బీజేపీకి లాభం కలిగేలా బీఆర్‌ఎస్‌ వైఖరి

3 Mar, 2023 02:31 IST|Sakshi

కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే 

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: కేంద్రంలోని అధికార బీజేపీకి లాభం కలిగేలా బీఆర్‌ఎస్‌ వ్యవహరిస్తోందని ఏఐసీసీ ప్రధానకార్యదర్శి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌ రావ్‌ ఠాక్రే అన్నారు. టీఆర్‌ఎస్‌ పేరు బీఆర్‌ఎస్‌గా మారిందే తప్ప, ఆ పార్టీ నేతల్లో మార్పులేదని ఎద్దేవా చేశారు. ఇటీవల టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సభపై దాడి ఘటనలో గాయపడిన కాంగ్రెస్‌ నేత తోట పవన్‌కుమార్‌ను ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌహాన్‌తో కలిసి ఠాక్రే గురువారం అడ్వకేట్స్‌ కాలనీలో పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ నేతలు దాడులను నమ్ముకున్నారని, కాంగ్రెస్‌కు లభిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక ఈ దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే హనుమకొండలో పవన్‌ను చంపాలని చూశారని, ఆ దాడిలో ఆయన చనిపోయాడని అనుకొని వెళ్లిపోయారని మాణిక్‌రావ్‌ పేర్కొన్నారు. ఈ ఘటనలో దోషులెవరో తెలిసినా పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.

ప్రభుత్వం చేస్తున్న తప్పులను, అక్రమాలను ప్రశ్నించొద్దనే బీఆర్‌ఎస్‌ దాడులకు పాల్పడుతోందని, కాంగ్రెస్‌ పార్టీ ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. పేదలకు న్యాయం అందాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందని, కానీ, ఇప్పుడు ఇంతటి దుర్మార్గ పాలన నడుస్తుందని అనుకోలేదని అన్నారు.  

వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. తెలంగాణలో అన్యాయాలు, అత్యాచారాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, నేతలు  కూచన రవళిరెడ్డి, హర్కర వేణుగోపాల్, పోరిక బలరాంనాయక్, ఎర్రబెల్లి స్వర్ణ పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు