కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌.. బీజేపీలోకి సీనియర్‌ లీడర్‌

27 Feb, 2022 21:23 IST|Sakshi

శ్రీనగర్‌: ఐదు రాష్ట‍్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ జమ్మూ కాశ్మీర్‌లో కాంగ్రెస్‌కు భారీ షాక్‌ తగిలింది. కాంగ్రెస్​ కీలక నేత గులాం నబీ ఆజాద్​ సోదరుడి కుమారుడు ముబాశిర్​ ఆజాద్ ఆదివారం బీజేపీలో చేరారు. జమ్మూ కాశ్మీర్‌ బీజేపీ అధ్యక్షుడు రవీందర్‌ రైనా, ఇతర బీజేపీ సీనియర్‌ నేతల సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీలో తాను చేరే విషయం గులాం నబీ ఆజాద్‌తో చర్చించలేదని వెల్లడించారు. కాంగ్రెస్‌ అధిష్టానం ఆజాద్‌ను అగౌరవపరచడం తనను చాలా బాధించిదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత పోరులో కూరుకుపోయిందని సంచలన వ్యాఖ‍్యలు చేశారు. దేశానికి సేవ చేసిన ఆజాద్‌ను పార్లమెంట్​లో ప్రధాని మోదీ ప్రశంసిస్తే.. కాంగ్రెస్​ పార్టీనే పక్కన పెట్టిందని మండిపడ్డారు. 

ఇదిలా ఉండగా.. క్షేత్రస్థాయిలో ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తనను ప్రభావితం చేసిన కారణంగానే బీజేపీలో చేరుతున్నట్టు స్పష్టం చేశారు. మోదీ నాయకత్వంలో ప్రజల సంక్షేమం కోసం పనులు జరుగుతున్నాయని తెలిపారు. భవిష్యత్తులో బీజేపీ గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.  మరోవైపు గతేడాది కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం, సంస్థాగత నిర్మాణంలో మార్పులు చేయాలంటూ అధిష్టానానికి లేఖ రాసిన 23 మంది కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల్లో ఆజాద్‌ కూడా ఉండటం విశేషం. 
 

మరిన్ని వార్తలు