‘దళిత బంధు’ కాదు.. ఎన్నికల బంధు

28 Jul, 2021 14:06 IST|Sakshi
వర్ధన్నపేట: మాట్లాడుతున్న వరదరాజేశ్వర్‌రావు

సాక్షి, వర్ధన్నపేట(వరంగల్‌): దళిత సాధికారత పేరుతో హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో గెలుపొందేందుకు దళిత బంధు పథకం అంటూ దళితులను మరోసారి మోసం చేసేందుకు సీఎం కేసీఆర్‌ కుట్ర పన్నారని, అది దళిత బంధు కాదని ఎన్నికల బంధు అని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ఎర్రబెల్లి వరదరాజేశ్వర్‌రావు దుయ్యబట్టారు. మంగళవారం వర్ధన్నపేట పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కనీసం దళిత రిజర్వేషన్‌ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో దళిత బంధు అమలు చేయాలని, తదుపరి రాష్ట్రంలో ఉన్న దళితులందరికి వర్తింప చేసి తమ చిత్త శుద్ది చాటుకోవాలని అన్నారు.

పైలట్‌ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో కాకుండా దళిత రిజర్వేషన్‌ నియోజకవర్గంలో చేపట్టే విధంగా మంత్రులు చొరవ తీసుకోవాలని హితవు పలికారు. ఎన్నిక ముందే సీఎం కేసీఆర్‌కు పథకాలు గుర్తుకు వస్తాయని విమర్శించారు.  అధికారులు సైతం పార్టీ కార్యకర్తలుగా పని చేస్తున్నారని ఆరోపించారు. సమ్మెట సుధీర్, బంగారు సదానందం, బెజ్జం పాపారావు పాల్గొన్నారు.

‘కోడ్‌’ కు ముందే పది లక్షలు పంపిణీ చేయాలి
రాయపర్తి: ఎలక్షన్‌ కోడ్‌ రాకముందే హుజురాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ప్రతీ దళిత కుటుంబానికి రూ.10లక్షలు అందించి ఎన్నికలకు వెళ్లాలని రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ వరంగల్‌ జిల్లా కార్యదర్శి వల్లందాస్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 
నయా మోసానికి కేసీఆర్‌ శ్రీకారం

దుగ్గొండి: హుజూరాబాద్‌  ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ నయా మోసానికి శ్రీకారం చుట్టారని బీఎస్పీ నాయకుడు గజ్జి దయాకర్‌ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో ఎస్సీ ఓట్లు కొల్లగొట్టడానికి దళిత బంధు పథకం తీసుకువచ్చారన్నారు, ఏడేళ్లుగా గుర్తుకు రాని ఎస్సీలు ఇప్పుడు గుర్తుకు రావడానికి ప్రజలు గమనించాలన్నారు. మోసాలు, మాయలతోనే ముఖ్యమంత్రి పాలన సాగిస్తున్నారని ఏనాటికయినా ప్రజలు గుర్తించి తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు. 

మరిన్ని వార్తలు