TS: నేడు గజ్వేల్‌లో కాంగ్రెస్‌ ‘దండోరా’ సభ

17 Sep, 2021 07:37 IST|Sakshi
సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న కాంగ్రెస్‌ నేతలు

భారీ జనసమీకరణ లక్ష్యంతో ఏర్పాట్లు పూర్తి చేసిన పార్టీ నాయకులు 

గజ్వేల్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’సభ నిర్వహణకు కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సభకు భారీగా జనాన్ని సమీకరించాలని ఆ పార్టీ భావిస్తోంది. పట్టణంలోని ఇంటిగ్రేటెడ్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌(ఐవోసీ) వెనుక భాగంలోని మైదానంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు కళాకారుల ప్రదర్శనతో సభ ప్రారంభంకానుంది.

మూడు గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రముఖులు సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఆ తర్వాత 3:45 గంటలకు రాజ్యసభలో కాంగ్రెస్‌ పక్షనాయకుడు మల్లికార్జునఖర్గే, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యంఠాగూర్‌లు చేరుకుంటారు. ఈ సభలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలు, దళిత, గిరిజనులను మోసం చేస్తున్న తీరుపై వివిధ అంశాలతో చార్జిషీట్‌ విడుదల చేయడానికి కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి లక్ష మందికిపైగా ఈ సభలో పాల్గొనేలా కాంగ్రెస్‌ ఏర్పాట్లు చేస్తోంది.

సభా వేదిక ముందు భాగంలో 25 వేలకుపైగా కుర్చీలు వేస్తున్నారు. సభవల్ల పట్టణంలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. పార్కింగ్‌కు ప్రత్యేకమైన స్థలాలను కేటాయించారు. గురువారం సాయంత్రం సభ ఏర్పాట్లను మాజీ మంత్రులు గీతారెడ్డి, షబ్బీర్‌ అలీ, దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’సభ ద్వారా కేసీఆర్‌ పతనం ప్రారంభం కాబోతోందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు