ఏడాదిగా గాంధీలు అపాయింట్‌మెంట్ ఇవ్వట్లేదు.. కాంగ్రెస్‌కు యువనేత రాజీనామా

24 Aug, 2022 19:30 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌కు మరో యువనేత షాక్ ఇచ్చారు. పార్టీ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ రాజీనామా చేశారు. కొంతకాలంగా పార్టీ మీడియా సమావేశాలకు దూరంగా ఉంటున్న 39 ఏళ్ల ఈ యువనేత.. పార్టీకి, అధికార పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు బుధవారం తెలిపారు. ఈమేరకు రాజీనామా లేఖను సోనియాకు పంపారు. అంతేకాదు పార్టీని వీడుతూ గాంధీలపై విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాలు ప్రస్తుత యువత, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా ఉండటం లేదని జైవీర్ ఆరోపించారు. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీల అపాయింట్‌మెంట్ కోసం ఏడాదిగా ప్రయత్నిస్తున్నా.. అనుమతి దొరకడం లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీని వ్యక్తిపూజ చెదపురుగులా తినేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో జరిగే విషయాలకు పార్టీ నిర్ణయాలకు పొంతన ఉండట్లేదన్నారు.

గత ఎనిమిదేళ్లుగా పార్టీ నుంచి తాను ఏమీ తీసుకోలేదని షెర్గిల్ అన్నారు. తానే పార్టీ కోసం చాలా చేశానని చెప్పుకొచ్చారు. లాయర్ అయిన జైవీర్ కాంగ్రెస్‌కు కీలక అధికార ప్రతినిధుల్లో ఒకరు. ఈ నెలలో ఇప్పటికే గులాం నబీ ఆజాద్‌, ఆనంద్ శర్మ వంటి సీనియర్ నేతలు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో సంస్కరణలు తీసుకురావాలని అసంతృప్తి వ్యక్తం చేసిన జీ-23 నేతల్లో ఈ ఇద్దరూ ఉన్నారు.
చదవండి: ఐదారేళ్లలో బీజేపీ కనుమరుగవుతుంది.. బిహార్‌ నుంచే పతనం మొదలైంది..

మరిన్ని వార్తలు