టీపీసీసీ పదవిపై స్పందించిన జీవన్‌రెడ్డి..

5 Jan, 2021 13:52 IST|Sakshi

ఏ బాధ్యత అప్పగించిన సమర్థవంతంగా పనిచేస్తా : జీవన్‌రెడ్డి

సాక్షి, జగిత్యాల : తెలంగాణా రాజకీయాల్లో పరిచయం అక్కరలేని సీనియర్ కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ కరడుగట్టిన కాంగ్రెస్ నేతగా, రాజకీయాల్లో మచ్చలేని నాయకునిగా ప్రాచుర్యం పొందిన జీవన్ రెడ్డికి పుట్టిన రోజు కానుకగా అధిష్టానం పీసీసీ అధ్యక్ష పదవిని బహుమానంగా ఇవ్వనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో జగిత్యాల చేరుకుని ఆయన ఇంటి ముందు సంబరాలు చేసుకుంటున్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ముందుగా ఆయన నివాసానికి చేరుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. పొన్నం ప్రభాకర్‌తో పాటు ఉమ్మడి జిల్లాలోని నాయకులు కార్యకర్తలు జీవన్ రెడ్డి ఇంటికి చేరుకొని సందడి చేస్తున్నారు.  ఆయన పుట్టిన రోజు కూడా ఈరోజే (మంగళవారం) కావడంతో కేక్ కట్ చేసి శాలువాలు, పూలదండలతో సత్కరించి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తెలంగాణా పీసీసీ అధ్యక్షునిగా జీవన్ రెడ్డిని పార్టీ అధిష్టానం ఖరారు చేసిందనే వార్తల సంగతి ఎలా ఉన్నప్పటికీ, యాధృచ్ఛికంగా ఆయన బర్త్ డే కూడా కలసి రావడం విశేషంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభివర్ణిస్తున్నాయి. (రేవంత్‌కు షాక్‌.. టీపీసీసీ చీఫ్‌గా సీనియర్‌ నేత!)

పీసీసీ పదవి అప్పగింతపై జీవన్‌రెడ్డి స్పందించారు. నాలుగు దశాబ్దాలుగా ప్రజాజీవితంలో సేవ చేస్తున్నానని, అధిష్టానం ఏ బాధ్యత అప్పగించిన సమర్థవంతంగా పనిచేస్తానని తెలిపారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. అయితే పీసీసీ పదవిపై ఇప్పటి వరకు పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదన్నారు. వ్యక్తిగతంగానూ తనకు పిలుపు అందలేదని తెలిపారు. అయితే ఢిల్లీ పెద్దల పిలుపు మేరకు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశానని వెల్లడించారు. కాగా టీపీసీసీ పదవికి ఎంపీ రేవంత్‌ రెడ్డితో పాటు, కోమటిరెడ్డి తీవ్రంగా పోటీ పడిన విషయం తెలిసిందే. అయితే ఇరువురి ఏ ఒక్కరికి నిరాశ మిగిల్చిన పార్టీలో చీలికలు వస్తాయని భావించిన హస్తం అధిష్టానం.. సీనియర్‌ నేతైన జీవన్‌రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించినట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. దీనిపై నేడోరేపో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

టీ-పీసీసీ అధ్యక్షుని ఎంపికపై రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరుల పేర్లను ఉటంకిస్తూ వార్తలు వస్తున్న నేపథ్యంలోనే జీవన్ రెడ్డి పేరు ఖరారు కావడం గమనార్హం. మంగళవారం సోనియాగాంధీ తుది నిర్ణయం తీసుకుంటారనే వార్తలు వస్తున్నాయి. అయితే పీసీసీ అధ్యక్షునిగా జీవన్ రెడ్డి ఎంపికకు సంబంధించి నియామక పత్రంపై సోనియాగాంధీ సోమవారం రాత్రి  సంతకం కూడా చేశారనేది తాజా సమాచారం. ఈ విషయంలో వారం రోజుల క్రితమే జీవన్ రెడ్డినీ పార్టీ అధిష్టానం పిలిపించుకునీ చర్చించినట్లు సమాచారం. అర్జంటుగా ఢిల్లీకి రావలసిందిగా రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ ఫోన్ చేయగ  ఈమేరకు జీవన్ రెడ్డి ఢిల్లీ కూడా వెళ్లి వచ్చారని ఆయన అనుయాయులు చెబుతున్నారు. పార్టీ సారథ్య బాధ్యతల అంశం ప్రస్తావన వచ్చినపుడు, తాను పార్టీకి విధేయుడినని, అప్పగించిన ఏ బాధ్యతనైనా నిర్వహిస్తానని జీవన్ రెడ్డి స్పష్టం చేసినట్లు తెలిసింది. అయితే పార్టీ నిర్వహణకు అవసరమైన ఆర్థిక బలం అనే అంశంపైనా పార్టీలో చర్చ జరిగినట్లు సమాచారం. జీవన్ రెడ్డి మంచి ప్రజానాయకుడిగా పేరుగాంచినప్పటికీ, పార్టీ నిర్వహణకు అవసరమైన ఆర్థిక వనరుల అంశం ప్రస్తావనం కూడా వచ్చిందంటున్నారు.

అయితే కొందరు  నాయకులు అండగా ఉంటారని పార్టీ ముఖ్యులు భావించినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో జీవన్ రెడ్డి కొత్త పీసీసీ చీఫ్ గా ఎంపిక పూర్తయిందని, ప్రకటన లాంఛనమేనంటున్నారు మంగళవారం వస్తుందని భావిస్తున్న అధికారిక ప్రకటన జీవన్ రెడ్డికి బర్త్ డే కానుకగా కాంగ్రెస్ శ్రేణలు భావిస్తున్నాయి. ఈ విషయంపై జీవన్ రెడ్డి ని మీడియా ప్రతినిధులు సంప్రదించగా మాట్లాడడానికి నిరాకరించారు. ఇంకా తనకు ఏ విషయం తెలియదని స్పష్టం చేశారు. 1981లో రాజకీయాల్లో ప్రవేచించిన "జీవన్" మల్యాల పంచాయితీ సమితి ప్రెసిడెంట్‌గా ఎన్నికై అంచెలంచెలుగా ఎదిగారు. 6 సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు  మంత్రిగా పనిచేసిన జీవన్ రెడ్డి ప్రస్తుతం కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.

మరిన్ని వార్తలు