దోచుకుని పంచుకు తినే(డీపీటీ) ప్రభుత్వం కావాలా? సంక్షేమ(డీబీటీ) ప్రభుత్వం కావాలా?: సీఎం జగన్‌

29 Jul, 2022 12:50 IST|Sakshi

సాక్షి, కాకినాడ: డీబీటీ అంటే.. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్‌. డీబీటీ ద్వారా అవినీతికి తావులేకుండా నేరుగా సంక్షేమ పథకాల నిధుల్ని.. లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. వైఎస్సార్‌ కాపు నేస్తం మూడో విడత నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా కాకినాడ గొల్లప్రోలు సభ నుంచి లబ్ధిదారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అదే సమయంలో చంద్రబాబు పాలనలో డీపీటీ సమర్థవంతంగా అమలు అయ్యిందని సీఎం జగన్‌ పేర్కొన్నారు. 

చంద్రబాబు పాలనలో ‘డీపీటీ’ అంటే.. దోచుకో.. పంచుకో.. తినుకో అని సీఎం జగన్‌ నిర్వచించారు. డీపీటీ ద్వారా దుష్టచతుష్టయం అంటే చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5.. వీరికి తోడు దత్తపుత్రుడు అంతా కలిసి సామాజిక న్యాయం పాటించారని ఎద్దేవా చేశారు. కాపుల ఓట్లను మూటగట్టి చంద్రబాబుకు అమ్మడానికి దత్త పుత్రుడు ప్రయత్నిస్తున్నాడు.

మన ప్రభుత్వం డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయడం కావాలా? చంద్రబాబు హయాంలో ఉన్న దోచుకో, పంచుకో, తినుకో కావాలా?..అని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారాయన. చంద్రబాబు, పవన్‌, ఎల్లోమీడియాకు తెలిసింది అవినీతి మాత్రమే. చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. హుద్‌హుద్‌ వచ్చినప్పుడు 11 రోజుల పాటు నేనే స్వయంగా ఉత్తరాంధ్రలో తిరిగా. ఆ సమయంలో పాచిపోయిన పులిహోర ప్యాకెట్లను బాధితులకు పంచాడు ఆయన. కానీ, మా హయాంలో విపత్తు వస్తే బాధితులను సక్రమంగా ఆదుకుంటున్నాం.

వరద బాధితులు ఏ ఒక్కరికీ ఇబ్బందులు లేకుండా రేషన్‌తో పాటు ప్రతీ ఇంటికి రూ.2 వేలు ఇస్తున్నాం. చంద్రబాబు తన పాలనలో ఒక్క రూపాయి ఇవ్వలేకపోయారు. అలాగే.. జగనన్న పాలనలో లబ్ధి జరగలేదని చంద్రబాబు ఏ ఒక్కరినీ చూపలేకపోయారు. అబద్దాల మార్క్‌ చంద్రబాబు కావాలా? ఎలాంటి వివక్ష లేకుండా పారదర్శకంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఈ ప్రభుత్వం కావాలా?.. ఎవరి పాలన కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని సీఎం జగన్‌ పిలుపు ఇచ్చారు.

ఇది కూడా చదవండి: ఇది అన్నివర్గాల సంక్షేమ ప్రభుత్వం.. కాపు నేస్తం అందులో భాగమే!: సీఎం జగన్‌

మరిన్ని వార్తలు