టీడీపీకి జనసేన ఝలక్‌! 

12 Jun, 2022 17:19 IST|Sakshi

ఆచంటలో బయటపడ్డ విభేదాలు

మండల సమావేశం నుంచి వాకౌట్‌    

పెనుగొండ: ఆచంట మండలంలో మిత్రులుగా కొనసాగుతున్న జనసేన, టీడీపీ మధ్య విభేదాలు మండల పరిషత్‌ సమావేశం వేదికపై బహిర్గతమయ్యాయి. శనివారం ఆచంట మండలపరిషత్‌ సమావేశం ఎంపీపీ దిగమర్తి సూర్యకుమారి అధ్యక్షతన జరిగింది. గతంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి మండలపరిషత్‌ను కైవసం చేసుకున్నాయి. ఒప్పందంలో భాగంగా జనసేనకు ఉపాధ్యక్ష పదవిని కట్టబెట్టారు. అయితే కొంత కాలంగా ఆయా పార్టీల మధ్య కొనసాగుతున్న అభిప్రాయ భేదాలు మండలపరిషత్‌ సమావేశంలో బయటపడ్డాయి.

టీడీపీ తమను చిన్న చూపు చూస్తుందని జనసేన సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వైస్‌ ఎంపీపీ ఎర్రగొప్పుల నాగరాజు సమావేశంలో తన అసంతృప్తిని వెళ్లగక్కారు. అభివృద్ధి పనుల్లో కూడా తమను సంప్రదించడం లేదని, సభ నుంచి వాకౌట్‌ చేస్తున్నామని ప్రకటించగా.. ఆయనతోపాటు పెదమల్లం జనసేన ఎంపీటీసీ సభ్యుడు ప్రసాద్‌ సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో టీడీపీ సభ్యులు కంగుతిన్నారు. ఇదిలా ఉండగా టీడీపీ సభ్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండల సర్పంచ్‌ల చాంబర్‌ అధ్యక్షుడు సుంకర సీతారామ్‌ ధ్వజమెత్తారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీరంగనాథరాజు పార్టీలకతీతంగా సంక్షేమాన్ని అమలు చేస్తున్నారని అయితే టీడీపీ పాలకవర్గం లేనిపోని విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మండలంలో నిధుల కేటాయింపుల్లో టీడీపీ పాలకవర్గం ఇ ష్టారాజ్యంగా వ్యవహరిస్తోందంటూ వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు వాకౌట్‌ చేశారు.

మరిన్ని వార్తలు