రహస్య సర్వే: హస్తం కేడర్‌పై.. అధిష్టానం నజర్‌..

6 Mar, 2022 20:13 IST|Sakshi

నియోజకవర్గాలవారీగా స్థితిగతులపై గాంధీభవన్‌ ఆరా

నాయకుల కార్యకలాపాలపై రహస్య సర్వే

ప్రజాభిప్రాయం కోరుతున్న రేవంత్‌ స్పెషల్‌ టీమ్

పనిచేసే వారికే టికెట్లు ఇవ్వాలని నిర్ణయం

వచ్చేవారం వేములవాడలో టీపీసీసీ ప్రెసిడెంట్‌ పర్యటన

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పార్టీ స్థితిగతులపై కాంగ్రెస్‌ దృష్టి సారించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీకి పునర్వైభవం కల్పించేందుకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో నాయకుల పనితీరుపై రహస్య సర్వే ప్రారంభించింది. నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్‌ పరిస్థితి, నాయకుల పనితీరు.. ఎవరెవరు క్రియాశీలకంగా ఉన్నారు? ఎవరెవరు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు? ఎవరు నిత్యం ప్రజల్లో ఉంటున్నారు? అన్న విషయాలపై రేవంత్‌రెడ్డి నియమించిన ప్రత్యేక నిఘా బృందం వివరాలు తెప్పించుకుంటోంది.

చదవండి: కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

2004 నుంచి 2009 వరకు ఉమ్మడి జిల్లాలో పార్టీ ప్రాబల్యాన్ని కాంగ్రెస్‌ పార్టీ బలంగా చాటుకుంది. తెలంగాణ ఆవిర్భావం తరువాత కాంగ్రెస్‌ పార్టీ జిల్లాలో క్రమంగా జనాదరణకు దూరమవుతూ వస్తోంది. కీలకమైన నాయకులు టీఆర్‌ఎస్, ఇతర పార్టీలకు వెళ్లిపోవడంతో కేడర్‌పరంగా పార్టీ బాగా బలహీనంగా మారింది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి పగ్గాలు చేపట్టాక.. పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చింది. వచ్చేవారంలో రేవంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తారని, వేములవాడలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈలోపు జిల్లా కేడర్, స్థితిగతులపై రేవంత్‌కు పూర్తిస్థాయి నివేదిక అందించేందుకు గాంధీభవన్‌ వర్గాలు సిద్ధమయ్యాయి.

హుజూరాబాద్‌ ఉపఎన్నిక,     ఎమ్మెల్సీ ఎన్నికల్లో భంగపాటు..!
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పోటీ చేసింది. ఆ సమయంలో కాంగ్రెస్‌ పార్టీ రోడ్‌షోల కు జనాల నుంచి అపూర్వ స్పందన వచ్చినా పార్టీ వాటిని ఓట్లుగా మలచుకోవడంలో విఫలమైంది.

ఉమ్మడి జిల్లా నాయకులంతా రేవంత్‌ సభలకు హాజరైనా.. కనీసం డిపాజిట్‌ దక్కించుకోలేక ఘోర పరాజయం మూటగట్టుకుంది. 
అయితే.. అది ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరిగిన ఎన్నిక కావడంతో కాంగ్రెస్‌ పార్టీ ఆ పరాజయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. 
ఆ వెంటనే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకలేదు. 
ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులంతా ఎవరికి నచ్చినట్లు వారు వ్యవహరించారు. 
అయితే.. ఇటీవల చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదుకు మాత్రం మంచి స్పందన రావడం పార్టీలో ఆశలు చిగురిస్తున్నాయి.

సీనియర్లకు సైతం ఫోన్స్‌..
కొంతకాలంగా కొత్త జిల్లాల వారీగా పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌ జిల్లాలో ఇద్దరు లేదా ముగ్గురు నేతలు మాత్రమే క్రియాశీలకంగా ఉంటున్నారు. పార్టీపరంగా నిరసనలు, ధర్నాలకు వారు మాత్రమే హాజరవుతున్నారు. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో వెలుగువెలిగిన చాలామంది సీనియర్లు పార్టీ కార్యకలాపాలకు అంటీముట్టనట్లుగా ఉండటంతో కేడర్‌ కూడా నిస్తేజంలోకి జారిపోతోంది. ఓవైపు అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో ఇప్పటి నుంచి పార్టీని సమాయత్తం చేయాలని టీపీసీసీ రేవంత్‌రెడ్డి వర్గం ఆలోచనగా తెలుస్తోంది. అందుకే.. సీనియర్‌ నేతలకు ఫోన్లు చేసి తిరిగి వారిని క్రియాశీలకంగా మార్చే యత్నాలను ప్రారంభించారు.

యువత, పనిచేసేవారికే టికెట్లు..!
అదేసమయంలో పార్టీలో కొత్తనాయకుల పనితీరుపై దృష్టి సారించారు. పార్టీలో ఎవరు నిత్యం వార్తల్లో ఉంటున్నారు? ఎవరు నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు? ఎవరు నిరసనలు, ధర్నా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు? పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు ఎలా అమలవుతున్నాయి? కొత్తగా ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఆశిస్తున్నవారి ఆర్థిక స్థితిగతులు ఏంటి? వారి అంగబలం, ఆర్థిక సామర్థ్యం, జనాదరణ ఎలా ఉంది? తదితర విషయాలపై రేవంత్‌ స్పెషల్‌ టీమ్‌ రహస్య సర్వే నిర్వహిస్తోంది.

ఉత్తర తెలంగాణలో అందులోనూ పార్టీకి కీలకమైన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో మెరికల్లాంటి యువ నాయకులకు ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటం చేసేలా దిశానిర్దేశం చేసేందుకు సమాయత్తం అవుతోంది. మొత్తానికి ఎన్నికల ముందు చుట్టపు చూపులా వచ్చి టికెట్లు తీసుకునే సంప్రదాయానికి ఇకపై చెల్లదని, ప్రజాదరణే ప్రామాణికంగా టికెట్లు ఇచ్చే ఉద్దేశంతోనే ఈ సర్వే నిర్వహిస్తోందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 

మరిన్ని వార్తలు