Kakinada Corporation: తిరుగుబాటు జెండా: టీడీపీ ఢమాల్‌..!

6 Aug, 2021 07:43 IST|Sakshi

వనమాడి నాయకత్వంపై తిరుగుబాటు

కార్పొరేషన్‌లో ‘సుంకర’ వేరు కుంపటి

రెండు వర్గాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం

‘మేయర్‌’పై త్వరలోనే అవిశ్వాసానికి రెడీ

వ్యూహరచనలో అసమ్మతి కార్పొరేటర్లు

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: చింత చచ్చినా పులుపు చావలేదనే సామెతను తలపిస్తోంది జిల్లాలో టీడీపీ పరిస్థితి. అధికారానికి ఆ పార్టీని ప్రజలు దూరం చేసినా తెలుగు తమ్ముళ్లు మాత్రం నాయకత్వ పోరుతో సతమతమవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అటు పట్టణాలు, ఇటు పల్లెల్లోనూ వైఎస్సార్‌ సీపీ తిరుగులేని ఆధిక్యతను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలకు ముందు జిమ్మిక్కులతో చేజిక్కించుకున్న ఒక్కగానొక్క కాకినాడ నగర పాలక సంస్థలో ఆ పార్టీ బోర్డు తిప్పేసే సమయం దగ్గర్లోనే కనిపిస్తోంది. కార్పొరేషన్‌లో ఇద్దరు కార్పొరేటర్లు మృతి చెందగా మిగిలిన 30 మందితో బలమైన పక్షంగా ఉన్న టీడీపీ ఇప్పటికే నిట్టనిలువునా చీలిపో యింది.

మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తీరునచ్చక మెజార్టీ కార్పొరేటర్లు కొన్నాళ్లుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. బుధవారం డిప్యూటీ మేయర్‌ ఎన్నికల్లో వారందరూ బాహాటంగానే తిరుగుబాటు జెండా ఎగురేశారు. అసమర్థ నాయకత్వాన్ని కొనసాగిస్తే భవిష్యత్‌ ఉండదనే అభిప్రాయం కుండ బద్దలుగొట్టారు. రెండో డిప్యూటీ మేయర్‌ ఎన్నికను వేదికగా చేసుకుని తడాఖా చూపించారు. ఫలితంగా కార్పొరేషన్‌లో టీడీపీ గల్లంతయ్యే రోజులు దగ్గరపడ్డాయనడంలో సందేహం లేదని ఆ పార్టీలో సీనియర్లే అంగీకరిస్తున్నారు.

వాడబలిజల అణచివేత
కార్పొరేషన్‌లో భంగపాటుకు టీడీపీ నాయకత్వ వైఫల్యమే కారణమని స్పష్టమైంది. డిప్యూటీ ఎన్నికల్లో పోటీ చేసేది లేదని పార్టీ ఇన్‌చార్జి వనమాడి చేసిన ప్రకటనను పార్టీలో ఏ ఒక్కరూ ఖాతరు చేయలేదు. ముందు పోటీలో లేమని చెప్పి, తరువాత పలివెల రవిని బరిలోకి దింపడం వంటి అసమర్థ నాయకత్వ లక్షణాలే టీడీపీ దుస్థితికి కారణమని విశ్లేషిస్తున్నారు. పార్టీ అభ్యర్థిని ఓడించడం ద్వారా కార్పొరేటర్లు నాయ కత్వంపై అసంతృప్తిని వెళ్లగక్కారు.

కాకినాడలో మ త్స్యకారుల్లో 50 శాతం ఓటింగ్‌ ఉన్న వాడబలిజలను రాజకీయంగా, సామాజికంగా కొండబాబు అణగదొక్కేయడం కూడా ఈ పరిస్థితికి కారణంగా చెబుతున్నారు. టీడీపీలో ఈ వర్గానికి ఉన్న అసంతృప్తిని గుర్తించి అదే వర్గం నుంచి అదే పార్టీకి చెందిన చోడిపల్లి ప్రసాద్‌ను డిప్యూటీగా నిలబెట్టి గెలిపించుకోవడంలో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి వ్యూ హం ఫలితాన్నిచ్చింది. కొండబాబు నాయకత్వంపై ఉన్న అసంతృప్తి ఓటమి రూపంలో ఎదురవడం అధినాయకత్వానికి మింగుడు పడటం లేదు. ఇదే తీరు కొనసాగితే నగరపాలక సంస్థను కూడా వదులుకోకతప్పదని పార్టీకి చెందిన కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

మేయర్‌ పీఠం కదలనుందా..
వనమాడి నాయకత్వ వైఫల్యమే కారణమని మేయర్‌ సుంకర పావని వర్గం, మేయర్‌ వైఫల్యమే కారణమని వనమాడి అనుయాయులు పరస్పరం ఆరోపించకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొండబాబుకు వ్యతిరేకంగా పార్టీలో మేయర్‌ వేరు కుంపటి పెట్టారు. కార్పొరేటర్లను సమన్వయం చేసుకోలేకపోవడమే ఈ పరిస్థితికి కారణమంటూ కొండబాబు తమపై బురద చల్లుతున్నారని మేయర్‌ వర్గీయులు గుర్రుగా ఉన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి పాటుపడాల్సిన బాధ్యత మేయర్‌పై ఉంటుంది. నగరపాలక సంస్థలో బలమైన పక్షంగా ఉన్నా కాకినాడ స్మార్ట్‌ సిటీలో అభివృద్ధి, పాలన గాడి తప్పాయనే అసంతృప్తి ప్రజల్లో ఉంది.

నాలుగేళ్లయినా అధికారులను సమన్వయపర్చుకునే రాజకీయ పరిపక్వత, మున్సిపల్‌ చట్టాలపై అవగాహన లోపించాయనే ముద్ర ఆమెపై ఉంది. ఈ పరిస్థితుల్లో ఏ క్షణాన్నయినా మేయర్‌పై అవిశ్వాసం పెట్టాలని ఆ పార్టీ కార్పొరేటర్లు యోచిస్తున్నారు. నెల రోజుల్లో పదవీ గండం ఖాయమని వీరి మధ్య బహిరంగంగానే చర్చ నడుస్తోంది. చట్ట ప్రకారం మేయర్‌పై అవిశ్వాసానికి మూడేళ్ల పదవీ కాలం పూర్తి కావాలి. వైఎస్సార్‌ హ యాంలో దీనిని నాలుగేళ్లకు పొడిగించారు. ఈ క్రమంలో సెప్టెంబర్‌లో మేయర్‌పై అవిశ్వాసం ప్రవేశపెట్టే ప్రయత్నాలు తెర వెనుక చురుగ్గా జరుగుతున్నాయి.

అవినీతిని సహించలేకే... 
టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు హయాంలో అడుగగడుగునా అలసత్వం, నిస్సహాయత, అవినీతి పేరుకుపోయాయి. ఆయన హయాంలో ఎలాంటి అభివృద్ధీ జరగక, ప్రజలకు సమాధానం చెప్పలేక ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ప్రజలకు ముఖం చాటేసే పరిస్థితి తెచ్చారు. అందువల్లే టీడీపీకి గుడ్‌బై చెప్పి సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిలకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాం.
 – చోడిపల్లి ప్రసాద్, డిప్యూటీ మేయర్‌

ఇద్దరి మధ్య వేగలేకపోయాం
మాజీ ఎమ్మెల్యే కొండబాబు, మేయర్‌ సుంకర పావని మధ్య వేగలేకపోయాం. ఒకరి వద్దకు వెళ్తే రెండో వారికి కోపం వచ్చేది. అలాగని ఏ ఒక్కరూ డివిజన్ల అభివృద్ధిపై దృష్టి సారించిన దాఖలాలు లేవు. రెండేళ్లపాటు పడరాని పాట్లు పడ్డాం. ప్రజల ముందు తలెత్తుకు తిరగలేకపోయాం. కొత్త ప్రభుత్వం వచ్చాక ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయగలుగుతున్నాం. అందుకే టీడీపీకి గుడ్‌బై చెప్పాల్సి వచ్చింది.
– కె.బాలాప్రసాద్, 46వ డివిజన్‌ కార్పొరేటర్‌ 

మరిన్ని వార్తలు