హోదా ఇవ్వాల్సిందే

21 Jul, 2021 03:00 IST|Sakshi
పార్లమెంట్‌ ఆవరణలో మీడియాతో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు

సవరించిన ‘పోలవరం’ అంచనాలను ఆమోదించాలి

లోక్‌సభ, రాజ్యసభల్లో వైఎస్సార్‌సీపీ సభ్యుల ఆందోళన

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల, విశాఖ స్టీలు ప్లాంటు పరిరక్షణ అంశాలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సభ్యుల ఆందోళనతో మంగళవారం పార్లమెంటు ఉభయసభలు స్తంభించాయి. ఆ పార్టీ ఎంపీల ఆందోళనలతో లోక్‌సభ, రాజ్యసభ అట్టుడికిపోయాయి. లోక్‌సభ పూర్తిగా స్తంభించిపోగా రాజ్యసభ మధ్యాహ్నం వరకు స్తంభించిపోయింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి పోలవరం జాతీయ ప్రాజెక్టుకు సవరించిన అంచనాల మేరకు కేంద్రం పెట్టుబడి క్లియరెన్స్‌ ఇవ్వాలని, ఈ అంశంపై చర్చకు వీలుగా సభా కార్యక్రమాలు వాయిదా వేయాలని కోరుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ విప్‌ మార్గాని భరత్‌ లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాకు నోటీసులు ఇచ్చారు. ఉదయం సభ ప్రారంభం కాగానే ఈ అంశంపై చర్చకు పట్టుబట్టుతూ పార్టీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ ఎంపీలంతా వెల్‌లోకి దూసుకెళ్లి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.
 

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని, విశాఖ స్టీలు ప్లాంటు ఏర్పాటైంది అమ్మకానికి కాదని, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని ప్లకార్డులు ప్రదర్శించారు. మరోవైపు కాంగ్రెస్, టీఎంసీ తదితర పక్షాలు పెగాసస్‌ వివాదంపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగాయి. ఈనేపథ్యంలో సభ ప్రారంభమైన నాలుగు నిమిషాలకే మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు సభాపతి ప్రకటించారు. తిరిగి సభ ప్రారంభమయ్యాక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలతో హోరెత్తించారు. చేసిన చట్టాలు అమలు చేయాలని, ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని నినదించారు. పదేపదే విజ్ఞప్తి చేసినా వారు ఆందోళన కొనసాగించడంతో 8 నిమిషాలకే సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభమవగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీలు తిరిగి వెల్‌లో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ సభాకార్యకలాపాలకు అడ్డుతగిలారు. దీంతో ప్యానెల్‌ స్పీకర్‌ కిరీట్‌ సోలంకి ఒకే ఒక్క నిమిషంలో సభను గురువారానికి వాయిదా వేశారు. మంగళవారం లోక్‌సభ 14 నిమిషాలపాటు కొనసాగింది. 

రాజ్యసభలో 267 నిబంధన కింద నోటీసు
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా హామీ అంశంపై మంగళవారం రాజ్యసభలో కార్యకలాపాలు మధ్యాహ్నం వరకు స్తంభించిపోయాయి. ఉదయం సభ ప్రారంభమైన వెంటనే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయిరెడ్డి 267 నిబంధన కింద ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై చర్చించాలని తాము ఇచ్చిన నోటీసును అనుమతించాలని కోరారు. కాంగ్రెస్‌ పక్ష ఉపనేత ఆనంద్‌శర్మ కూడా తాము రూల్‌ 267 కింద ఇచ్చిన నోటీసును అనుమతించాలని కోరారు. దీనిపై చైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు స్పందిస్తూ.. రూల్‌ 267 కింద ఈరోజు 15 మంది సభ్యులు నోటీసులు ఇచ్చారని, అందులో జాతీయ ప్రాధాన్య అంశాలు అనేకం ఉన్నప్పటికీ వాటిని ఇప్పటికిప్పుడు చర్చకు అనుమతించలేనని చెప్పారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అన్నది కూడా జాతీయ ప్రాధాన్యత ఉన్న అంశమేనని, దీనిపై చర్చకు ఎప్పుడు అనుమతిస్తారని ప్రశ్నించారు.

చట్టాలకు, సభలో ఇచ్చిన హామీలకు గౌరవం ఇవ్వనప్పుడు రాజ్యాంగానికి ఏం గౌరవం ఇచ్చినట్టని అడిగారు. చైర్మన్‌ స్పందిస్తూ దీనిపై వాదన వద్దని, ఈ అంశం మీకు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినదని జవాబిచ్చారు. దీంతో విజయసాయిరెడ్డితోపాటు వైఎస్సార్‌సీపీ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని పోడియం వద్ద నిరసనకు దిగారు. ఒకదశలో విజయసాయిరెడ్డి ఆగ్రహంతో చేతిలోని పేపర్లను చింపేశారు. సభలో గందరగోళం ఏర్పడటంతో చైర్మన్‌ గంటపాటు వాయిదా వేశారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు సభ ప్రారంభమయ్యాక కూడా అదే పరిస్థితి నెలకొనడంతో మళ్లీ వాయిదాపడింది. ఒంటిగంటకు తిరిగి సభ సమావేశమైన తర్వాత కూడా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని పోడియం వద్ద ఆందోళనకు దిగారు. విజయసాయిరెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అయోధ్యరామిరెడ్డి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీని నెరవేర్చాలని, పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌ హక్కు అని, వైజాగ్‌ స్టీలు ప్లాంటు ఏర్పాటైంది అమ్మకం కోసం కాదని ప్లకార్డులు ప్రదర్శించారు.

ఈ దశలో సభానాయకుడు పీయూష్‌ గోయల్‌ జోక్యం చేసుకుంటూ.. విజయసాయిరెడ్డిని ఉద్దేశించి ‘మీరు చాలా సీనియర్‌ సభ్యులు.  కోవిడ్‌ ఎంతటి విలయం సృష్టిస్తున్నదో మీకు తెలుసు. అలాంటి అతి ముఖ్యమైన అంశంపై సభ చర్చకు సమాయత్తమైంది. మీ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి సభలో సుహృద్భావ వాతావారణం నెలకొని చర్చ కొనసాగడానికి సహకరించండి. ఆందోళన విరమించి చర్చలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నా.’ అని పేర్కొన్నారు.  పోడియం వద్ద ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీలు ఏపీకి న్యాయం చేయాలి అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను ముందుకు సాగనీయకపోవడంతో సభ తిరిగి పావుగంట వాయిదాపడింది. అనంతరం సమావేశమైన రాజ్యసభ కోవిడ్‌పై స్వల్పకాలిక చర్చను చేపట్టింది.  

మరిన్ని వార్తలు