Toolkit రగడ: దుమ్మెత్తి పోసుకుంటున్న కాంగ్రెస్‌, బీజేపీ

22 May, 2021 14:00 IST|Sakshi

కరోనా స్ట్రెయిన్‌ మీదకు మళ్లిన టూల్‌కిట్‌ వివాదం

న్యూఢిల్లీ: కోవిడ్‌పై రాజకీయ వివాదానికి తెరలేపిన 'కాంగ్రెస్‌ టూల్‌కిట్‌' వ్యవహారంపై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య చెలరేగిన మాటల యుద్ధం చల్లారడం లేదు. నిన్నటి వరకు ట్విట్టర్ వేదికగా టూల్‌కిట్‌ విషయంలో పరస్పరం ఆరోపణలు చేసుకున్న పార్టీలు ఇప్పుడు  కరోనా మ్యూటెంట్‌ పేరిట దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ట్విట్టర్‌ లేబుల్‌తో ఈ గొడవ సమసిపోతుంది అనుకుంటున్న సమయంలో టూల్‌కిట్‌ వివాదాన్ని తిరగదోడారు మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా. ఈరోజు ఆయన భోపాల్‌లో మాట్లాడుతూ ‘‘ఇండియన్‌ వేరియంట్‌ అనే వైరస్‌ లేకున్నా.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌... ఇండియన్‌ వేరియంట్‌, సింగపూర్‌ వేరియంట్‌ అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ నేత కమల్‌ నాథ్‌ కూడా ఇలాగే చెప్పారు. టూల్‌కిట్‌తో కమల్‌నాథ్‌కి సంబంధం ఉందని చెప్పడానికి ఇంతకంటే వేరే ఆధారం లేదు’’ అంటూ విమర్శించారు.

కమల్‌ నాథ్‌ కౌంటర్‌..
నరోత్తం మిశ్రా ప్రకటనపై ఘాటుగా స్పందించారు మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం, కాంగ్రెస్‌ నేత కమల్‌ నాథ్‌. ఈ వైరస్‌ని మొదట చైనా వైరస్‌ అన్నారు. ఇప్పుడు ఇండియన్‌ వేరియంట్‌ వంతు వచ్చింది. మన శాస్త్రవేత్తలు, డాక్టర్లు కూడా న్యూ స్ట్రెయిన్‌ని ఇండియన్‌ వేరియంట్‌ అనే పిలుస్తున్నారు. కేవలం బీజేపీనే దీన్ని అంగీకరించడం లేదు. మన ప్రధానికయితే ఇండియన్‌ వేరియంట్‌ అంటేనే భయం పట్టుకుంది. అందుకే టూల్‌కిట్‌ అంటూ అర్థం లేని విమర్శలు చేస్తున్నారంటూ’’ బీజేపీకి కౌంటర్‌ ఇచ్చారు కమల్‌నాథ్‌. 

ఏమిటీ వేరియంట్‌..
వైరస్‌లు సర్వసాధారణంగా వెనువెంటనే వాటి రూపాన్ని మార్చుకుంటాయి. వాటినే స్ట్రెయిన్‌, మ్యూటెంట్‌గా పిలుస్తారు. ఇండియాలో వచ్చిన కరోనా మ్యూటెంట్‌కి సాంకేతికంగా బీ.1.167 గా గుర్తించారు. అయితే మీడియాతో పాటు సోషల్‌ మీడియాలో దీన్ని ఇండియన్‌ వేరియంట్‌గానే పేర్కొంటున్నాయి. ఇండియన్‌ వేరియంట్‌ అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించనప్పుడు ... ఆ పేరు ఎందుకు ఉపయోగిస్తున్నారని కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సోషల్‌ మీడియాలో ఎక్కడైనా ఇండియన్‌ వేరియంట్‌ అనే పదం కనిపిస్తే తొలగించాలని లేదంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌ని హెచ్చరించింది కేంద్రం. 

చదవండి: ట్విట్టర్‌.. నీకిది సరికాదు: కేంద్రం

మరిన్ని వార్తలు