రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తాం

29 Jan, 2021 04:15 IST|Sakshi

కాంగ్రెస్‌ సహా 18 ప్రతిపక్ష పార్టీల ప్రకటన

సాక్షి, న్యూఢిల్లీ: రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌ను పునరుద్ఘాటిస్తూ దేశ రైతులకు సంఘీభావం తెలియజేసేందుకు కాంగ్రెస్‌ సహా 18 ప్రతిపక్షాలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని నిర్ణయించాయి. ఈ మేరకు గురువారం కాంగ్రెస్, ఎన్సీపీ, జేకేఎన్‌సీ, డీఎంకే, తృణమూల్‌ కాంగ్రెస్, శివసేన, ఎస్పీ, ఆర్జేడీ, సీపీఎం, సీపీఐ, ఐయూఎంఎల్, ఆర్‌ఎస్‌పీ, పీడీపీ, ఎండీఎంకే, కేరళ కాంగ్రెస్‌(ఎం), ఏఐయూడీఎఫ్‌ ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.

‘దేశ జనాభాలో 60 శాతం ప్రజలు, కోట్లాది మంది రైతులు, వ్యవసాయ కూలీలు ఆధారపడిన వ్యవసాయ రంగం భవిష్యత్తుకు ప్రమాదకరంగా బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా రుద్దుతున్న వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ సంఘటితంగా రైతులు పోరాడుతున్నారు. గడిచిన 64 రోజులుగా తీవ్రమైన చలిని, భారీ వర్షాలను లెక్కచేయకుండా దేశ రాజధానిలో రైతులు తమ హక్కులు, న్యాయం కోసం పోరాడుతున్నారు. సుమారుగా 155 మంది రైతులు తమ ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వంలో కదలిక లేకపోగా.. వాటర్‌ కెనాన్లతో, టియర్‌ గ్యాస్‌తో, లాఠీఛార్జీలతో జవాబు ఇచ్చింది. రైతుల న్యాయమైన ఉద్యమాన్ని ప్రభుత్వ ప్రాయోజిత తప్పుడు సమాచారంతో ఉద్యమాన్ని తక్కువ చేసి చూపేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది.

దేశ ఆహార భద్రత స్వరూపం ముక్కలవుతుంది..
‘మూడు సాగు చట్టాలు రాష్ట్రాల హక్కులపై, రాజ్యాంగం ప్రసాదించిన సమాఖ్య స్ఫూర్తిపై దాడి. ఈ చట్టాలను వెనక్కి తీసుకోనిపక్షంలో అవి దేశ ఆహార భద్రత స్వరూపాన్ని ముక్కలు చేస్తాయి. అంతేకాకుండా కనీస మద్దతు ధర, ప్రభుత్వ ధాన్య సేకరణ వ్యవస్థలను ధ్వంసం చేస్తాయి’ అని పేర్కొన్నాయి.

నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు..
‘ప్రధాని, బీజేపీ ప్రభుత్వం  అప్రజాస్వామికంగా స్పందిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి మాకు దిగ్భ్రాంతి కలిగించింది. అందువల్ల మేం సంఘటితంగా రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌ను పునరుద్ఘాటిస్తున్నాం. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగాన్ని బహిష్కరించాలని నిర్ణయించాం’ అని కాంగ్రెస్‌సహా ప్రతిపక్షాలు పేర్కొన్నాయి.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు