అది రాష్ట్రపతిని అవమానించడమే.. కాంగ్రెస్‌ అలాంటిది కాదు: బీజేపీపై ఖర్గే ఫైర్‌

23 Sep, 2023 20:59 IST|Sakshi

ఢిల్లీ: పార్లమెంట్‌ కొత్త భవన ప్రారంభోత్సవానికి కేంద్రం.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించకపోవడంపై కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు. సినీ తారలను ఆహ్వానించిన బీజేపీ ప్రభుత్వం.. రాష్ట్రపతిని విస్మరించడం ఆ హోదాను.. ఆ హోదాలో ఉన్న ఆమెను అవమానించినట్లేనని మండిపడ్డారు. 

శనివారం రాజస్థాన్‌ జైపూర్‌లో ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఓ కార్యక్రమంలో ఖర్గేతో పాటు రాహుల్‌ గాంధీ కూడా పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో ఖర్గే మాట్లాడుతూ.. ‘‘భారత రాజ్యాంగాన్ని అనుసరించి.. అత్యున్నత హోదాలో ఉన్న ఓ వ్యక్తిని ఇలా అవమానించడం దారుణం. పార్లమెంట్‌ ప్రారంభం అయితే రాష్ట్రపతిని ఆహ్వానించకుండా.. సినీ తారలను ఆహ్వానిస్తారా. ఇది రాష్ట్రపతిని అవమానించడమే. కాంగ్రెస్‌లో అన్ని కమ్యూనిటీలకు ప్రాధాన్యం ఉంటుంది. కానీ, బీజేపీ ఎవరినీ దగ్గరకు రానివ్వదు’’ అని ఖర్గే అన్నారు. 

అంతేకాదు.. గతంలో రామ్‌ నాథ్‌ కోవింద్‌ను సైతం పార్లమెంట్‌ భవన శంకుస్థాపన కార్యక్రమానికి బీజేపీ ఆహ్వానించలేదనే విషయాన్ని ఖర్గే ప్రస్తావించారు. అది అంటరానితనమే అవుతుందన్నారు. ఒకవేళ అంటరాని వాడిగా భావించే వ్యక్తితో శంకుస్థాపన జరిపించినా.. సహజనంగానే వాళ్లు గంగాజలంతో శుద్ధి కార్యక్రమం నిర్వహించేవాళ్లేమో అని ఖర్గే బీజేపీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు.    

మహిళలకు రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశం బీజేపీ ప్రభుత్వానికి లేనేలేదని ఖర్గే అన్నారు. కేవలం ఇండియా కూటమికి భయపడే రిజర్వేషన్‌ అంశం.. అదీ ఎన్నికల ముందర బీజేపీ తెచ్చిందని విమర్శించారాయన.

మరిన్ని వార్తలు