింది. అంతేకాక రాజ్ దీప్‌తో పాటు ఇండియా టుడె ప్రతినిధి బృందం స్వయంగా తిరుపతిలో నాడు-నేడు కింద ఆధునీకరించిన కొన్ని స్కూళ్లను చూసి వచ్చారు. స్కూళ్లు మారిన తీరును గమనించి వారు ఆశ్చర్యపోయారు. స్కూళ్లలో డిజిటల్ తరగతులు, మంచి మౌలిక వసతులు, స్టార్ హోటల్ స్థాయి టాయిలెట్లు, ఆంగ్ల మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్, టోఫెల్‌కు చిన్నతనం నుంచే ట్రైనింగ్ వంటి విశేషాలు తెలుసుకుని ప్రభుత్వ స్కూళ్లలో ఇన్ని మార్పులు చేయడం ఎక్కడా చూడలేదని స్పష్టంగా చెప్పారు.

ఇదే విధానం కొనసాగితే విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే రోల్ మోడల్ అవుతుందని చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ పిల్లలకు స్కూల్ డ్రెస్‌ల మొదలు, వారు తినే గోరుముద్ద వరకు ఎంత శ్రద్ద తీసుకుంటున్నది వివరించారు. పిల్లలకు చదువే సంపద అని తన ప్రభుత్వం నమ్ముతోందని, అందుకే ఈ విదమైన మార్పులు తీసుకువస్తున్నామని ఆయన వివరించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వంటివారు తెలుగు మీడియంకు మద్దతుగా మాట్లాడుతున్నారు కదా అని రాజ్ దీప్ అడిగినప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి చాలా స్పష్టంగా ఇంగ్లీష్ మీడియం వద్దనేవారు తమ పిల్లలు, తమ మనుమళ్లు ఎక్కడ ఏ మీడియంలో చదువుతున్నారో ప్రశ్నించుకోవాలని జవాబు ఇచ్చారు.

ఏపీలో పుస్తకాలన్నిటిని రెండు భాషలలోను ముద్రించిన సంగతిని ఆయన వివరించారు. నిజంగానే వెంకయ్య నాయుడు కాని, చంద్రబాబు నాయుడు కాని, పవన్ కళ్యాణ్ కాని, రామోజీరావు కాని.. వీరెవ్వరూ తమ పిల్లలను, మనుమళ్లను తెలుగు మీడియంలో చదివించడం లేదు. కాని పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ స్కూళ్లలో మాత్రం ఆంగ్ల మీడియానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంటారు. దీనిపై బహుశా దేశంలో ఎక్కడా జరగనంత చర్చ ఏపీలో జరిగింది. ఏపీ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు ఇస్తున్న ప్రాధాన్యతను కూడా జగన్‌మోహన్‌రెడ్డి వివరించారు. ఇంత మార్పు జరుగుతుంటే సరైన ప్రచారం ఎందుకు చేసుకోలేకపోతున్నారని రాజ్ దీప్ ప్రశ్నించడం విశేషం.

ఇంతకాలం కేరళ రాష్ట్రం విద్యారంగంలో నెంబర్ వన్ స్థానంలో ఉండేది. ఏపీలో క్రమేపి ఆ స్థానానికి చేరుకుంటోంది. ఈ మద్య తెలంగాణకు చెందిన ప్రముఖ మేధావి ప్రొఫెసర్ కంచ ఐలయ్య ఒక సెమినార్‌లో మాట్లాడుతూ ఏపీలో స్కూళ్లలో తీసుకువచ్చిన విశేషమైన సంస్కరణలు, ఆంగ్ల మీడియంలో బోధన వంటివాటి గురించి ప్రస్తావించి వీటిని కొనసాగించాల్సిన అవసరం ఎంతగానో ఉందని అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఆయన అభినందిస్తూ ఒకవేళ అవి కొనసాగకపోతే ఏపీ వందేళ్లు వెనక్కి పోతుందని హెచ్చరించారు. విద్యార్ధులంతా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన పరోక్షంగా చెప్పారు. తాను ఇంతవరకు జగన్‌మోహన్‌రెడ్డిను కలవలేదని, కలవబోవడం లేదని, అయినా అక్కడ విద్యారంగంలో జరుగుతున్న విప్లవాత్మక మార్పులను గమనించి ఇలా వ్యాఖ్యానిస్తున్నానని కంచ ఐలయ్య అన్నారు.

చంద్రబాబు కొడుకు, కోడలు, మనుమడు అంతా ఇంగ్లీష్‌లో చదవాలి కాని, దళిత, కమ్మరి, కుమ్మరి, కురుమ, మంగళి తదితర బీసీ వర్గాలు మాత్రం ఆంగ్లమాద్యమంలో చదువుకోరాదా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. అంబేద్కర్ తప్పనిసరిగా ఆంగ్ల బోధన ఉండాలని కోరుకున్నారని కూడా ఐలయ్య చెప్పారు. నాలుగున్నరేళ్లుగా జగన్‌మోహన్‌రెడ్డి ఏపీలో చేస్తున్న కృషికి ఇప్పుడిప్పుడే గుర్తింపు రావడం ఆరంభం అయింది. గత ఏడాది ఏపీ పిల్లలు అమెరికాకు వెళ్లడం, ఐక్యరాజ్యసమితిలో మాట్లాడడం వంటివి చేయడంతో రాష్ట్ర ప్రతిష్ట ఇనుమడించింది. ఈ నేపధ్యంలో ఈ సమ్మిట్ జరగడం, ఏపీలో విద్యారంగంలో సాగుతున్న సమూల మార్పులకు మంచి ప్రాధాన్యం రావడం శుభపరిణామం అని చెప్పాలి.

-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్‌ పాత్రికేయులు

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega