మంథని పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత

26 Jul, 2020 12:31 IST|Sakshi

సాక్షి, పెద్దపల్లి: జిల్లాలోని మంథని పోలీసుస్టేషన్‌ వద్ద ఘర్షణ వాతావరణంతో కూడిన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య ఆదివారం తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈనెల 6న మల్హర్‌రావు మండలం మల్లారంలో దళితుడు రేవెల్లి రాజబాబు దంపతుల మధ్య వివాదం ఉండగా అదే గ్రామానికి చెందిన వార్డు సభ్యులు టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాసరావు జోక్యం చేసుకున్నారు. రాజబాబు, శ్రీనివాసరావు మద్య ఘర్షణ జరగడంతో శ్రీనివాసరావు బావమర్దులు శేఖర్, సంపత్ అక్కడికి చేరుకొని రాజబాబుపై దాడి చేశారు. దీంతో రాజబాబు ప్రాణాలు కోల్పోయారు. అయితే టీఆర్ఎస్ నాయకులు దళితులపై దాడి చేసి కొట్టి చంపారని ఆరోపిస్తు నిజనిర్ధారణకు చలో మల్లారంకు పిలుపునిచ్చారు. దానికి ప్రతికారంగా టీఆర్ఎస్ ఎస్సీ సెల్ సైతం రాజబాబు మృతికి టీఆర్ఎస్‌కు సంబంధం లేదని తేల్చిచెప్పేందుకు ‘చలో మల్లారం’కు పిలుపునిచ్చారు.

పోటాపోటిగా ‘చలో మల్లారం’కు పిలుపునివ్వడంతో పోలీసులు మల్లారంతోపాటు నియోజకవర్గ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేసి భారీగా మోహరించారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మంథని నుంచి కాన్వాయ్‌తో బయలుదేరగా పోలీసులు అడ్డుకుని మంథని స్టేషన్‌కు తరలించారు. అదే సమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు ‘చలో మల్లారం’కు బయలుదేరగా వారిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని మంథని పోలీసు స్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌లో టీఆర్ఎస్ కార్యకర్తలు శ్రీధర్‌బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలోని కాంగ్రెస్ కార్యకర్తలు, జడ్పీ చైర్మన్‌ పుట్టమధు నేతృత్వంలోని టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్రమైన ఘర్షణ జరిగింది.


‘చలో మల్లారం’ కార్యక్రమానికి వెళ్లకుండా హన్మకొండలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్కని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళితులపై నిరంతరం దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఈ దాడులపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం బాధాకరమన్నారు. 

మరిన్ని వార్తలు