అయోధ్యలో ‘భూ’కంపం

15 Jun, 2021 05:00 IST|Sakshi
లక్నోలో మహిళా కాంగ్రెస్‌ సభ్యుల ఆందోళన

రామాలయ భూమి కొనుగోలులో స్కామ్‌ !

రూ.2 కోట్లకు భూమి కొని నిమిషాల్లో ఆలయ ట్రస్టుకు రూ.18.5 కోట్లకు అమ్మారని ఆరోపణలు

సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని కాంగ్రెస్‌ డిమాండ్‌

న్యూఢిల్లీ: అయోధ్యలో రామాలయం కోసం జరిగిన ఒక భూమి కొనుగోలు వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. 12వేల చదరపు మీటర్ల భూమి కొనుగోలులో భారీ అవినీతి దాగి ఉందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. ఆ భూమిని కేవలం రూ.2కోట్లకు కొన్న వ్యక్తి నుంచి శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు అదేరోజున కొద్ది నిమిషాల తేడాతో ఏకంగా రూ.18.5 కోట్లకు కొనుగోలు చేసిందని, అయోధ్య రామాలయ ట్రస్ట్‌ స్కామ్‌కు పాల్పడిందని కాంగ్రెస్‌ తీవ్ర ఆరోపణలు చేసింది.

ఈ అవినీతి లావాదేవీపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు కొనసాగాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. ‘శ్రమజీవుల విరాళాల సొమ్మును ఇలా దుర్వినియోగం చేయడం వారి నమ్మకాన్ని అవమానించడమే’ అని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ విమర్శించారు. అక్రమ నగదు బదిలీ వ్యవహారమని, సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌లతో దర్యాప్తు జరిపించాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత  మనీశ్‌ సిసోడియా∙డిమాండ్‌ చేశారు.  రామాలయం నిర్మాణాన్ని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు వ్యాపారంగా మలచుకున్నాయని ఒకప్పటి బీజేపీ భాగస్వామి అయిన సుహెల్దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ అధ్యక్షుడు ఓ ప్రకాశ్‌ రాజ్‌భర్‌ ఆరోపించారు.

అసలు వివాదం ఏంటి?
వివాదానికి కేంద్రబిందువైన ఆ భూమి కొనుగోలు పత్రాల ప్రకారం.. మార్చి 18న బాగ్‌ జైసీ గ్రామంలో కుసుమ్‌ ఫాటక్‌ అనే వ్యక్తి తన 12,080 చదరపు మీటర్ల విస్తీర్ణమున్న భూమిని రవి తివారీ, సుల్తాన్‌ అన్సారీ అనే ఇద్దరు వ్యక్తులను రూ.2 కోట్ల మొత్తానికి విక్రయించాడు. రవి, అన్సారీలు కొన్న అదే 18 వ తేదీన కేవలం కొద్ది నిమిషాల తర్వాత వీరిద్దరి నుంచి శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఏకంగా రూ.18.5 కోట్లు చెల్లించి ఆ భూమిని కొనుగోలు చేసింది. ట్రస్టు సభ్యులైన బీజేపీ నేత అనిల్‌ మిశ్రా, అయోధ్య మాజీ మేయర్‌ హ్రిషీకేశ్‌ ఉపాధ్యాయ్‌లు ట్రస్టు తరఫున సంతకాలు చేసి ఈ భూమిని కొన్నారు. ఈ వ్యవహారంలో ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ ముఖ్యపాత్ర పోషించారని ఆరోపణలున్నాయి. వేరొకరి నుంచి రూ.2 కోట్లకు కొన్న భూమిని అదే రోజున కొద్ది నిమిషాల్లో రూ.16.5 కోట్లు ఎక్కువ చెల్లించి కొనాల్సిన అవసరమేముందని, ట్రస్టు సొమ్మును దారి మళ్లిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు