టీడీపీలో ‘కరివేపాకులు’.. నమ్ముకున్నోళ్లనే ముంచేస్తున్నాడు మావా..

4 Jan, 2023 16:12 IST|Sakshi

వేరే పార్టీల నేతలకు అధినేత ఆహ్వానం    

 నగర ఇన్‌చార్జి పరామర్శకు రాని చంద్రబాబు 

పార్టీలో సమర్థులు లేరా?..

స్వపక్షం రుసరుసలు  

ఏ నియోజకవర్గం నుంచి ఎవరిని పోటీలో పెడతారో తెలియని అయోమయం  

చంద్రబాబు పర్యటనలో కోవూరులో భగ్గుమన్న వర్గ విభేదాలు 

రూట్‌మ్యాప్‌లో ఉదయగిరిని తప్పించిన వైనం

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో చంద్రబాబు పర్యటన తర్వాత మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు భవిష్యత్‌పై అయోమయంలో పడ్డారు. తొలుత కందుకూరు, కావలి, ఉదయగిరి, కోవూరు నియోజకవర్గాల్లో పర్యటన ఉంటుందని ప్రకటించినా.. ఆఖరి క్షణంలో ఉదయగిరి పర్యటన వాయిదా వేసుకున్నారు. చివరాఖరుకు మూడు నియోజకవర్గాల్లో తిరిగినా.. వాటిల్లో  ఫలానా అభ్యర్థి ఉంటారని మాత్రం ఎక్కడా చెప్పలేదు.

ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడం, సీఎంను దూషించడం.. ఈ రెండింటి మీదే పర్యటన  సాగింది. కోవూరు వరకు వచ్చిన చంద్రబాబు కూతవేటు దూరంలోని నెల్లూరులో ఉంటున్న నగర ఇన్‌చార్జిని కూడా పరామర్శించడానికి వెళ్లలేదు. టీడీపీలోకి పక్క పార్టీల్లోని సమర్థులైన నాయకులు రావాలని పిలుపునివ్వడం చూస్తే రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఆ పార్టీలో  కింగ్‌లనుకునే అందరూ కరివేపాకులే అని సంకేతాలు ఇచ్చినట్లు అర్థమవుతోంది.  

టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లా పర్యటన తర్వాత ఆ పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం ఆవరించింది. కందుకూరు సభలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కావలి, కోవూరు నియోజకవర్గాల్లో పర్యటించినా పార్టీ నేతల్లో జోష్‌ నింపలేకపోయారు. అధినేత పర్యటనకు ఆయా నియోజకవర్గాల్లోని మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, ఆశావహులు రూ.లక్షలు కుమ్మరించి భారీ ఫ్లెక్సీలతో హడావుడి చేశారు.

అయితే అధినేత మాత్రం ఏ నియోజకవర్గంలో తన పార్టీ తరఫున ఫలానా నాయకుడు మీకు అండగా ఉంటారని, పోటీలో ఉండబోతారని ఎక్కడా చెప్పలేదు. కాగా పక్క పార్టీల్లో బలమైన, సమర్థులైన నేతలు టీడీపీలోకి రావాల్సిన అవసరం ఉందంటూ పిలుపునివడంతో ఇన్నాళ్లు పార్టీ కోసం పాకులాడుతున్న సీనియర్లు కంగుతినాల్సిన పరిస్థితి వచ్చింది. రేపటి ఎన్నికల్లో తమకు టికెట్‌ వస్తుందా? రాదా? అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు.

అసంతృప్తి జ్వాలలు.. వర్గ విభేదాలు 
చంద్రబాబు జిల్లా పర్యటన తర్వాత అడుగడుగునా ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి జ్వాలలు, వర్గ విభేదాలు రగిలాయి. కావలి నియోజకవర్గ ఇన్‌చార్జి కరివేపాకేనని స్పష్టమైంది. కావలిలో బీద రవిచంద్ర కనుసన్నల్లోనే పార్టీ వ్యవహారాలు నడుస్తున్నాయి. పైకి మాత్రం కావలి తనకు వద్దంటూనే బీద గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డిని కాదని తన అనుచరుడిగా ఉన్న ఓ మండల స్థాయి లీడర్‌ సుబ్బానాయుడుకి ఏకంగా నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించేలా చేశాడు. టీడీపీ హయాంలో సహజవనరులు దోచుకుని రూ.కోట్లు సంపాదించిన ఈ చోటా నేతతో చంద్రబాబు పర్యటనకు భారీగా ఖర్చు పెట్టించాడు. అయితే చంద్రబాబు సభలో కావలి అభ్యర్థి ఫలానా అని చెప్పకపోవడంతో సుబ్బానాయుడు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నాడు.

కోవూరులో పరిస్థితిలో మరోలా ఉంది. మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి వర్గాల మధ్య అంతర్గతంగా విభేదాలు కొనసాగుతున్నాయి. మొన్న జరిగిన చంద్రబాబు పర్యటనలో కూడా ఇరువురూ కలిసి పనిచేయలేదు. వేర్వేరుగా స్వాగతం పలికారు. కోవూరు సభలో మాత్రం పోలంరెడ్డి తనయుడు దినేష్‌రెడ్డి ప్రచార వాహనంలో ఉన్నాడు.

కోవూరు టికెట్‌ తన కొడుక్కే దక్కుతుందని  శ్రీనివాసులురెడ్డి ఇది వరకే కార్యకర్తలకు పరిచయం చేయడం, ఇంకా ప్రచార వాహనంలో బాబు పక్కనే ఉండేలా చేయడంలో సక్సెస్‌ అయ్యారు.  ఇక్కడ చేజర్ల కరివేపాకులా మారాడు. పార్టీకి వీరవిధేయుడిగా ఉన్న ఆయనకు కనీసం ప్రచార వాహనంలో కూడా స్థానం ఇవ్వలేదు. కానీ చంద్రబాబు తమ అభ్యర్థిగా దినేష్‌ను పరిచయం కూడా చేయకపోవడం ఇరువర్గాల్లో అసంతృప్తి నెలకొంది.

ఇకపోతే పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి ప్రతి ఎన్నికల్లోనూ కరివేపాకులా మారారనే చెప్పాలి. కోవూరు టికెట్‌ సాధించేందుకు రెండు దశాబ్దాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్నాడు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ముద్ర వేసుకుని పార్టీ కోసం కష్టపడుతున్న నాయకుడు. ప్రతి ఎన్నికల సమయంలో పెళ్లకూరుకు టికెట్‌ అంటూ ప్రచారం మాత్రం జోరుగా ఉంటుంది. చివరాఖరుకు ఇంకొకరు పోటీలో నిలబడతారు. ఒకానొక దశలో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పేరు ఖరారు చేసి చివరి క్షణంలో ఆయన్ను తప్పించి వలస నేత అబ్దుల్‌ అజీజ్‌కు ఇచ్చారు. ఇలా ఎన్నోసార్లు పెళ్లకూరు మరో కరివేపాకు అయ్యాడు.
చదవండి: నాడు కక్కుర్తి.. నేడు హైడ్రామా.. మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌ పాలి‘ట్రిక్స్‌’

బలంగా వైఎస్సార్‌సీపీ
వైఎస్సార్‌సీపీకి బలమైన పట్టు ఉన్న జిల్లాలో టీడీపీ ప్రస్తుతం ఉనికి కోసం పాకులాడే పరిస్థితి నెలకొంది. గత సార్వత్రిక ఎన్నికల నుంచి స్థానిక సంస్థలు, తిరుపతి పార్లమెంట్, ఆత్మకూరు ఉప ఎన్నికల వరకు వైఎస్సార్‌సీపీ ప్రభంజనం ముందు సైకిల్‌ పంక్చరైంది. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పార్టీ పోటీ చేయక పోయినా బీజేపీకి లోపాయికారీ మద్దతు ఇచ్చినా వృథా అయింది. ఈ క్రమంలో జిల్లా పార్టీని బలోపేతం చేసేందుకు టీడీపీ అధినేత ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమం ద్వారా జిల్లాలో మూడు రో జుల పాటు పర్యటన చేసినా పార్టీలో జోష్‌ రాలేదు.. నేతల్లో అసంతృప్తి జ్వాలలను రగిల్చి వెళ్లాడు.

ముఖం చాటేశారు
పార్టీ కోసం చొక్కాలు చించుకుని పనిచేసిన టీడీపీ ముఖ్య నేతలకు సైతం  చంద్రబాబు ముఖం చాటేశారు. టీడీపీ ముఖ్య నాయకుల్లో నెల్లూరు నగర నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఒకరు. ఇటీవల ఆయన ప్రమాదంలో గాయపడి మంచానికే పరిమితమయ్యారు. మూడురోజులు జిల్లాలో ఉండీ.. నెల్లూరుకు కూతవేటు దూరంలోని కోవూరు వరకు వచ్చిన చంద్రబాబు కనీసం పరామర్శకు కూడా రాలేదు.

బాబు పర్యటన షెడ్యూల్‌లో కోటంరెడ్డికి పరామర్శ కార్యక్రమం ఉన్నట్లు చూపించారు. అయితే రాకుండానే వెళ్లిపోయారంటే ముఖ్య నేతలకు చంద్రబాబు దగ్గర ఉన్న విలువెంతో అర్థమవుతోంది. జిల్లా పార్టీ నేతల ద్వారా కోటంరెడ్డి చంద్రబాబును తన ఇంటికి తీసుకురమ్మని శతవిధాలా ప్రయత్నాలు చేయించినా సక్సెస్‌ కాలేదు. ఆయన్ను బాబు కరివేపాకులా తీసేశాడని తెలుగు తమ్ముళ్లే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. గత ఎన్నికల్లో మాజీ మంత్రి నారాయణకు సహకరించలేదనే లెక్కలు ఉండడంతో చంద్రబాబు ఆయన్ను పట్టించుకోలేదనే ప్రచారం జోరుగా జరుగుతోంది. 

మరిన్ని వార్తలు