ఆ నలుగురు నేతల గుప్పిట్లో బీజేపీ

31 Dec, 2020 18:34 IST|Sakshi

ఆ పార్టీలో ఆ నలుగురు నేతలు తమ ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నారు. గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారట. దీంతో కొత్త, పాత నేతల మద్య విభేదాలు భగ్గుమంటున్నాయి. బయట అందరితో కలిసికట్టుగా ఉన్నట్టు కనిపించినా లోలోపల గోతులు తీస్తారనే ప్రచారం ఉంది. జిల్లాలో పార్టీ బలపడేందుకు అవకాశాలు ఉన్నా ఆ నలుగురు నేతల తీరు ఇబ్బందిగా మారిందని కార్యకర్తలు అంటున్నారు.  మరో వైపు తన కుమారుడిని రానున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎవరా నేతలు... ఎక్కడ జరుగుతోంది ఈ వ్యవహారం..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీజేపీకి మంచి పట్టుంది. ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేసిన చరిత్ర బీజేపీకి ఉంది. పార్టీ బలపడేందుకు మంచి అవకాశాలు ఉన్నాయి. కానీ నేతల మధ్య సమన్వయలోపం.. ఆధిపత్య పోరు.. వర్గ విభేదాలు పార్టీకి నష్టం కల్గిస్తున్నాయి. గతంలో అలంపూర్‌ నుంచి రవీంద్రనాథ్‌రెడ్డి బీజేపీ తరపున మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1999 జితేందర్‌రెడ్డి బీజేపీ నుంచి ఎంపీగా మహబూబ్‌నగర్ నుంచి గెలిచారు. 2008లో జరిగిన ఉపఎన్నికల్లో మహబూబ్‌నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి గెలిచారు. 2014, 2018 సాధారణ ఎన్నికల్లో ఆచారి కల్వకుర్తి నియోజకవర్గం నుంచి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. జిల్లాలోని నారాయణపేట, మక్తల్, కల్వకుర్తి, మహబూబ్‌నగర్ సెగ్మెంట్లతో పాటు పలు పట్టణాల్లో పార్టీకి బలమైన క్యాడర్, ఓటు బ్యాంకు ఉంది. గత లోక్‌సభ ఎన్నికల ముందు మాజీమంత్రి డీకే అరుణ, మాజీఎంపీ జితేందర్‌రెడ్డితో పాటు వారి అనుచరులు బీజేపీలో చేరిన తర్వాత జిల్లాలో పార్టీ బలం మరింత పెరిగింది. పార్టీ క్యాడర్‌లో జోష్‌ పెరిగింది. (అగ్గిరాజేస్తున్న ఆధిపత్య పోరు)

2019 లోక్‌సభ ఎన్నికల్లో డీకే అరుణ మహబూబ్‌నగర్ ఎంపీగా పోటీ చేసి అధికార టీఆర్ఎస్ పార్టీకి ముచ్చెమటలు పట్టించారు. గెలవకపోయినా పార్టీ క్యాడర్‌కు ఓ కొత్త ఊపునిచ్చింది. మహబూబ్‌నగర్, మక్తల్ సెగ్మెంట్‌లో టీఆర్ఎస్‌ కంటే అధికంగా ఓట్లు సాధించారు. తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో దూకుడు పెంచిన ఆ పార్టీ మక్తల్‌ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోగా నారాయణపేట, భూత్పూరు, అమరచింతలో అధిక స్థానాలు గెలుచుకుంది. డీకే అరుణకు జాతీయ ఉపాధ్యక్షపదవి రావటంతో మరింత విశ్వాసం పెరిగింది. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌ బీజేపీలో చేరారు. ఆయనకు జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టారు. 

