మోదీ తర్వాత సోనియాను ప్రధాని చేసేందుకు బీజేపీ ప్లాన్‌

13 Sep, 2022 14:00 IST|Sakshi

అహ్మదాబాద్‌: ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో రెండో రోజు పర్యటిస్తున్నారు అరవింద్ కేజ్రీవాల్. అహ్మదాబాద్‌లోని టౌన్‌హాల్‌లో పారిశుద్ధ్య కార్మికులతో సమావేశమయ్యారు. అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ క్రమంలో పంజాబ్‌ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నప్పటికీ.. గుజరాత్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రచారం కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తోందని వచ్చిన ఆరోపణలపై  ఓ మీడియా ప్రతినిధి కేజ్రీవాల్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ ఈ ప్రశ్న ఎవరు అడిగారని ఎదురు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడని మీడియా ప్రతినిధి బదులిచ్చారు.

దీనిపై రియాక్ట్ అయిన కేజ్రీవాల్‌.. కాంగ్రెస్ పని ఖతమైపోయిందని అ‍న్నారు. ఆ పార్టీ నాయకులు అడిగే ప్రశ్నలను ఎవరూ పట్టించుకోరని మీడియా కూడా సీరియస్‌గా తీసుకోవద్దని సూచించారు. అంతేకాదు గుజరాత్‌లో బీజేపీకి ప్రత్యామ్నాయం ఆమ్ ఆద్మీ పార్టీనే అని కేజ్రీవాల్ ధీమాగా చెప్పారు. గుజరాత్ ఓటర్లు బీజేపీపై విముఖతతో ఉన్నారని, అలాగే వారు కాంగ్రెస్‌కు కూడా ఓటు వేయాలని అనుకోవడం లేదని చెప్పారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి ప్రజలు తమ ఓటు హక్కును వృథా చేసుకోవద్దన్నారు. ఆప్ వైపే అందరూ చూస్తున్నారని పేర్కొన్నారు.

అలాగే సామాజిక కార్యకర్త మేధా పాట్కర్‌ను గుజరాత్ సీఎం చేయాలని ఆప్ చూస్తోందని బీజేపీ చేసిన ఆరోపణలపైనా కేజ్రీవాల్ తనదైన శైలిలో స్పందించారు. నరేంద్ర మోదీ తర్వాత సోనియా గాంధీని ప్రధాని చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోందని తాను ఆరోపిస్తున్నానని, బీజేపీ దీనిపై ఏమంటుందని ప్రశ్నించారు.
చదవండి: బెంగాల్‌లో తీవ్ర ఉద్రిక్తత.. పోలీసులు, బీజేపీ శ్రేణులకు మధ్య ఘర్షణ

మరిన్ని వార్తలు