రాజస్థాన్‌ ముసలం: కాంగ్రెస్‌ హైకమాండ్‌ కీలక ప్రకటన

30 May, 2023 07:31 IST|Sakshi

ఢిల్లీ: రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, మాజీ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ మధ్య సయోధ్య కుదర్చడంలో కాంగ్రెస్‌ అధిష్టానం సక్సెస్‌ అయినట్లు కనిపిస్తోంది. ఈ మేరకు సోమవారం సాయంత్రం జరిగిన నాలుగు గంటల సమావేశం తర్వాత కీలక ప్రకటన చేసింది. ‘‘ఇక మీద నుంచి ఇద్దరూ కలిసికట్టుగా పని చేస్తార’’ని పార్టీ సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌ మీడియా ముందు ప్రకటించారు. 

‘‘ఇద్దరు నేతలూ ఏకగ్రీవంగా పని చేసేందుకు అంగీకరించారు. అలాగే కీలక నిర్ణయాన్ని హైకమాండ్‌కు వదిలేశారు’’ అని ప్రకటించారు కేసీ వేణుగోపాల్‌. అయితే.. జరిగిన చర్చల పూర్తి సారాంశం ఏమిటి? ఇద్దరి మధ్య కుదిరిన సయోధ్య ఒప్పందం.. లేదంటే బాధ్యతల అప్పగింత ఏంటన్నదాని గురించి మాత్రం ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు. 

అశోక్‌ గెహ్లాట్‌-సచిన్‌ పైలట్‌ల నడుమ వైరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో.. తాజాగా సొంత ప్రభుత్వంపైనే పైలట్‌ నిరసనలు కొనసాగిస్తున్నారు.  ఈ ఏడాదిలోనే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.  అదే సమయంలో ఈ ఇద్దరి మధ్య ‘డెడ్‌లైన్‌’ల శపథాలతో మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. పరిస్థితి చేజారకూడదనే ఉద్దేశంతో.. ఇద్దరినీ హస్తినకు పిలిపించుకున్న అధిష్టానం సోమవారంనాడు సమాలోచనలు జరిపింది.

ఈ సందర్భంగా.. కర్ణాటక రిఫరెన్స్‌ ప్రస్తావన తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. కలిసి కట్టుగా పోరాడితేనే ఫలితం దక్కుతుందనే విషయాన్ని ప్రధానంగా హైలెట్‌ చేసినట్లు సమాచారం. సమావేశంలో ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్‌ గాంధీ సైతం పాల్గొన్నారు.

ఇదీ చదవండి: కేంద్రం విషయంలో.. ఆప్‌కు షాక్‌ ఇవ్వనున్న కాంగ్రెస్‌

మరిన్ని వార్తలు