చిన్నమ్మతో చిక్కులొస్తే ఎలా?

9 Jan, 2021 09:36 IST|Sakshi

ముఖ్యమంత్రి అభ్యర్థి వివాదంపై అమీతుమి

సాక్షి, చెన్నై : అసెంబ్లీ ఎన్నికలు ఒక వైపు, అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ విడుదల మరో వైపు సవాళ్లు విసురుతున్న వేళ సర్వసభ్య సమావేశంతో అన్నాడీఎంకే అగ్రజులంతా శనివారం ఒకే వేదికపై రానున్నారు. ఎన్నికల్లో తలపడనున్న కూటమి పార్టీల వైఖరిపై కసరత్తు చేయనున్నారు. అధికారపార్టీ హోదాలో ఈసారికి ఇదే తుది సమావేశం కావడం గమనార్హం. తమిళనాడులోని అన్ని రాజకీయపార్టీలు ఏడాదికి ఒకసారి సర్వసభ్య సమావేశం, రెండుసార్లు కార్యనిర్వాహకుల సమావేశాన్ని నిర్వహించాలి. ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను ఎన్నికల కమిషన్‌కు తెలియజేయాలి. ఈ ప్రకారం అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం గత ఏడాది డిసెంబర్‌లో జరగాల్సి ఉంది.

అయితే కరోనా కారణంగా చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యనిర్వాహక సమావేశాన్ని మాత్రమే నిర్వహించారు. ఈ సమయంలో 11 మంది సభ్యులతో మార్గదర్శకాల కమిటీని ఏర్పాటు చేసుకుని పార్టీ పరమైన నిర్ణయాలపై వారికి కొన్ని అధికారాలు ఇచ్చారు. అయితే ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సర్వసభ్యం ఆమోదించాల్సి ఉంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టి లాక్‌డౌన్‌లో అనేక సడలింపులు చోటుచేసుకోవడంతో సర్వసభ్య సమా  వేశానికి అన్నాడీఎంకే సిద్ధమైంది. చెన్నై శివారు వానగరం శ్రీనివాస కల్యాణమండపంలో శనివారం ఉదయం 8.30 గంటలకు ప్రారంభమయ్యే సమావేశానికి పార్టీ కన్వీనర్, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, కో–కన్వీనర్, ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, 302 మంది కార్యనిర్వాహకసభ్యులు సహా 3,500 మంది హాజరుకానున్నారు.
 
శశికళ వస్తే ఎలా? 
అన్నాడీఎంకే బహిష్కృతనేత దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చిలి శశికళ ఈనెల 27వ తేదీన జైలు నుంచి విడుదల కానున్నారు. అన్నాడీఎంకే శ్రేణులకు అసెంబ్లీ ఎన్నికలతోపాటు శశికళను ఎదుర్కోవడం కూడా సవాలుగా మారే పరిస్థితులున్నాయి. జయలలిత మరణం సమయంలో ముఖ్యమంత్రిగా ఉండిన పన్నీర్‌సెల్వం చేత శశికళ బలవంతంగా రాజీనామా చేయించారు. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికై గవర్నర్‌ ఆమోదానికి పంపిన దశలో ఆమె జైలుపాలయ్యారు. ముఖ్యమంత్రి అయ్యే అవకాశం శశికళకు తృటిలో తప్పిపోగా ప్రత్యామ్నాయంగా ఎడపాడిని ఆ కుర్చీలో కూర్చోబెట్టారు. అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో శశికళను ఎడపాడే స్వయంగా పార్టీ నుంచి బహిష్కరించాల్సి వచ్చింది. నాలుగేళ్ల జైలుశిక్ష ముగించుకుని ఈనెల 27న శశికళ జైలు నుంచి విడుదలవుతున్నారు.

జయ హయాంలోనే పార్టీలో చక్రం తిప్పిన శశికళకు పాద నమస్కారాలు చేసే స్థాయిలో అన్నాడీఎంకేలో అనుంగు శిష్యులున్నారు. రేపు జైలు నుంచి విడుదలైతే పార్టీలో ఎలాంటి ప్రకంపనలు ఎదురవుతాయోనని అగ్రనేతలు చెవులు కొరుక్కుంటున్నారు. శశికళ విడుదల, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న దశలో పార్టీ సర్వసభ్య సమావేశం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. అన్నాడీఎంకే కూటమిలోని మిత్రపక్షపార్టీల గురించి చర్చిస్తారని సమాచారం. ముఖ్యంగా కూటమి నుంచి ఎడపాడి పళనిస్వామి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై బీజేపీ అభ్యంతరం లేవనెత్తడం, 60 సీట్లకు పట్టుబడడంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఈనెల 27న శశికళ జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు మెండుగా ఉండడంతో పార్టీలో ఆ ప్రభావంపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు