యువతను ఆకట్టుకునేలా హాలీవుడ్‌ సినిమా రేంజ్‌లో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌

25 Jan, 2022 17:03 IST|Sakshi

Punjab Chief Minister Charanjit Singh Channi portrayed as superhero Thor: కరోనా మహమ్మారి సమయంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో ఎలక్షన్‌ కమిషన్‌ రోడ్‌ షోలు, ర్యాలీలను నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో అన్ని పార్టీలు సోషల్‌ మీడియాను వేదికగా చేసుకుని తమదైన వ్యూహాలతో ప్రజలను ఆకర్షించేలా ప్రచారాలకు సనద్దమయ్యారు. అందులో భాగంగానే పంజాబ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్‌ పార్టీ హాలీవుడ్‌ సూపర్‌ హీరో చిత్రం అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్‌ని స్ఫూర్తిగా తీసుకుంది. అయితే మార్వెల్ కామిక్స్ ఆధారంగా రూపొందించిన ఈ హాలీవుడ్‌ చిత్రంలో క్రిస్ హేమ్స్‌వర్త్, మార్క్ రుఫాలో, క్రిస్ ఎవాన్స్, తదితర నటులు నటించారు.

ఈ మేరకు ఈ అవెంజర్స్‌ చిత్రంలో థోర్స్‌ పాత్రలో చరణ్‌ జిత్‌ సింగ్‌​ చన్నీ ముఖాన్ని, రాహుల్‌ గాంధీని బ్రూస్ బ్యానర్ అకా ది హల్క్‌గా ఒక యుద్ధ సన్నివేశానికి సంబంధించిన వీడియోని చిత్రీకరించారు. అయితే ఇందులో నవజ్యోత్ సింగ్ సిద్ధూని కెప్టెన్ అమెరికాతో పోల్చారు. అంతేకాదు ఈ అవెంజర్స్‌ సినిమాలో దేవుళ్ల సినిమాల్లో ఉన్నట్టుగా ఉరుములు మెరుపులతో కూడి యుద్దం చేస్తున్న సన్నీవేశాన్ని చిత్రీకరించారు. ఆ వీడియోలో నరేంద్ర మోదీ, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ముఖాలను గ్రహాంతరవాసుల పాత్రలతో వారిని శత్రువులుగా చిత్రీకరించారు. పైగా పంజాబ్‌లో లోక్‌ కాంగ్రెస్ అనే తన సొంత పార్టీని స్థాపించిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, శిరోమణి అకాలీదళ్ (సీఏడీ) చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌లను దుష్ట గ్రహాంతరవాసులు పాత్రలుగా చిత్రీకరించారు.

బ్యాక్‌ గ్రౌండ్‌లో థీమ్‌ సాంగ్‌తో మిస్టర్ చన్నీ ఎంట్రీ అయ్యి స్టార్మ్‌బ్రేకర్‌(గొడ్డలి ఆకారంలో ఉండే ఆయుధం)ని ఉపయోగించి గ్రహాంతరవాసులందరి గొంతులను కోస్తున్నట్టుగా వీడియో రూపోందించారు. పంజాబ్‌ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న దుష్టశక్తుల నుండి తమ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఏమైన చేస్తాం అని వీడియో చివరలో వినిపిస్తుంది. ఈ మేరకు కాంగ్రెస్‌ నాయకులు హాలీవుడ్‌ అవెంచర్స్‌ మూవీలోని యుద్ధ సన్నివేశాన్ని ఎడిట్‌ చేసిన క్లిప్పింగ్‌ వీడియోతోపాటు "పంజాబ్‌లో కాంగ్రెస్‌ మాత్రమే అధికారంలోకి వస్తుంది" అనే క్యాప్షన్‌ని జోడించి మరీ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ హాలీవుడ్‌ మూవీకి భారతదేశంలో విపరీతమైన అభిమానులు ఉండటంతో కాంగ్రెస్‌ పార్టీ పంజాబ్‌లోని యువత ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు ఈ చిత్రంలోని యుద్ధ సన్నివేశాన్ని ఎంచుకుంది. ఇటీవలే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బాలీవుడ్ పాట 'మస్త్ కలందర్'ను ఎడిట్ చేసిన వీడియో క్లిప్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు