ముదిరిన ఇంటిపోరు

16 Feb, 2021 10:21 IST|Sakshi
విజయవాడ పాతబస్టాండ్‌ సమీపంలోని ఎంపీ కేశినేని భవన్‌పై ఏర్పాటుచేసిన పోస్టర్లు

ఎంపీ నానికి వ్యతిరేకంగా ఏకమవుతున్న వైరి వర్గం

విజయవాడ పార్టీ పార్లమెంటు కార్యదర్శిగా పోటాపోటీ పేర్లు

కేశినేని భవన్‌పై మారిన ఫొటేలే విభేదాల తీవ్రతకు నిదర్శనం 

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: విజయవాడ పార్లమెంటు పరిధిలో టీడీపీ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని)ను రాజకీయంగా ఏకాకిని చేయడానికి పార్టీలోని ఆయన వ్యతిరేక వర్గాలు పావులు కదుపుతున్నాయి. విజయవాడ నగరం కేంద్రంగా ఎత్తులకు పైఎత్తులు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా కేశినేని నాని కుమార్తె శ్వేత స్థానంలో నగర కార్పొరేషన్‌ మాజీ మేయర్‌ కోనేరు శ్రీధర్‌ భార్య రమాదేవిని రంగంలోకి దించాలని వ్యూహం రచించాయి. అయితే పాత పద్ధతిలోనే మున్సిపోల్స్‌ను పునఃప్రారంభించాలని ఎస్‌ఈసీ ఆదేశించిన నేపథ్యంలో రమాదేవి పేరు ప్రస్తావనకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. 

పార్టీ అధిష్టానం అండతోనే.. 
కేశినేనికి వ్యతిరేక వర్గంగా గుర్తింపున్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా, వర్ల రామయ్య, తాజాగా వివాదాస్పదునిగా గుర్తింపు పొందిన కొమ్మారెడ్డి పట్టాభిరాం తదితరులకు అధిష్టానం నుంచే ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని ఆ పార్టీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. కేశినేనిని విభేదిస్తూ ఆయనకు వ్యతిరేకంగా తాజాగా చోటుచేసుకున్న పరిణామాలను పరిశీలిస్తే... 

విజయవాడ పార్లమెంటు జిల్లా పార్టీ కార్యదర్శి నియామకం విషయంలో నాయకుల మధ్య బేధాభిప్రాయాలు తీవ్రమయ్యాయి. కేశినేని మైనార్టీ వర్గానికి చెందిన ఫతావుల్లా పేరును ప్రతిపాదించారు. కానిపక్షంలో బీసీ వర్గానికి చెందిన గోగుల వెంకటరమణను సూచించారు. తనకు తెలియకుండా పశ్చిమ నియోజకవర్గం నుంచి మరో మైనార్టీ నాయకుడిని ఎలా సిఫార్సు చేస్తారంటూ నాగుల్‌మీరా అభ్యంతరం వ్యక్తంచేయడంతో పాటు బుద్దా వెంకన్న సహకారం పొందారు. వీరివురూ బొండా ఉమాతో మంతనాలు చేసి సెంట్రల్‌కు చెందిన ఎరుబోతు రమణ పేరును అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. తను పొలిట్‌బ్యూరో సభ్యుడినని, తన లెటర్‌హెడ్‌తో పంపుతున్న ప్రతిపాదనకు ప్రాధాన్యం ఉంటుందని ఎరుబోతు రమణకే పదవి దక్కుతుందని బొండా భరోసా ఇచ్చారంటున్నారు.

పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీది మూడుముక్కలాట అయ్యింది. బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా, జలీల్‌ఖాన్‌లు ఒక్కటయ్యారు. పార్టీ అవసరాల దృష్ట్యా 8 నెలల కిందట ఆ నియోజకవర్గాన్ని చూడాలని కేశినేని నానికి చంద్రబాబు బాధ్యత అప్పగించారు. దీంతో కార్పొరేట్‌ అభ్యర్థులను కూడా ఎంపీనే ఎంపికచేశారు. తమ నియోజకవర్గంలో ఆయన పెత్తనమేంటంటూ బుద్దా, మీరాలు ఒక్కటై మనలో ఎవరో ఒకరం ఇన్‌చార్జులుగా ఉండాలే తప్ప మరొకరి జోక్యాన్ని అంగీకరిచకూడదనే అవగాహనకు వచ్చారు. నగరంలో ఎంపీ వ్యతిరేకవర్గీయులను ఏకతాటిపైకి తీసుకురావడంలోనూ వారివురూ పావులు కదుపుతున్నారు. అంతకుముందు బుద్దా, కేశినేనిల మధ్య సోషల్‌మీడియాలో వార్‌ జరిగిన సంగతి తెలిసిందే.

ఎంపీ కార్యాలయంలో బాధ్యతలు నిర్వర్తించిన కొమ్మారెడ్డి పట్టాభిరాం అక్కడ విభేదించి క్రమంగా పార్టీ కేంద్ర కార్యాలయంలోకి చేరుకున్నారు. తనదైన శైలిలో లోకేష్‌కు సన్నిహితంగా మెలుగుతూ కేశినేనికి నగరంలోని నాయకులు దూరమయ్యారనే వ్యతిరేక ప్రచారంతో అనునిత్యం పావులు కదుపుతూ పట్టాభి తీరికలేకున్నారని పార్టీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని నందిగామ పార్టీ ఇన్‌చార్జి తంగిరాల సౌమ్య రాజకీయ అవసరాల రీత్యా ఉమాతో మైత్రి కొనసాగించక తప్పదు. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, తిరువూరు నాయకులు స్వామిదాసు తదితరులు తమదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. విజయవాడ పార్లమెంటు అధ్యక్షుడు నెట్టెం రఘురాం మాత్రం కేశినేనితో సాన్నిహిత్యం కలిగి ఉన్నారని పారీ్టవర్గాలు అంటున్నాయి.

పలకరింపూ లేదాయె... 
తూర్పు నియోజకవర్గంతో పాటు నగరంలో ఏ ముఖ్య కార్యక్రమానికైనా, సంఘటన జరిగినా కేశినేని శ్వేత తప్పకుండా వెళ్లేవారు. తూర్పు పరిధిలో ఉన్న పట్టాభిపై దాడి జరిగినా ఎంపీ కేశినేని నాని, ఆయన కుమార్తె శ్వేత అటువైపు కన్నెత్తి చూడలేదు. పట్టాభితో సరిపడకపోయినా తాజా పరిణామాల నేపథ్యంలో బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా వర్గం తీరిగ్గా పరామర్శకు ఇంటికి వెళ్లడం పరిశీలనాంశం.

మూడు ముక్కలైన ‘టీం విజయవాడ’!  
విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని నాయకులతో  ‘టీం విజయవాడ’ పేరిట ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు నిన్న మొన్నటివరకు కేశినేని భవన్‌పై ఉండేవి. తాజాగా నగర పార్టీ  అధ్యక్షుడు బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా తదితరుల ఫొటోలు ఆ  టీంలో లేకపోవడం కొసమెరుపు.
(చదవండి: మరింత వేడెక్కిన రాష్ట్ర రాజకీయాలు..)
టీడీపీ కార్యకర్తల అరాచకం    

మరిన్ని వార్తలు