కాంగ్రెస్‌కు మరో ఝలక్‌.. రేవంత్‌కు ఊహించని ఫోన్‌ కాల్‌!

7 Aug, 2022 01:56 IST|Sakshi

క్షమాపణలు చెప్పిన దయాకర్‌..

వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నట్టు ప్రకటన

చర్యలు తీసుకోవాల్సిందేనంటున్న వెంకట్‌రెడ్డి అభిమానులు 

సాక్షి, హైదరాబాద్‌: వలసలతో సతమ­తమవుతున్న కాంగ్రెస్‌పార్టీకి కొత్త తలనొప్పి వచ్చి పడింది. చండూరు సభలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌­రెడ్డినుద్దేశించి టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర కలకలమే రేపుతున్నాయి. మూడు దశా­బ్దాలుగా పార్టీలో కీలక హోదాల్లో పని­చేస్తున్న నేత గురించి దయాకర్‌ అనుచితంగా మాట్లా­డటం పట్ల ఆ పార్టీ సీనియర్‌ నేతలు గరంగరంగా ఉన్నారు. 

వేలాదిమంది ప్రజలు, కార్యకర్తల సమక్షంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా సీనియర్‌ నాయకుల సాక్షిగా దయాకర్‌ మాట్లాడిన మాటలు తీవ్ర అభ్యంతరకరమై­నవని, ఆయనను వారించే ప్రయత్నం కూ­డా ఎవరూ చేయకపోవడం కచ్చితంగా పార్టీకి నష్టం చేస్తుందని అభిప్రా­యపడు­తున్నారు. ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్‌ నేతలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హాజరైన సభ­లో ఈ విధంగా మాట్లాడటం పార్టీ శ్రేణులకు ప్రతికూల సంకేతాలు పంపుతాయని అంటు­న్నారు. ఇదే విషయమై నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్‌ నేత, మాజీమంత్రి ఒకరు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌తోపాటు ఏఐసీసీ పెద్దలకు ఫోన్‌ చేసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆయన్ను పార్టీలోంచి వెళ్లిపొమ్మనే హక్కు దయాకర్‌కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించినట్టు సమాచారం. 

షోకాజ్‌ నోటీసు జారీ
దయాకర్‌ అనుచిత వ్యాఖ్యలపై పార్టీ అధి­ష్టానం కూడా ఆరా తీసింది. ఈ విషయమై రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ పీసీసీ నాయకత్వంతో చర్చించినట్టు సమాచారం. దయాకర్‌పై చర్యలు తీసుకో­వాలంటూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి అనేక ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే దయాకర్‌కు టీపీసీసీ షోకాజ్‌ నోటీ­సులు జారీ చేసింది. దయాకర్‌ మాట్లాడిన ఆ సభలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ జి.­చిన్నారెడ్డి ఉండటంతో ఆయననే సాక్షిగా చూపుతూ నోటీసు జారీచేసింది. వారం రోజు­ల్లోగా వివరణ ఇవ్వాలని పేర్కొంది. 

క్షమాపణ చెబుతున్నా: అద్దంకి
వెంకట్‌రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలు వివా­దంగా మారుతుండటంతో దయా­కర్‌ తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేశా­రు. శనివారం గాంధీభవన్‌లో మీడియా­తో మాట్లాడుతూ.. తాను పొరపాటున చేసిన వ్యాఖ్యలతో వెంకట్‌రెడ్డి మనోభా­వాలు దెబ్బతిన్నందున ఆయనకు వ్యక్తి­గతంగా క్షమాపణలు చెబుతున్నానన్నా రు. కోమటిరెడ్డి అభిమానులు క్షమించా లని, మళ్లీ తప్పు జరగకుండా చూసుకుంటానని అన్నారు.

షోకాజ్‌ నోటీసు ఇవ్వక ముందే వివరణ ఇవ్వాల­నుకున్నానని, ఆ లోపే అది వచ్చిన నేప­థ్యంలో క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇస్తానన్నారు. వరుస తప్పి­దాలకు పాల్పడుతున్న దయాకర్‌పై పార్టీ కఠినచర్యలు తీసుకో వాలని కోమటి­రెడ్డి అభిమానులు కోరుతుండటం గమ­నా­ర్హం. షోకాజ్‌ నోటీసు జారీ అయిన నేపథ్యంలో టీపీసీసీ క్రమ శిక్షణా కమిటీ చైర్మన్‌ చిన్నారెడ్డిని శనివారం గాంధీభవ­న్‌లో దయాకర్‌ కలిశారు. ఎంపీ కోమటి­రెడ్డినుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై క్షమాప ణలు చెబుతున్నట్టు తెలిపారు. కోమ­టి రెడ్డిని కలసి క్షమాప­ణలు చెబుతానని, ఏఐ సీసీకి, కోమటిరెడ్డిలకు లేఖ కూడా రాస్తానని చిన్నారెడ్డికి వెల్లడించారు.

ఇది కూడా చదవండి: నడి వీధుల్లో కత్తులు పట్టుకుని తిరుగుతున్నారు.. కేసీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు  

మరిన్ని వార్తలు