ఈటల భూ కబ్జా: ‘కేసీఆర్‌ ఆడుతున్న రాజకీయ డ్రామా’

1 May, 2021 21:11 IST|Sakshi

అలీబాబా నలభై దొంగలు మాదిరి కేసీఆర్‌ పాలన

సీఎల్పీ నేత భట్టివిక్రమార్క

హైదరాబాద్‌: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈటల రాజేందర్‌ భూ కబ్జాపై సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిపాలన అలీబాబా నలభై దొంగలు అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు గతంలో పేదల భూములు ఆక్రమించుకున్నారనే విషయాన్ని తమ పార్టీ ఎన్నోసార్లు బహిరంగపరిచిందని తెలిపారు. గతంలో ప్రభుత్వం పలు కేసులపై విచారణను తెరపైకి తెచ్చి వాటిని పూర్తిగా నిలిపివేశారని భట్టి పేర్కొన్నారు.

గతంలో డ్రగ్స్ కేసు విచారణకు ఆదేశించి, పూర్తిగా ఆపేశారని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. దాంతో పాటుగా ప్రభుత్వం మియాపూర్ భూములపై విచారణ చేస్తున్నట్లు  ఆర్భాటం సృష్టించారే తప్ప ఇంతవరకు విచారణ కొలిక్కి రాలేదని తెలిపారు. ప్రభుత్వం మీద ఎదురుదాడి పెరుగుతున్న సమయంలో ప్రజల దృష్టి మరల్చడం కేసీఆర్‌కు అలవాటని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కేసీఆర్‌ నిర్లక్ష్యం కారణంగానే కరోనా కేసులు పెరిగాయని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితిలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటలపై ఇలాంటి ఆరోపణలు బయటకు తీశారని పేర్కొన్నారు. కరోనా బారిన పడ్డ పేదలకు వ్యాక్సిన్ లేదు, బెడ్ లేదు, ఆక్సిజన్ లేదు, సిబ్బంది లేదు ప్రజల దృష్టి మళ్లించడానికి ఈటల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని తెలిపారు. ఈటల వ్యవహరంపై సీఎం ప్రజల ముందు వచ్చి నిజాలను బహిరంగపర్చాలని సవాల్‌ విసిరారు.

చిత్తశుద్ధి ఉంటే ఆక్రమణలకు గురైన భూములను తిరిగి ప్రజలకు ఇవ్వాలని భట్టి విక్రమార్క్‌ డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా 111 జీఓపై కూడా దర్యాప్తు చేయాలని కోరారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కోనేరు రంగారావుపై ఆరోపణలు వచ్చిన వెంటనే రాజీనామా చేసి విచారణ జరిపించినట్లు గుర్తుచేశారు. వారిని మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకున్న చరిత్ర కాంగ్రెస్దని భట్టి విక్రమార్క తెలిపారు. కేసీఆర్‌ ప్రభుత్వం శవాల పేరుతో రాజకీయం చేస్తోందని పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. కేసీఆర్‌ను  జైల్లో పెడతామని చెప్పిన బీజేపీ ఏం చేస్తోందని ప్రశ్నించారు. 2014 నుంచి రాష్ట్రంలో జరిగిన భూ అక్రమాలపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర హోం శాఖ కి లేఖ రాయాలని పొన్నం సవాల్‌ విసిరారు.

చదవండి: ఈటలపై అక్కసుతోనే కేసీఆర్‌ రాజకీయాలు

మరిన్ని వార్తలు