వీడియో: దేశ రాజకీయాల్లో ఫస్ట్‌ టైం ఇలా! జార్ఖండ్‌ గవర్నర్‌కు వీడియోతో మెజార్టీ చూపించారు!!

1 Feb, 2024 19:44 IST|Sakshi

రాంచీ: హేమంత్‌ సొరెన్‌ అరెస్ట్‌ వెంటనే జార్ఖండ్‌లో నూతన ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఆలస్యం చేయకుండా జేఎంఎం సీనియర్‌ నేత చంపయ్‌ రాయ్‌ను లెజిస్టేటివ్‌ లీడర్‌గా ప్రకటించారు. కానీ, గవర్నర్‌ మాత్రం ప్రభుత్వ ఏర్పాటునకు వెంటనే ఆహ్వానించలేదు. దీంతో తీవ్ర సస్పెన్స్‌ తర్వాత.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ను చంపయ్‌ సొరెన్‌ కలిశారు.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు మెజారిటీ ఉందని గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌కు తెలిపారు. అంతేకాదు.. అప్పటికే తీసిన మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేల వీడియోను గవర్నర్‌కు చూపించడం గమనార్హం.  జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్ దళ్‌(ఆర్జేడీ)ల అధికార కూటమి చంపయ్ సొరెన్‌కు మద్దతు తెలుపుతున్న 43 మంది ఎమ్మెల్యేల వీడియోను విడుదల చేసింది. గవర్నర్‌ను చంపయ్ సొరెన్ కలవడానికి వెళ్లే ముందు ఎమ్మెల్యేలు వీడియో రికార్డింగ్‌ ద్వారా మద్దతు చెప్పించారు.

ఆ వీడియోలో చంపయ్ సొరెన్‌తో పాటు కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత అలంగీర్ ఆలం, ఆర్జేడీ ఎమ్మెల్యే సత్యానంద్ భోక్తా, సీపీఐ (ఎంఎల్) ఎల్ ఎమ్మెల్యే వినోద్ సింగ్, ప్రదీప్ యాదవ్‌లు ఉన్నారు.
 
సమావేశానంతరం చంపయ్‌ సొరెన్‌ మాట్లాడుతూ.. 'ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మెజారిటీ సాధించి 22 గంటలైంది. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని గవర్నర్‌ చెప్పారు.' అని అన్నారు. మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ బుధవారం రాత్రి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ కేసులో హేమంత్ సొరెన్ అరెస్టు కావడంతో చంపయ్ సొరెన్ వెంటనే సీఎంగా ప్రమాణం చేస్తారని అంతా భావించారు. కానీ, రాజ్‌భవన్‌ వద్ద నాటకీయ పరిణామాల నేపథ్యంలో అది వాయిదా పడుతూ వస్తోంది. 

ఇదీ చదవండి: Jarkhand Crisis: కొత్త సీఎంగా చంపయ్‌ సొరెన్‌ ఎంపికకు అసలు కారణం ఇదే?

whatsapp channel

మరిన్ని వార్తలు