ఇబ్బందిగా ఆ నలుగురు..
ఇక దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ గెలవటంతోపాటు హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అధిక స్థానాల్లో గెలవటంతో జోష్‌ మీద ఉన్న ఆపార్టీ జిల్లాలో కూడా దూకుడు పెంచింది. పార్టీ కార్యక్రమాలను, ప్రజాసమస్యలపై తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. మరోవైపు ఇతర పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలు, ఆయా నియోజకవర్గాల్లోని బలమైన నేతలను పార్టీలోకి ఆకర్షించేందుకు కసరత్తు మొదలు పెట్టారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. మొదటి నుంచి పార్టీలో ఉన్న నలుగురు నేతల తీరు ఇబ్బందిగా మారిందనే ప్రచారం జోరుగా సాగుతుంది. అందులో పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్, సీనియర్ నాయకులు నాగూరావునామాజీ, ఆచారి, కొండయ్య పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కొత్తగా పార్టీలో చేరిన నేతలకు వీరు సహకరించటం లేదనే ప్రచారం సాగుతుంది. గతంలో పార్టీలో చేరి మహబూబ్‌నగర్ ఎంపీగా పోటీ చేసిన నాగం జనార్దన్‌రెడ్డికి ఈ నేతలతో పాటు రాష్ట్రనేతల్లో కొందరు పొమ్మనలేక పొగపెట్టారట. పలు సందర్భాల్లో అవమానపరిచారనే ఉద్దేశ్యంతో ఆయన పార్టీని వీడారు. మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి విషయంలో కూడా ఈ పాతనేతల తీరు అభ్యంతరకరంగా ఉండటంతో ఆయన పార్టీని వీడారు. తాజాగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ పర్యటనలో అవమానం జరిగిందని పార్టీ అధ్యక్షుడు ఎర్రశేఖర్ రాజనామా చేయటం సంచలనం రేపింది. జిల్లాలో అధ్యక్షుడి పర్యటన వివరాలు కూడా తనకు తెలియకుండా ఈ నేతలు పావులు కదిపారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఓ నాయకుడు మండల పార్టీ అధ్యక్షులకు ఫోన్లు చేసి తాము చెప్పినట్టు ఏర్పాట్లు చేయాలని హుకూం జారీ చేశాడట.

లోలోపల గోతులు..
రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన వివరాలు తెలిపేందుకు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఎర్రశేఖర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కానీ ఆ నేతలు నారాయణపేట జిల్లాలో రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన ఉంటే నీవు ఎలా మీడియా సమావేశం పెడతావని.. కొత్తగా వచ్చిన నేతల పెత్తనం నడవదనే ధోరణితో మాట్లాడారట. అందుకే మీడియా సమావేశం రద్దు చేశారు. కానీ రాష్ట్ర నాయకుడు మాత్రం నారాయణపేటకు వెళ్లి అక్కడ మీడియా సమావేశం పెట్టడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మహబూబ్‌నగర్‌లో రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన వివరాలు కూడా జిల్లా అధ్యక్షుడికి తెలియకుండా కేవలం పాత నేతల కనుసన్నల్లోనే నిర్వహించారు. మొత్తంగా ఈ పాత నేతలు కొత్తవారిని పార్టీలో ఎదకకుండా తొక్కెయటానికి వ్యూహాలు సిద్ధం చేస్తారనే టాక్‌ఉంది. అందరితో మంచిగా ఉన్నట్టు నటిస్తూ లోలోపల గోతులు తీస్తారనే ప్రచారం ఉంది. మహబూబ్‌నగర్ పట్టణ అధ్యక్షుడి ఎన్నిక సందర్భంగా గ్రూపు రాజకీయాలు చోటు చేసుకున్నాయి. 

బరిలో మాజీ ఎంపీ తనయుడు..
ఓ వర్గం నేతలు పార్టీ కార్యాలయం ముందే ఆందోళనకు దిగారు. జిల్లాలో పార్టీ బలపడెందుకు మంచి అవకాశాలు ఉన్నా నేతల మద్య విభేదాలు, అధిపత్యపోరు నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉంది. కొన్ని సెగ్మెంట్లో కొత్త, పాత నేతలు ఎడమొహం.. పెడమొహంగా ఉంటున్నారు. మాజీఎంపీ జితేందర్‌రెడ్డి తన తనయున్ని వచ్చే ఎన్నికల్లో ఏదో నియోజకవర్గం నుంచి బరిలో దింపుతారనే ప్రచారం సైతం పార్టీలో కొనసాగుతుంది. అదే జరిగితే ఏ నియోజకవర్గంలో తమపై ప్రభావం పడుతుందోననే ఆందోళన సైతం కొందరు నేతల్లో నెలకొంది. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ జిల్లాలో బలపడుతున్న బీజేపీ పార్టీకి కొందరు నేతల తీరు తీవ్రంగా నష్టం కలిగించే ప్రమాదం ఉందని పార్టీలోని సీనియర్లే గుసగుసలాడుతున్నారు. మరి జాతీయ ఉపాధ్యక్షహోదాలో ఉన్న డీకే అరుణ, పార్టీ హై కమాండ్‌తో మంచి సన్నిహితం ఉన్నమాజీఎంపీ జితేందర్‌రెడ్డి కొత్తపాత నేతల మద్య సమన్వయం చేసి పార్టీ బలోపేతం కోసం ముందుకు సాగాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. లేకుంటే పార్టీకి తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంది.

మరిన్ని వార్తలు