ఆ ఇద్దరి నేతల మధ్య.. బస్తీ మే సవాల్‌

3 Jul, 2022 21:17 IST|Sakshi

‘జోగు’ వర్సెస్‌ బాపూరావు

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల మధ్య ముదిరిన వార్‌ 

ముఖ్యనేతలంతా ఓ వైపు.. బోథ్‌ ఎమ్మెల్యే మరోవైపు 

సాక్షి, ఆదిలాబాద్‌: టీఆర్‌ఎస్‌లో ముఖ్యనేతల మధ్య ఇప్పటివరకు కొనసాగిన కోల్డ్‌వార్‌ ఇపుడంతా బహాటమయ్యింది. బస్తీ మే సవాల్‌ అన్నట్లుగా తోడ కొడుతున్నారు. ముఖ్యనేతలంతా ఒకవైపు అయ్యారు. బోథ్‌ ఎమ్మెల్యే మరోవైపయ్యారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అండతో ఆయన ముందుకు సాగుతున్నారు. అయితే బోథ్‌ నియోజకవర్గంలో వరుసగా జరుగుతున్న పరిణామాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. 

పైచేయి యత్నాలు 
బోథ్‌ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన పరిణామాలు రాజకీయంగా పార్టీలో ఉన్న వైషమ్యాలను బహిర్గతపరుస్తున్నాయి. తాజాగా బజార్‌హత్నూర్‌ ఎంపీడీఓగా చౌహాన్‌ రాధాను నియమించారు. బోథ్‌ మండలంలో ఉపాధి అక్రమాలకు సంబంధించి బాధ్యురాలిని చేస్తూ గడిచిన జెడ్పీ మీటింగ్‌ రోజు సస్పెన్షన్‌ వేటు వేస్తూ కలెక్టర్‌ ఆదేశాలిచ్చారు. బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు ఉపాధి అక్రమాలకు సంబంధించి వివరాలు కోరినా అధికారులు ఇవ్వడంలేదని, ఎంపీడీఓపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు.

ఈ పరిణామాల నేపథ్యంలోనే అప్పట్లో ఆమెపై వేటు పడింది. ఒక వైపు అక్రమాలపై విచారణ పూర్తిస్థాయిలో జరగనేలేదు.. దుర్వినియోగమైన నిధుల రికవరీ చేపట్టలేదు. ఇదిలా ఉండగానే ఆ ఎంపీడీఓపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ బజార్‌హత్నూర్‌ మండలంలో పో స్టింగ్‌ ఇవ్వడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. రాజకీయంగా పైచేయి సాధించేందుకే అక్కడ ఇలా జరుగుతుందన్న చర్చ సాగుతోంది.

బోథ్‌ ఎంపీపీ తుల శ్రీనివాస్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బా పూరావుకు వ్యతిరేకంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అప్పట్లో ఎంపీడీఓపై సస్పెన్షన్‌ వేటు ప డిన తర్వాత నియోజకవర్గంలో ఆమెకు పోస్టింగ్‌ రా కుండా చూస్తామని ఎమ్మెల్యే వర్గీయులు సవాలు విసిరారు. పక్క మండలంలోనే ఆమెకు తిరిగి పోస్టింగ్‌ ఇప్పించడంలో ఎంపీపీ సఫలీకృతమయ్యా రు. జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న సహకారంతో ఇది జరిగిందన్న ప్రచారం సాగుతోంది. 

పార్టీ పదవీ విషయంలో ..
కొద్ది రోజుల క్రితం బోథ్‌ నియోజకవర్గ అధికార ప్ర తినిధిగా తలమడుగు మండలానికి చెందిన కిరణ్‌కుమార్‌ను ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు నియమిస్తూ సన్మానం చేశారు. అయితే పార్టీపరమైన పదవుల ని యమాకంలో ఎమ్మెల్యేలకు ప్రమేయముండదని జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న బహాటంగానే ఖండిస్తూ ఆ నియమాకం చెల్లదని చెప్పడం పార్టీలో చర్చ కు దారితీసింది. అయితే దీని వెనుక మరోక ప్ర చారం జరుగుతోంది. నియోజకవర్గానికి చెందిన ఓ నాయకుడిని అధికార ప్రతినిధిగా నియమించాలని పార్టీ ముఖ్యనేతలు ప్రయత్నాలు చేస్తున్నారనే విష యం బయటకు రావడంతోనే రాథోడ్‌ బాపూరావు ముందుగానే తన అనుచరుడిని నియమించడం ద్వారా వ్యూహాకత్మకంగా ముందుకు కదిలారు. ఈ అంశం ప్రస్తుతం పార్టీలో హాట్‌టాపిక్‌గా మారింది.

అందరూ ఒకవైపు..
టీఆర్‌ఎస్‌ జిల్లా రాజకీయాల్లో ఎమ్మెల్యే జోగు రామన్న, మాజీ మంత్రి గోడం నగేశ్, సీనియర్‌ నేత లోక భూమారెడ్డిలు ఒక్కటిగా ముందుకు సాగుతున్నారు. గతం నుంచి ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావుతో ఉన్న విబేధాల కారణంగా జిల్లా ముఖ్యనేతలు అందరూ ఒక్కటై ఆయనకు వ్యతిరేకంగా కదులుతున్నారని పార్టీలో చెప్పుకుంటున్నారు. జెడ్పీటీసీ అనిల్‌ జాదవ్‌ పుట్టినరోజు వేడుకలు గత నెలలో నేరడిగొండలో జరుగగా ముఖ్యనేతలంతా దానికి హాజరుకావడం, ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు ఆ వేడుకకు దూరంగా ఉండటం వారి మధ్యలో ఉన్న విభేదాలు కళ్లకు కట్టాయి. ఈ విధంగా జిల్లాలో టీఆర్‌ఎస్‌ నేతల మధ్య జరుగుతున్న ఈ రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి.   

మరిన్ని వార్తలు