Munugode By Poll:మునుగోడు ఉప ఎన్నిక.. వ్యూహం మార్చిన కాంగ్రెస్‌

17 Sep, 2022 20:13 IST|Sakshi

సాక్షి, నల్లగొండ: మునుగోడులో కాంగ్రెస్‌ పార్టీ తన వ్యూహాన్ని మార్చుకుంది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ప్రకటించిన తరువాత పార్టీ శ్రేణులు రంగంలోకి దిగాయి. రాష్ట్ర స్థాయి నాయకులు, ముఖ్య నేతలంతా మండలాల్లో పర్యటిస్తుండడంతో కాంగ్రెస్‌ క్యాడర్‌లో కదలిక  మొదలైంది. ఈ దూకుడును పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ వ్యూహరచన, ప్రచార కమిటీ కన్వీనర్‌గా టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డిని నియమించింది. ఆ బాధ్యతల నుంచి మాజీ ఎంపీ మధుయాస్కీగౌడ్‌ను తప్పించింది.

అన్నింటికంటే ముందుగానే..
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వెంటనే అన్ని పార్టీల కంటే ముందే చండూరులో కాంగ్రెస్‌ పార్టీ బహిరంగ సభ నిర్వహించింది. అందులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ముఖ్య నాయకులంతా పాల్గొన్నారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. తరువాత కొద్దిరోజులకు గడపగడపకు కాంగ్రెస్‌ కార్యక్రమం చేపట్టినా తరువాత మిన్నకుండిపోయింది. టికెట్‌ విషయంలో ఆశావహుల నుంచి పోటీ పెరగడంతో వారితో చర్చించింది. ఎవరికి టికెట్‌ ఇచ్చినా అంతా కలిసి పని చేసేలా,  అభ్యర్థి గెలుపునకు కృషి చేసేలా ఒప్పించింది. మాజీ మంత్రి పాల్వాయి గోవర్దన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి పేరును ఖరారు చేసింది.

ఆ తరువాతే పార్టీ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అన్ని మండలాలకు రాష్ట్ర స్థాయి నాయకులను ఇన్‌ఛార్జీలుగా నియమించింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇప్పటికే రెండుసార్లు నియోజకవర్గంలో పర్యటించారు. ఆయన నారాయణపూర్‌ మండలం ఇన్‌ఛార్జిగా ఉండగా, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క, శ్రీధర్‌బాబు వంటి నేతలు మండలాల ఇన్‌చార్జీలుగానే కాకుండా, ఇతర మండలాల్లోనూ పర్యటిస్తున్నారు. ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఎత్తుగడలను ముఖ నేతలకు చెబుతూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో కేడర్‌లో కదలిక వచ్చింది.
చదవండి: గిరిజన రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన

పూర్తి స్థాయిలో ఉండేందుకే దామోదర్‌రెడ్డికి బాధ్యతలు
నవంబరు లేదా డిసెంబరులో ఉప ఎన్నికలు ఉండనున్న నేపథ్యంలో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ వ్యూహరచన, ప్రచార కమిటీ కన్వీనర్‌ను అధిష్టానం మార్చింది. ఈ మార్పును రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ ప్రకటించారు. ఇప్పటివరకు కమిటీకి కన్వీనర్‌గా ఉన్న మధుయాస్కీ గౌడ్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించి టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డిని నియమించింది.

దీంతో ఆయన స్థానికంగా ఉండి పూర్తి స్థాయిలో దృష్టి సారించి పని చేసేలా ఈ మార్పు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నారు. మరోవైపు రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర అక్టోబరు 24వ తేదీన రాష్ట్రంలో ప్రారంభం కానుంది. అప్పటికి మునుగోడులో ఎన్నికల జోరు పెరగనుంది. ఆ సమయంలో మధుయాస్కీగౌడ్‌ రాహుల్‌ యాత్రకు సంబంధించిన వ్యవహారాల్లో ఉంటే మునుగోడులో కార్యక్రమాలకు ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉండటంతో ఆయన్ని తప్పించినట్లు తెలిసింది.  

మరిన్ని వార్తలు