ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉన్నారు.. నా చేతుల్లో ఏమీ లేదు!

26 Sep, 2022 08:58 IST|Sakshi

జైపూర్‌: 90 మందికిపైగా ఎమ్మెల్యేల రాజీనామాతో రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో సీఎం అశోక్ గహ్లోత్‌  తన చేతుల్లో ఏమీలేదని, ఎమ్మెల్యేలంతా ఆగ్రహంతో ఉన్నారని అధిష్ఠానానికి చెప్పినట్లు సమాచారం. రాజస్థాన్‌ పరిణామాలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేకే వేణుగోపాల్‌తో గహ్లోత్‌ ఫోన్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే కేకే వేణుగోపాల్ మాత్రం దీన్ని ఖండించారు. అసలు గహ్లోత్‌తో తాను ఫోన్‌లో మాట్లాడలేదేని చెప్పారు. గహ్లోత్ తనుకు గానీ, తాను గహ్లోత్‌కు గానీ ఫోన్ చేయలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో తలెత్తిన సమస్యను అధిష్ఠానం వీలైనంత త్వరగా పరిష్కరిస్తుందని స్పష్టం చేశారు.

రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో ఆదివారం ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అశోక్ గహ్లోత్‌.. సీఎంగా తప్పుకోవడానికి వీల్లేదని ఆయన వర్గానికి చెందిన 92 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. ఒకవేళ గహ్లోత్ రాజీనామా చేస్తే ఆయన స్థానంలో తమ వర్గానికి చెందిన నేతనే సీఎం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సచిన్ పైలట్‌ను మాత్రం సీఎం చేయవద్దని తేల్చిచెప్పారు. 2020లో పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన ఆయనను సీఎం ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఈ విషయంపై పార్టీ అధిష్ఠానంతోనే చర్చిస్తామన్నారు. ఆదివారం సీఎల్పీ సమావేశానికి ముందే ఈ పరిణామం జరగడం కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని షాక్‌కు గురిచేసింది.

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న అశోక్ గహ్లోత్‌.. మొదట రాజస్థాన్ సీఎంగా కూడా కొనసాగుతానని చెప్పారు. అయితే రాహుల్ గాంధీ సహా పార్టీ సీనియర్‌ నేతలు ఒకరికి ఒకే పదవి అని ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌ను గుర్తుచేశారు. దీంతో అధ్యక్ష ఎన్నికకు నామినేషన్‌ వేయడానికి ముందే ఆయన సీఎం పదవికి రాజీనామా చేస్తారని, కొత్త సీఎంగా సచిన్‌ పైలట్ బాధ్యతలు చేపడతాని ప్రచారం జరిగింది. గహ్లోత్ వర్గం దీన్ని వ్యతిరేకించడంతో సంక్షోభ పరిస్థితి తలెత్తింది.
చదవండి: కాంగ్రెస్‌కు బిగ్ షాక్‌.. 92 మంది ఎ‍మ్మెల్యేల రాజీనామా

మరిన్ని వార్తలు