చినబాబు మూడు ముక్కలాట.. ‘గో ఎహెడ్.. నీకే టిక్కెట్..’

9 Dec, 2022 20:24 IST|Sakshi

తెలుగు తమ్ముళ్లలో కంగారెందుకు?

ఏలూరు తెలుగుదేశం పార్టీలో మూడు ముక్కలాట మొదలైంది. గతం నుంచీ ఉన్న ఇన్‌చార్జ్‌ను కాదని మరో ఇద్దరు టిక్కెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. చినబాబు అడిగినవారందరికీ సీటు గ్యారెంటీ హామీ ఇస్తున్నారట. అసలే ప్రజల్లోకి వెళ్ళడానికి ధైర్యం లేక పసుపు కేడర్ బిక్కచచ్చిపోయింది. మరోవైపు నేనే అభ్యర్థినంటూ ముగ్గురు రంగంలోకి రావడంతో కేడర్‌ అయోమయానికి గురవుతోందట. నూజివీడు మూడు ముక్కలాట మీరూ చదవండి.

ముద్దరబోయిన వర్సెస్ కమ్మ
ఏలూరు జిల్లా పరిధిలోకి వచ్చిన నూజివీడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పెద్ద కష్టమే వచ్చిందట. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే తెలుగు తమ్ముళ్లలో కన్ఫ్యూజన్ మొదలైందని టాక్ నడుస్తోంది. అందుకు కారణం నియోజకవర్గంలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలే అంటున్నారు. గట్టి పట్టున్న స్థానిక నేతలు లేకపోవడంతో.. గన్నవరం నుంచి వలస వచ్చిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు గత రెండు ఎన్నికల్లోనూ నూజివీడు నుంచి పోటీ చేశారు.

ఓడిపోయినప్పటికీ ప్రస్తుతం నూజివీడు టీడీపీకి  ఆయనే ఇంఛార్జిగా కొనసాగుతున్నారు. ఇంత వరకూ బాగానే ఉంది కానీ ఇప్పుడు ముద్దరబోయిన వర్సెస్ కమ్మ సామాజిక వర్గ టీడీపీ నేతలు అనేలా ఇక్కడ ఇంటర్నల్ పాలిటిక్స్ నడుస్తున్నాయట. కొంతకాలంగా ముద్దరబోయిన వర్సెస్ మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కాపా శ్రీనివాసరావు అనేలా ఇక్కడి స్థానిక రాజకీయాలు సాగాయంటున్నారు. ఫలితంగా నూజివీడులో ముద్దరబోయిన వర్గం ఒకవైపు కమ్మసామాజిక వర్గం మరో వైపు అనేలా పరిస్థితులు మారిపోయాయని టీడీపీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

వ్యాపారం నుంచి రాజకీయం
ఇదిలా ఉంటే.. ముద్దరబోయిన వర్సెస్ కాపా శ్రీనిసవారావు వర్గాలతోనే కేడర్‌ అయోమయంలో పడితే..తాజాగా మరో నేత ఎంట్రీ ఇచ్చారు. కమ్మ సామాజిక వర్గానికి  చెందిన బిజినెస్ మ్యాన్ నూజివీడు టీడీపీ పాలిటిక్స్ లోకి ఎంటరయ్యాడట. నియోజకవర్గానికే చెందిన పర్వతనేని గంగాధరరావు హైదరాబాద్ లో వ్యాపారాలు చేసుకుంటూ స్థిరపడ్డారు.

వచ్చే ఎన్నికల్లో నూజివీడు నుంచి పోటీ చేయాలనే లక్ష్యంతో గంగాధరరావు చినబాబుతో టచ్ లోకి వెళ్లాడట. నేనూ లోకలే..నాకూ టిక్కెట్ కావాలంటూ నూజివీడులో పర్యటిస్తున్నారట. ఫంక్షన్లు, ప్రారంభోత్సవాలు అంటూ గ్రామాల్లో తిరుగుతూ..తెలిసినవారికి, కావాల్సినవారికి ఆర్ధిక సహాయం అందిస్తూ ముద్దరబోయినను వ్యతిరేకించిన వారితో పాటు కమ్మ సామాజిక వర్గాన్ని కూడా తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడట.

చినబాబు టికెట్ల హామీలు
నూజివీడులోని ఈ ముగ్గురి పంచాయతీ ఇటీవల పార్టీ యజమానులు చంద్రబాబు, చినబాబు వద్దకు చేరిందట. ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోవడతో అటు చంద్రబాబు, ఇటు చినబాబు తమ వద్దకు వచ్చిన వారికి గో ఎహెడ్.. నీకే టిక్కెట్ అంటూ హామీ ఇచ్చి పంపించేశారట.

దీంతో ఈ ముగ్గురూ ఈసారి నేనే క్యాండెట్.. నాకే సీటు అంటూ కేడర్‌ దగ్గర ప్రచారం చేసుకుంటున్నారట. పరిణామాలన్నీ గమనిస్తున్న క్యాడర్ కు ఈ ముగ్గురిలో ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియడం లేదని టాక్. బీసీ సామాజికవర్గానికి చెందిన ముద్దరబోయినకు మద్దతివ్వాలా.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన కాపా శ్రీనివాసరావు లేదా..బిజినెస్ మ్యాన్ పర్వతనేని గంగాధరరావు పంచన చేరాలో తేల్చుకోలేకపోతున్నారట.
చదవండి: గన్నవరం టీడీపీ అభ్యర్థి ఎవరు?.. అసలు అక్కడ ఏం జరుగుతోంది?

ముగ్గురు టిక్కెట్ అడుగుతున్నపుడు పార్టీ నేతలు కూడా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. గన్నవరం నుంచి వలస వచ్చినా గతం నుంచి పార్టీని నమ్ముకుని ప్రస్తుతం ఇంచార్జ్‌గా ఉన్న.. బీసీ వర్గం నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావును పక్కన పెట్టేందుకు... కమ్మ వర్గం నేతలను ప్రోత్సహిస్తున్నారని చర్చ నూజివీడులో జరుగుతోంది.
పొలిటికల్‌ ఎడిటర్, సాక్షి డిజిటల్‌
feedback@sakshi.com

మరిన్ని వార్తలు