మరో వివాదంలో కమల్‌: వైరల్‌ పిక్‌ 

8 Apr, 2021 16:51 IST|Sakshi

విలేకరిపై దాడికి ప్రయత్నించాడంటూ  గుప్పుమన్న ఆరోపణలు

బహిరంగ క్షమాపణ చెప్పాలంటున్న కోయంబత్తూర్‌ ప్రెస్‌క్లబ్‌ 

సాక్షి, చెన్నై: ప్రముఖ నటుడు మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) చీఫ్,  కమల్ హాసన్‌ను మరో వివాదంలో ఇరుక్కున్నారు.  పోలింగ్‌ రోజు (మంగళవారం) కమల్‌హాసన్‌  ఒక రిపోర్టర్‌పై దాడి చేశారంటూ ఆరోపణలు గుప్పుమన్నాయి.  రిపోర్టర్‌ను  కొట్టానికి ప్రయత్నించారంటూ కోయంబత్తూర్ ప్రెస్ క్లబ్‌ ఈ ఘటనను ఖండించింది. సోషల్‌ మీడియా వేదిక ఫేస్‌బుక్ పోస్ట్‌లో కమల్‌పై ఆరోపణలు  గుప్పించింది.  ఈ సందర్భంగా రిపోర్టర్‌ను కొట్టడానికి కమల్‌ తన వాకింగ్ స్టిక్ పైకి లేపిన చిత్రం వైరల్ అవుతోంది. దీంతో వివాదం రగిలింది. కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గంలోని ఒక పోలింగ్‌ కేంద్రం వద్ద చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కమల్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలని ప్రెస్ క్లబ్‌ డిమాండ్‌ చేస్తోంది.

వీడియోను చిత్రీకరించవద్దని డిమాండ్ చేస్తూ కమల్‌ అడ్డుకున్నాడని రిపోర్టర్‌ను తన వాకింగ్ స్టిక్ తో కొట్టడానికి ప్రయత్నించాడని క్లబ్ ఆరోపించింది. అదృష్టవశాత్తూ అతడు గాయపడకపోయినా, కర్ర అంచు అనుకోకుండా  జర్నలిస్టు మెడకు తగిలి ఉంటేపరిస్థితి దారుణంగా ఉండేదని ఆరోపించింది. ఈ ఘటన తమను, తమ పాత్రికేయ బృందాన్ని షాక్‌కు గురి చేసిందని తెలిపింది. అంతేకాదు దీనికి చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని కూడా హెచ్చరించడం గమనార్హం. అటు న్యూస్ జర్నలిస్ట్ దాడి ఘటనను ఖండించిన కాంగ్రెస్ అభ్యర్థి మయూరా జయకుమార్, బీజేపీ  మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు వనాతి శ్రీనివాసన్  కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలంటూ ట్వీట్‌ చేశారు. అయితే ఈ ఆరోపణలపై  అటు కమల్‌ గానీ,  ఎంఎన్‌ఎం గానీ  అధికారికంగా స్పందించాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు