చర్చలు సఫలం.. బీజేపీలోకి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి!

19 Nov, 2022 07:14 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మర్రి శశిధర్‌రెడ్డి త్వరలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఆయన బీజేపీలో చేరనున్నారని కొన్నిరోజులుగా రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మర్రి శశిధర్‌రెడ్డి శుక్రవారం రాత్రి ఢిల్లీలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాలపాటు జరిగిన ఈ సమావేశంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై మర్రి శశిధర్‌రెడ్డితో అమిత్‌షా మాట్లాడినట్టు తెలిసింది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు గత ఎనిమిదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పనులు, విధానాలు తదితర అంశాలనూ ప్రస్తావించినట్టు సమాచారం. గురువారం రాత్రి అమిత్‌షాతో ఈటల రాజేందర్‌ భేటీ అయినప్పుడే మర్రి శశిధర్‌రెడ్డి చేరికపై చర్చ జరిగింది. అమిత్‌షా నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో శశిధర్‌రెడ్డి శుక్రవారం ఆయనను కలిశారని బీజేపీ వర్గాలు తెలిపాయి. 

కొద్దినెలలుగా అసంతృప్తితో.. 
మూడు రోజుల క్రితం ఢిల్లీ వచ్చిన మర్రి శశిధర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసహనంతో ఉన్నారు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి రాష్ట్ర కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు నెలకొన్నాయి. మర్రి శశిధర్‌రెడ్డితోపాటు పలువురు సీనియర్‌ నేతలు కూడా రేవంత్‌రెడ్డిపై తమ అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు. 

ఇక గత ఆగస్టులో కాంగ్రెస్‌లో కల్లోలానికి రేవంత్‌రెడ్డి ముఖ్య కారణమని, ఆయన కాంగ్రెస్‌కు నష్టం చేస్తున్నారని మర్రిశశిధర్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ రేవంత్‌కు ఏజెంట్‌గా పనిచేస్తున్నారని సంచలన ఆరోపణలూ చేశారు. అప్పటి నుంచే ఆయన కాంగ్రెస్‌ను వీడుతారనే ప్రచారం జరిగింది. తాజాగా అమిత్‌షాతో భేటీకావడంతో శశిధర్‌రెడ్డి బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైంది. త్వరలోనే ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేసి కాషాయ కండువా కప్పుకోనున్నట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.   

మరిన్ని వార్తలు