చంద్రబాబు అరెస్ట్‌తో మాయరోగం.. జైలు వేదికగా మురికి వార్తలు

22 Sep, 2023 18:07 IST|Sakshi

రాజమండ్రి సెంట్రల్ జైలు వ్యవస్థపై అడ్డగోలు రాతల పైత్యం

జైల్లో లేని డెంగీని చూపి చంద్రబాబుకు భద్రత లేదని రాద్ధాంతం

ఏదైనా రోగం వస్తే దానికి ఏదో ఒక మందు ఇవ్వచ్చు. కానీ మాయరోగం వస్తే ధన్వంతరి కూడా ఏ  మందు ఇవ్వాలో తెలీక చేతులు ఎత్తేయాల్సిందే. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేతలు వారి అనుకూల మీడియా అధినేతలు మాయరోగంతో తీసుకుంటున్నారు. తమ ప్రియతమ నేత చంద్రబాబు నాయుడి అరెస్ట్‌ ఇప్పటికీ జీర్ణం కాక బాధపడుతున్నారు ఎల్లో బ్యాచ్.

దీంతో ప్రభుత్వంపై ఏదో ఒక విష ప్రచారం చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడిని ఉంచిన రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగా మురికి వార్తలు.. బురద ప్రచారాలు చేసేస్తున్నారు. సూది మొనంత సందు దొరికితే అందులో దూరిపోదామని చూస్తున్నారు. కానీ వర్కవుట్ కావడం లేదు. దాంతో మరింత అసహనానికి గురవుతున్నారు.

తమ అభిమాన నేత చంద్రబాబు నాయుడు ఎంత పెద్ద నేరం చేసినా.. ఎన్ని సాక్ష్యాలున్నా ఎవరూ ఏమీ చేయలేరని ఇంతకాలం అనుకుంటూ వచ్చారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో బాబు కోట్లాది రూపాయలను ఎలా దారి మళ్లించారో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ పట్టుకోవడంతో చంద్రబాబు తప్పించుకునే వీలు లేకుండా పోయింది. అందుకే ఆయన్ను జ్యుడీషియల్ రిమాండ్ కు పంపారు  ఏసీబీ న్యామూర్తి.

చంద్రబాబు జైలుకెళ్లకుండా బెయిల్  తెచ్చేసుకోవాలని కోట్ల రూపాయల ఫీజులు చదివించుకుని పెద్ద పెద్ద న్యాయవాదులను పెట్టుకున్నా చంద్రబాబు జైలుకు వెళ్లక తప్పలేదు. దాంతో  టీడీపీ నేతలకు, ఎల్లో మీడియాకు తలకొట్టేసినట్లు అయ్యింది. దీంతో  చంద్రబాబు నాయుడ్ని ఉంచిన రాజమండ్రి సెంట్రల్ జైలుపై కథలు రాయడం మొదలు పెట్టారు. ఈ జైలు జైలర్ భార్యకు అనారోగ్యం చేస్తే  ఆయన సెలవు పెట్టారు.
చదవండి: వ్యూహాత్మకంగా చంద్రబాబు విచారణకు సీఐడీ

అంతే దాని కోసమే ఎదురు చూస్తున్నట్లు ఈనాడు ఓ దగుల్బాజీ కథ రాసి పారేసింది. చంద్రబాబు నాయుడిపై ఏదో కుట్రను అమలు చేయడం కోసమే ఏదో విధంగా వేధించడం కోసమే జైలర్‌ను ప్రభుత్వమే సెలవుపై పంపిందంటూ వార్త వండింది. టీడీపీ నేతలను సెంట్రల్ జైలుకు తరలించిన ప్రతీ సారీ ఇలానే చేస్తున్నారంటూ ఆ వంటలో కొంత విషం కలిపింది.

రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏం జరుగుతోంది? అంటూ కనుబొమలెరగేసింది. తీరా చూస్తే పాపం జైలర్ భార్య తీవ్ర అనారోగ్యంతో ప్రాణాలు వదిలారు. ఓ వార్త ప్రచురించేటపుడు నిజా నిజాలు తెలుసుకోవడం కనీస బాధ్యత. దాన్ని కూడా పక్కన పెట్టేసి ఈనాడు చెత్త వార్త రాసి చేతులు దులిపేసుకుంది. పోనీ ఆ తర్వాత జైలర్ భార్య చనిపోయారన్న వార్త తెలిసిన తర్వాత అయినా మేం తప్పుడు వార్త ఇచ్చాం.. పొరపాటు పడ్డాం, క్షమించేయండి అని అడగడానికి కూడా రామోజీరావుకు  మనసు రాలేదు. పైకి వివరణ ఇవ్వకపోయినా లోపల అయినా నాలికలు కరుచుకుని ఉండచ్చు.

జైల్లో చంద్రబాబు ప్రాణాలకు ముప్పుందని.. అక్కడ ఆయనకు భద్రత లేదని చంద్రబాబు నాయుడి సతీమణి భువనేశ్వరితో పాటు టీడీపీ నేతలు ఎల్లో మీడియా పదే పదే అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నారా లోకేష్ మరో ఛండాలానికి దిగారు. తన తండ్రి చంద్రబాబును జైల్లోనే చంపేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన మెడకాయ మీద తలకాయ లేకుండా ఆరోపించారు. అంతకు ముందు ఎల్లో మీడియా కూడా  చంద్రబాబుపై  దోమల ద్వారా స్లో పాయిజన్  ఎక్కించే కుట్ర జరుగుతోందని బరితెగించి ఆరోపించేశారు.
చదవండి: టీడీపీ భయపడుతోంది.. బాలకృష్ణ విజిల్స్‌ సిగ్గుచేటు

లోకేష్ తాజా ఆరోపణకు మరో అబద్దాన్ని అడ్డు పెట్టుకున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లోని రిమాండ్ ఖైదీ సత్యనారాయణ డెంగీ జ్వరంతో మృతి చెందారని.. అన్న లోకేష్ తన తండ్రికి కూడా డెంగీ వచ్చేలా చేయాలని కుట్ర జరుగుతోందన్నారు.లోకేష్ చెప్పిందంతా అబద్ధమే. అందులో  ఇసుమంత అయినా నిజం లేదు. సత్యనారాయణ అనే ఖైదీ డెంగీతో చనిపోవడం వరకు నిజం. కాకపోతే సత్యనారాయణ అనే ఖైదీ జైలుకు రావడమే డెంగీ జ్వరంతో వచ్చారు. ఈ నెల ఆరున జైలుకు వచ్చిన సత్యనారాయణకు స్క్రీనింగ్ టెస్టు చేసినపుడు డెంగీ నిర్ధరణ అయ్యింది.

వెంటనే జైలు సిబ్బంది సత్యనారాయణ్ని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఆసుపత్రిలోనే  సత్యనారాయణ మృతి చెందారు. ఈ మధ్య శవాలను కూడా చంద్రబాబుకు సానుభూతి రావడం కోసం తెగ వాడేస్తోన్న టీడీపీ నేతలు ఇపుడు రిమాండ్ ఖైదీ సత్యనారాయణ మృతదేహాన్ని కూడా ఫుల్లుగా వాడేయాలని డిసైడ్ అయ్యారు.

ఆ శవాన్నే నారా లోకేష్ తనకు అనుకూలంగా మలుచుకుని సత్యనారాయణ జైల్లోనే డెంగీ వచ్చి చనిపోయారని విష ప్రచారం చేసేశారు. దీన్ని అడ్డుపెట్టుకుని తన తండ్రిని జైలు నుండి విడుదల చేయించాలని న్యాయస్థానాలను అడగాలని వారు ప్రిపేర్ అవుతున్నారో ఏమో కానీ వారి వేషాలు మాత్రం చాలా చాలా అసహ్యంగా ఉంటున్నాయంటున్నారు నిపుణులు. 
:::సీఎన్‌ఎస్‌ యాజులు, సీనియర్‌ జర్నలిస్టు

మరిన్ని వార్తలు