కేసీఆర్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలి..

21 Aug, 2020 20:18 IST|Sakshi

కాంగ్రెస్ పార్టీ డిమాండ్

సాక్షి, హైదరాబాద్ :  సచివాలయ ఆవరణలో నల్ల పోచమ్మ ఆలయం, మసీదులు కూల్చివేతలకు బాధ్యులైన ముఖ్యమంత్రి కేసీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఏఐసీసీ అధికార ప్రతినిధి శ్రావన్ దాసోజు, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ ఎంపీ శ్రీ అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం శ్రవణ్ దాసోజు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల మనోభావాలను, మత పరమైన విశ్వాసాలను గాయపరుస్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చట్ట విరుద్ధంగా, రాజ్యంగానికి వ్యతిరేకంగా నియంతత్వ పోకడలతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

అత్యంత ప్రాచీనమైన ప్రార్థనా స్థలాలను మూడో కంటికి తెలియకుండా చట్ట వ్యతిరేకంగా దుర్మార్గంగా కూల్చివేశారని విమర్శించారు. వీటిలో ఓమసీదు 1889 వ సంవత్సరంలో ఆనాటి నిజాం రాజు నిర్మించిన తెలంగాణ వారసత్వ సంపద అని, అంతేకాకుండా సీ బ్లాక్ పక్కనే ఉన్న మసీదు ఇఫ్తార్ - ఏ - ముతామాది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రార్థనా మందిరమని గుర్తుచేశారు. మతపరమైన మనోభావాలను రెచ్చగొడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ ఫిరోజ్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ  మైనారిటీ సెల్ చైర్మన్ సోహైల్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు