రోడ్డునపడ్డ బెజవాడ టీడీపీ నేతలు

6 Mar, 2021 12:40 IST|Sakshi

మాకు ఏ గొట్టం గాడు అధిష్టానం కాదు

కేశినేనిపై బోండా, బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా మండిపాటు

విజయవాడ టీడీపీలో కమ్మ, కాపు నేతల మధ్య ఆధిపత్యపోరు

సాక్షి, విజయవాడ: బెజవాడ టీడీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. విజయవాడ టీడీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. కమ్మ, కాపు నేతల మధ్య ఆధిపత్యపోరు తీవ్రస్థాయికి చేరింది. కేశినేని నానిపై బోండా ఉమా, బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు పర్యటన గురించి మాకు కనీసం సమాచారం ఇవ్వరా?. రూట్‌ మ్యాప్‌ మార్చడానికి కేశినేని ఎవరని వారు  ప్రశ్నించారు. ‘చంద్రబాబు రోడ్‌షోలో కేశినేని పాల్గొంటే.. మేం పాల్గొనం. మాకు ఏ గొట్టం గాడు అధిష్టానం కాదంటూ’ వారు నిప్పులు చెరిగారు. ‘‘టీడీపీని కుల సంఘంగా మార్చాలని కేశినేని అనుకుంటున్నారా?. దమ్ముంటే కేశినేని ఇండిపెండెంట్‌గా పోటీచేసి గెలవాలి. కేశినేని చెప్పుచేతల్లో బీసీలు బతకాలా?. కేశినేని నాని చేసేవన్నీ చీకటి రాజకీయాలు. రంగా హత్య కేసు నిందితులందరూ కేశినేని వెంటే ఉన్నారంటూ’’ బోండా ఉమ, బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా విమర్శలు గుప్పించారు.

కాగా, విజయవాడలోని ముఖ్య నాయకులు రెండు వర్గాలుగా వ్యవహరిస్తున్నారు. కేశినేని శ్రీనివాస్‌కు గద్దె రామ్మోహన్‌ వెంట ఉంటున్నారు. బొండా, బుద్దా, నాగుల్‌మీరా, పట్టాభి తదితరులు పూర్తిగా దూరమయ్యారు. బీసీ వర్గానికి చెందిన గుండారపు హరిబాబు కుమార్తె పూజితకు ఇచ్చిన టిక్కెట్‌ను కేశినేని నాని మార్చేశారు. ఈ విషయమై బుద్ధా, మీరాలు పట్టుపట్టినా ఎంపీ ససేమిరా అన్నారు. ఎస్సీ వర్గానికి చెందిన కొట్టేటి హనుమంతరావు భార్య టికెట్‌ విషయంలోనూ అదే జరిగింది. పేదసామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి టిక్కెట్‌ ఇప్పించుకోలేకపోయినట్లు పొలిట్‌ బ్యూరో సభ్యుడు, జాతీయ కార్యదర్శి కూడా అయిన వర్ల రామయ్య తన అనుచరవర్గం వద్ద అంతర్గత చర్చల్లో వాపోయినట్లు సీనియర్‌ నేతలు గుర్తు చేస్తున్నారు.


చదవండి:
ఔను.. మళ్లీ ‘వాళ్ల మాటే’ నెగ్గింది
తమ్ముడి గెలుపుపై జేసీ బెంగ..


 

మరిన్ని వార్తలు