రాహుల్‌ గాంధీ పునరాగమనం!

23 Nov, 2020 13:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సాధ్యమైనంత త్వరలో సమావేశాన్ని ఏర్పాటు చేయాలనుకుంటోంది. వేదిక, తేదీలు ఖరారుకాగానే మీకు సమాచారం అందజేస్తాం’ అని దేశంలోని అన్ని పార్టీ శాఖలకు ఇటీవల రాసిన లేఖలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల బృందానికి సారథ్యం వహిస్తోన్న మధుసూదన్‌ మిస్త్రీ తెలియజేశారు. పార్టీకి పూర్తి స్థాయి అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు డిసెంబర్‌ లేదా వచ్చే ఏడాది జనవరిలో పార్టీ జాతీయ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే సమావేశం గురించి మిస్త్రీ ప్రస్తావించారు. సోనియా గాంధీ కుమారుడు రాహుల్‌ గాంధీ పార్టీ ఉపాధ్యక్ష, అధ్యక్ష పదవుల్లో కొనసాగినప్పుడే  రెండు పార్లమెంట్‌ ఎన్నికల్లో పార్టీ పరాజయాన్ని ఎదుర్కొంది. ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడిగా 2019 పార్లమెంట్‌ ఎన్నికల బరిలోకి దిగినప్పుడు సొంత నియోజకవర్గంలో కూడా ఓటమిని చవిచూడాల్సి రావడంతో రాహుల్‌ ఉద్దేశపూర్వకంగానే పార్టీ నాయకత్వం బాధ్యతలను వదిలేసి ప్రవాసం వెళ్లారు. పర్యవసానంగా సోనియా తాత్కాలిక ప్రాతిపదికపై పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. (నితీష్‌ కుమార్‌కు ఆర్జేడీ ఆఫర్‌)

పార్టీ పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే రాహుల్‌ గాంధీ పునరాగమనం తథ్యమని తెలుస్తోంది. 1998 నుంచి ఇదే జరగుతోంది. 1998 నుంచి 2017 వరకు పార్టీ అధ్యక్షులుగా సోనియా గాంధీ, 2017 నుంచి 2019 వరకు రాహుల్‌ గాంధీ, 2019–2020 వరకు తాత్కాలిక అధ్యక్షులుగా సోనియా గాంధీ కొనసాగగా, 2021లో మళ్లీ పార్టీ సారథ్య బాధ్యతలను రాహుల్‌ గాంధీ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్‌ పార్టీ ప్రయాణం స్క్రిప్టు ప్రకారం నడవడం లేదు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ నాయకత్వంలోని మహా కూటమి విజయావకాశాలు కాస్త కాంగ్రెస్‌ వల్ల దెబ్బతిన్నాయన్న అపఖ్యాతి వచ్చింది. పార్టీ నుంచి ముస్లిం ఓట్లను ఏఐఎంఐఎం తన్నుకు పోయిందంటూ ఆ పార్టీ మీద పార్టీ విమర్శలు సంధించింది. ఆ తర్వాత తాను బలంగా ఉన్న మధ్యప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల ఉప అసెంబ్లీ ఎన్నికల్లోనూ రాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. పార్టీ పనితీరు పట్ల పార్టీకి చెందిన 23 మంది నాయకులు బాహటంగానే పార్టీ వ్యవహారాలను విమర్శిస్తున్నారు. పార్టీకి పూర్తి స్థాయి నాయకుడు అవసరమని చెబుతున్నారు. అవకాశం దొరికితే పీ. చిదంబరం, కపిల్‌ సిబాల్, వివేక్‌ తన్ఖా తదితరులు పార్టీ పదవికి పోటీ పడేందుకు సిద్ధంగా ఉన్నారు. 

మరిన్ని వార్తలు