ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మోసం చేశారు: మల్కూడ్‌ రమేష్‌

11 Jul, 2021 09:27 IST|Sakshi
మాట్లాడుతున్న మల్కూడ్‌ రమేష్‌ మహరాజ్‌

తాండూరు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్కూడ్‌ రమేష్‌ మహరాజ్‌ స్పష్టం చేశారు. శనివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. తనకు పీసీసీ ఉపాధ్యక్షుడిగా పదవి కట్టబెట్టడంపై సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో పాటు పార్టీ ముఖ్యనేతలకు కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబం పార్టీకి చేసిన సేవలను గుర్తించి పదవి ఇచ్చారన్నారు. పీసీసీ రేవంత్‌రెడ్డికి ఇవ్వడంతో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వవైభవం వచ్చిందని తెలిపారు. రేవంత్‌ బాధ్యతలు అప్పగించాక తెలంగాణ సర్కారులో వణుకు ప్రారంభమైందని, దీంతోనే సీఎం కేసీఆర్‌ 50 వేల ఉద్యోగాల భర్తీకి పూనుకున్నారని చెప్పారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి తిరిగి పూర్వవైభవం తీసుకొస్తామని పేర్కొన్నారు.  

బెంజి కారులో బౌన్సర్లతో..  
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రోహిత్‌రెడ్డి పార్టీతోపాటు నాయకులను మోసం చేసి టీఆర్‌ఎస్‌లో చేరారని మల్కూడ్‌ రమేష్‌ మహరాజ్‌ విమర్శించారు. తాండూరు అభివృద్ధిని విస్మరించి బెంజి కారులో బౌన్సర్లను వేసుకొని తిరిగితే ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని ఎమ్మెల్యేకు హితవు పలికారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వర్గపోరుతో అభివృద్ధి ఆగిపోయిందని ధ్వజమెత్తారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాని స్పష్టం చేశారు. గతంలో పార్టీ వీడిన నాయకుల్లో క్రమశిక్షణ కలిగిన వారినే తిరిగి చేర్చుకొంటామన్నారు.

రేపు సైకిల్‌ ర్యాలీ  పెరిగిన ఇంధన ధరలపై సోమవారం సైకిల్‌ ర్యాలీ నిర్వహించనున్నట్లు రమేష్‌ మహరాజ్‌ తెలిపారు. కేంద్రం మధ్య తరగతి ప్రజలపై పెనుభారం మోపుతూ పెట్రోల్, డీజిల్‌ ధరలను భారీగా పెంచిందన్నారు. ఈనేపథ్యంలో  సైకిల్‌ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. 16న రాజ్‌భవన్‌ ముట్టడి నిర్వహిస్తామని చెప్పారు.కార్యక్రమంలో పెద్దేముల్‌ జెడ్పీటీసీ ధారాసింగ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌గౌడ్, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ ఎంఏ అలీం, పార్టీ బీ బ్లాక్‌ అధ్యక్షుడు సత్యమూర్తి, పట్టణ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షులు బంటు వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు